నేరసామ్రాజ్య మహారాణులు

Special story to womens criminals - Sakshi

‘క్వీన్స్‌ ఆఫ్‌ క్రైమ్‌’ అనే 288 పేజీల పుస్తకాన్ని ప్రతిష్టాత్మక ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్‌’ ఈనెల 20న విడుదల చేస్తోంది. టీవీలో ఏడేళ్లుగా ప్రసారం అవుతున్న హిందీ క్రైమ్‌ షో ‘సావ్‌ధాన్‌ ఇండియా’ వ్యాఖ్యాత సుశాంత్‌ సింగ్, థ్రిల్లర్‌ ఫిక్షన్‌లో చెయ్యి తిరిగిన రచయిత కుల్‌ప్రీత్‌ యాదవ్‌ కలిసి రాసిన ఈ ఇంగ్లిషు పుస్తకంలో కరడుగట్టిన పది మంది మహిళల నిజ జీవిత నేర చరిత్ర ఎంతో ఉత్కంఠభరితంగా పొందుపరచబడి ఉందని పెంగ్విన్‌ ప్రకటించింది. అయితే ఆ పేరుమోసిన మహిళా నేరస్థులు ఎవరన్నది రచయితలు గానీ, పెంగ్విన్‌ గానీ వెల్లడించలేదు! నో ప్రాబ్లం. ఆ పదిమంది జాబితాలో ఉండేందుకు అవకాశం ఉన్న కొందరు ‘ఉమెన్‌ క్రిమినల్స్‌’ గురించి మనమే అంచనావేద్దాం. 

ఇంద్రాణి ముఖర్జియా
భారతదేశ చరిత్రలోనే మోస్ట్‌ తికమక మర్డర్‌ కేస్‌లోకి ఇప్పుడు మీరు ప్రయాణిస్తున్నారు. మలుపుల్లో మెలకువగా ఉండకపోతే దారి తప్పడం ఖాయం.  గౌహతిలో ఒక జంట. ఇంద్రాణి అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. ఇంద్రాణి టీనేజ్‌లోకి వచ్చింది. టీనేజ్‌లోనే గర్భవతి అయింది! కుటుంబ సభ్యుల్లోనే ఒకరు ఆమె గర్భానికి కారణమని అనుమానం. ఇంద్రాణి ఇల్లొదిలి వెళ్లిపోయింది. షీనాకు జన్మనిచ్చింది. సిద్ధార్థ దాస్‌ను పెళ్లి చేసుకుంది. ఇంద్రాణి, సిద్ధార్థ కలిసి మైఖేల్‌ బోరా అనే బిడ్డకు జన్మనిచ్చారు. ఇంద్రాణి సిద్ధార్థకు విడాకులిచ్చి సంజీవ్‌ ఖన్నాను పెళ్లి చేసుకుంది. ఇంద్రాణికి, సంజీవ్‌కి విధి ఖన్నా జన్మించింది. ఇంద్రాణి, సంజీవ్‌ విడాకులు తీసుకున్నారు. ఇంద్రాణి ముంబైకి చేరుకుంది. అక్కడ పీటర్‌ ముఖర్జియాను చేసుకుంది. షీనా బోరా, విధి ఖన్నా కూడా ముంబై వచ్చి ఇంద్రాణి, పీటర్‌ దగ్గర ఉండిపోయారు. పీటర్‌ మాజీ భార్య షబ్నమ్‌. పీటర్‌కి, షబ్మమ్‌కి రాహుల్‌ అనే ఒక కొడుకు ఉన్నాడు. షీనా, రాహుల్‌ మనసులు కలిశాయి. రిలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఆ రిలేషన్‌కి ఇంద్రాణి, పీటర్‌ ‘నో’ చెప్పారు. అప్పుడే ఇంద్రాణి తండ్రి ఎవరో బయట పడింది. అతడు బయటి వ్యక్తి కాదు. కుటుంబ సభ్యుడే! షీనా ఫారిన్‌ అకౌంట్‌లో భారీ మొత్తంలో డబ్బు ఉంది. ఆ డబ్బు వేసిన ఇంద్రాణి. ఆ డబ్బు కావాలని ఇంద్రాణి అడిగితే షీనా ‘నో’ అంది. షీనాను చంపేయాలని సిద్ధార్థ, (మళ్లెందుకొచ్చాడో!) ఇంద్రాణి డిసైడ్‌ అయ్యారు. పకడ్బందీగా ప్లాన్‌ చేసి షీనాను చంపేశారు. ఇదీ కేసు. ఒక్క ముక్క అర్థం కాలేదా! సీబీఐకీ అర్థమైనట్లు లేదు. ఏడేళ్లుగా ఈ కేసు నడుస్తోంది. ఎవరు ఎవరికి జన్మనిచ్చారో, ఎవరికి ఎవరు జన్మించారో బయటపడుతున్న కొద్దీ కేసు కొత్త మలుపుల్లో చిక్కుకుపోతోంది. 

