స్పైనల్‌ కౌన్సెలింగ్‌

Spinal Counseling - Sakshi

వెన్నునొప్పి తగ్గడం లేదు... ఏం చేయాలి?
నా వయసు 29 ఏళ్లు. నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. మా ఇంటి నుంచి ఆఫీసు చేరడానికి నేను కనీసం రోజూ 40 కి.మీ. బైక్‌ మీద వెళ్తుంటాను. ఆఫీసులో అంతా డెస్క్‌ పనే.  నాకు మూడు నెలల క్రితం తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. ఇప్పుడు డాక్టర్‌కు చూపించుకున్నాను. మందులు రాసిచ్చారు. ఒక వారం పాటు వాడాను. నొప్పి తగ్గింది. ఈమధ్య ఒక వారం రోజుల నుంచి వెన్నుతో పాటు మెడ భాగంలో కూడా తీవ్రమైన నొప్పి వస్తోంది. దయచేసి నా సమస్య ఏమిటో చెప్పి, తగిన పరిష్కారం సూచించండి.  – వరుణ్, హైదరాబాద్‌
ఈమధ్య వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మందిలో ఈ వెన్నునొప్పులు సాధారణమైపోయాయి. చిన్నవయసులోనే ఈ నొప్పి బారిన పడుతున్నవారు చాలా మంది ఉన్నారు. ఇక మీ సమస్య విషయానికి వస్తే రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మీరు టూ–వీలర్‌ మీద చాలా లాంగ్‌ డ్రైవింగ్‌ చేయడం. మీ ఇంటి నుంచి మీరు పనిచేసే ప్రదేశానికి 35 కి.మీ. అన్నారు. అంటే రానూపోనూ సుమారు 70 కి.మీ. దూరం మీరు ప్రయాణం చేస్తున్నారు. అందునా తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్య, రోడ్డు మీద ఉండే గతుకుల మధ్య ఇంత దూరం టూ–వీలర్‌పై ప్రయాణం చేయడం ఎంతమాత్రమూ మంచిది కాదు.

ఏకధాటిగా అంతసేపు మీరు బైక్‌ మీద ప్రయాణం చేయడం వల్ల మీ వెన్ను (స్పైన్‌) తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ఇక రెండో విషయానికి వస్తే ఒకే భంగిమలో అదేపనిగా కొన్ని గంటలపాటు కూర్చొని పనిచేయడం వల్ల కూడా మీ వెన్ను తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. అంతేకాకుండా కంప్యూటర్‌ మీద అన్ని గంటలు పనిచేయడం వల్ల కూడా మీకు వెన్నుతో పాటు మెడ నొప్పి కూడా వస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది చాలా ప్రమాదకరం. మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న సీనియర్‌ స్పైన్‌ సర్జన్‌ను కలవండి. వారు కొన్ని పరీక్షలు చేయించి, వాటిని బట్టి మీ సమస్యకు తగిన పరిష్కారం వారు సూచిస్తారు. అయితే ఈలోగా మీరు ఈ కింద పేర్కొన్న కొన్ని సూచనలు పాటించండి.

మీ సీటుకు ముందు భాగాన ఉండే కంప్యూటర్‌ డెస్క్‌ను మీ తలకు సమానంగా ఉండేలా అమర్చుకోండి. దానికి అనుగుణంగా ఉండేలా మీరు ఆఫీసులో కూర్చునే భంగిమ మార్చుకోండి.
 కొన్ని సాధారణ వార్మ్‌అప్‌ వ్యాయామాలు చేయండి
 వెన్ను, మెడ తీవ్రమైన ఒత్తిడికి, వేగవంతమైన కదలికలకు గురికాకుండా చూసుకోండి. ఇలా చేయడం వల్ల కాస్త రిలీఫ్‌గా ఉంటుంది.