అంజనాబాయ్‌
అంజనాబాయ్‌ ఒకరు కాదు ఇద్దరు. ఇద్దరు కాదు. ముగ్గురు. ముగ్గురు కాదు నలుగురు. అంజన పుణెలో ఉండేది. జేబులు కొట్టేసేది. రైల్వే స్టేషన్‌లలో చెయిన్‌ స్నాచింగ్‌లు చేసేది. 125 కేసుల్లో నిందితురాలు. అన్నీ పెట్టీ్ట కేసులే. 1990లో భర్త ఆమెను వదిలేసి ఇంకో మహిళను పెళ్లి చేసుకోవడంతో ఆమె నేరస్వభావం అమానుష స్థాయిని చేరుకుంది. అప్పటికి ఆమె వయసు 58 ఏళ్లు. పిల్లల్ని అపహరించడం, వారి చేత చోరీలు చేయించడం, గుట్టు బయట పెట్టేస్తారనుకున్నప్పుడు వాళ్లను చంపేయడం! ఇందుకు ఆమె తన ఇద్దరు కూతుళ్ల సహాయం తీసుకుంది. ఒక కూతురు భర్తను కూడా రొంపిలోకి లాగింది. ఈ తల్లీకూతుళ్లు ఆరేళ్లవ్యవధిలో పన్నెండు మంది పిల్లల్ని అపహరించారు. ఆ పిల్లల్లో కొందరిని కొట్టి చంపారు. మొత్తానికి నలుగురూ చట్టానికి చిక్కారు. అరెస్టయిన ఏడాదికి అంజనాబాయ్‌ చనిపోయింది. 2001లో ఆమె ఇద్దరు కూతుళ్లను ఉరితీశారు. విచారణలో అల్లుడు నిర్దోషి అని తేలడంతో అతడిని వదిలిపెట్టారు.

నేహా వర్మ
నేహా వర్మ బ్యూటీషియన్‌. ముంబైలోని ఆర్బిట్‌ మాల్‌లో నిండా నగలు వేసుకుని ఉన్న మేఘా దేశ్‌పాండే ఆమె కంటపడింది. నేహాకు రిచ్‌ లైఫ్‌ అంటే వ్యామోహం. మేఘ ఒంటిని, ఇంటిని దోచుకోవాలని ప్లాన్‌ చేసింది. ఏదైనా ఉద్యోగం చూపించమని పరిచయం చేసుకుంది. మేఘ దగ్గర మంచి మార్కులు కొట్టేసి, ఆమె ఇంటికి రాకపోకలు మొదలు పెట్టింది. దోపిడికి ప్లాన్‌ చేశాక రాహుల్, మనోజ్‌ల సహాయం తీసుకుంది. రాహుల్‌ పూర్వ పరిచయస్తుడు. బాగా డబ్బు సంపాదించి అతడితో కలిసి హాయిగా జీవించాలని నేహ ఆశ. ప్లాన్‌ ప్రకారం ఓ రోజు ముగ్గురూ మేఘ నివాసంలోకి వెళ్లారు. రాహుల్, మనోజ్‌.. మేఘతో (42) పాటు ఆమె కూతురు ఆశ్లేష (21), ఆమె తల్లి రోహిణిని మొదట తుపాకులతో కాల్చి, కత్తులతో పొడిచి పొడిచి చంపేశారు. లక్షన్నర క్యాష్, ఐదు లక్షల విలువైన ఆభరణాలు, రెండు ఏటీఎం కార్డులు దోచుకెళ్లారు. కాల్పులు జరిపేటప్పుడు రాహుల్‌ ఆ కంగారులో తన కాలిపై తనే కాల్చుకుని ట్రీట్‌మెంట్‌ కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేరడంతో పోలీసులకు దొరికిపోయాడు. ఆ వెంటే మిగతా ఇద్దరూ పట్టుపడ్డారు. కోర్టు విచారణ జరిపి ‘రేరెస్ట్‌ ఆఫ్‌ రేర్‌’ కేసు అంది. వీళ్లు క్షమార్హులు కాదంది. ముగ్గురికీ మరణశిక్ష విధించింది. 