స్పైన్‌కు రెండోసారి సర్జరీ అంటున్నారు... ప్రమాదమా?
నేను రెండేళ్ల క్రితం నా వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్నాను. అయితే ఇప్పుడు నాకు విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. ఇక నేను ఎంతమాత్రమూ నడవలేకపోతున్నాను కూడా. మా డాక్టర్‌ను సంప్రదిస్తే, మరోమారు వెన్ను ఆపరేషన్‌ చేయించాలని అంటున్నారు. దాంతో నాకు ఆందోళనగా ఉంది. సరైన సలహా ఇవ్వండి.  – సూర్యనారాయణమూర్తి, కాకినాడ
సాధారణంగా వెన్ను ఆపరేషన్లలో రెండోసారి చేయించాల్సి రావడం తరచూ జరుగుతుండే విషయమే. లేదా చేసిన ఆపరేషన్‌ను మరోమారు సమీక్షించుకోవాల్సి రావడం కూడా జరిగేదే. ఇలా రెండోసారి ఆపరేషన్‌కు దారితీసేందుకు చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకు డిస్క్‌ పక్కకు తొలగడం, ఇన్ఫెక్షన్‌ రావడం, సూడోఆర్థోసిస్‌ వంటి ఎన్నో సందర్భాల్లో చేసిన ఆపరేషన్‌ను మరోమారు సరిదిద్ది, పునఃసమీక్షించుకోవడం అవసరమవుతుంది. అయితే ఆపరేషన్‌ జరిగే ప్రదేశం అత్యంత కీలకమైన ‘వెన్నెముక’కు కాబట్టి, పైగా ఇది రెండోసారి ఆపరేషన్‌ కాబట్టి  మీరు నిపుణులైన సర్జన్లతోనే దీన్ని చేయించుకోవాలి.

స్పర్శ తగ్గుతోంది... మూత్రంపై అదుపు తప్పుతోంది!
ఇటీవల నా చేతుల్లో క్రమంగా స్పర్శ తగ్గుతోంది. కాళ్లు బిగుసుకుపోయినట్లుగా మారుతున్నాయి. మెడనొప్పి కూడా వస్తోంది. మూత్రానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో దాన్ని ఆపుకోవడం చాలా కష్టమవుతోంది. పైగా నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్‌ కూడా తప్పుతోంది. నా సమస్యలకు పరిష్కారం చెప్పండి. – ఎల్‌. రామ్మోహన్‌రావు, విజయవాడ
మీరు చెప్పినదాని ప్రకారం మీరు ‘సర్వైకల్‌ మైలోపతి’ అనే సమస్యతో బాధపడుతున్నారనిపిస్తోంది. మెడ భాగంలోని వెన్నునరాలపై పడే ఒత్తిడి కారణంగా మీరు చెప్పిన లక్షణాలు మీలో కనిపిస్తున్నాయని లక్షణాలను బట్టి ప్రాథమికంగా నా అభిప్రాయం.

అయితే వ్యాధినిర్ధారణ కోసం ఒక క్రమపద్ధతిలో క్లినికల్‌ పరీక్షలు, ఎమ్మారై వంటి పరీక్షలు చేసి దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు వచ్చిన కండిషన్‌ ‘సర్వైకల్‌ మైలోపతి’ అని నిర్ధారణ అయితే, ఆ వ్యాధి తీవ్రత ఆధారంగా మీకు మెడ ముందు భాగం నుంచి గానీ లేదా మెడ వెనకభాగం నుంచిగానీ శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ముందుగా మీరు మీకు దగ్గర్లోని వైద్యనిపుణులను సంప్రదించి తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. ఆ ఫలితాలను బట్టి మున్ముందు అవసరమైన చికిత్స నిర్ణయించవచ్చు.

– డాక్టర్‌ జి. వేణుగోపాల్, సీనియర్‌ న్యూరో అండ్‌ స్పైన్‌ సర్జన్, యశోద హాస్పిటల్స్,   మలక్‌పేట, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top