సిమ్రాన్‌ సూద్‌
బులెట్‌ దిగబడితేనన్నా బతికి బట్టకడతారేమో. సిమ్రాన్‌ సూద్‌ చిన్న లుక్‌ ఇచ్చిందంటే ఆ మరణాన్ని అనుభవించి తీరవలసిందే. ఆ అమ్మాయిని వలలో వేసుకుని రెండు హత్యలకు స్కెచ్‌ వేశాడు విజయ్‌ పలాండే. అప్పటికే గ్యాంగ్‌స్టర్‌ అతడు. 1998లో ఒక మర్డర్, 2002లో ఇంకో మర్డర్‌ అతడి క్రిమినల్‌ అకౌంట్‌లో ఉన్నాయి.  సిమ్రాన్‌ని ‘హనీ ట్రాప్‌’గా ఎరవేసి, మనీ సంపాదించడం మొదలు పెట్టాడు. మనీ అంటే నోట్ల కట్టలు కాదు. పెద్దపెద్ద ప్రాపర్టీలు! సంతకం పెడతావా, స్పాట్‌ పెట్టమంటావా అని అడిగేవాడు. సంతకం పెట్టేవాళ్లు. అయినా స్పాట్‌ పెట్టేవాడు. పలాండే కన్ను వర్థమాన నటుడు అనూజ్‌ టిక్కు ఉంటున్న లొఖాండవాలా (ముంబై) కాంప్లెక్‌లోని అతడి అపార్ట్‌మెంట్‌ మీద పడింది. అతడిపైకి సిమ్రాన్‌ని ప్రయోగించాడు. సిమ్రాన్‌.. పలక్కాడ్‌ని తన బ్రదర్‌గా అనూజ్‌కి, కరణ్‌కుమార్‌ అనే సినీ నిర్మాతకు పరిచయం చేసింది. కరణ్‌ కుమార్‌ నిర్మాత. అతడిని చంపేశారు. అనూజ్‌ తండ్రి అరుణ్‌ని చంపేశారు. తర్వాత పోలీసులు సిమ్రాన్‌ని, పలాండేని అరెస్ట్‌ చేశారు.

మారియా సుసాయ్‌రాజ్‌
మారియా సుసాయ్‌రాజ్, ముంబైలోని ఒక టీవీ చానల్‌ ఎగ్జిక్యూటివ్‌ నీరజ్‌ గ్రోవర్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌. సడన్‌గా నీరజ్‌ మాయం అయ్యాడు. మారియా పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చింది. విచారణలో వెల్లడైన నిజాలకు పోలీసులే వణికిపోయారు. 2008 మే 6. నీరజ్‌ చెన్నైలోని మారియా ఫ్లాట్‌లో ఉన్నాడు. ఆ సంగతి మారియా మరో ఫ్రెండ్‌ ఎమిలీ జెరోమ్‌కి తెలిసింది. ముంబైలో నేవీ ఆఫీసర్‌ అతడు. నీరజ్, మారియా రిలేషన్‌లో ఉన్నారని అతడికి అనుమానం వచ్చింది. వెంటనే విమానంలో చెన్నై వచ్చి వాళ్లిద్దర్నీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. నీరజ్‌ని అక్కడికక్కడే చంపేశాడు. శవాన్ని ఫ్లాట్‌లోనే ఉంచి, బయటికి వెళ్లి దగ్గర్లోని మాల్‌లో కత్తిని కొనుక్కొచ్చి నీరజ్‌ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టాడు. ఆ ముక్కల్ని గోనె సంచిలో కుక్కి, దగ్గర్లోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తగలబెట్టాడు. ఇంతా చెయ్యడానికి మారియా సహకరించింది. జెరోమ్‌ తేలికపాటి శిక్షతో బయట పడ్డాడు. సాక్ష్యాల్ని చెరిపే ప్రయత్నం చేసినందుకు మారియాకు పెద్ద శిక్ష పడింది. రామ్‌ గోపాల్‌ వర్మ తీసిన ‘నాట్‌ ఎ లవ్‌ స్టోరీ’కి ఈ ఘటన కూడా ఒక ప్రేరణ.

బేబీ పటాన్‌కర్‌
2015 ఏప్రిల్‌లో అరెస్ట్‌ అయ్యేనాటికి బేబీ పటాన్‌కర్‌ వయసు 52 ఏళ్లు. అసలు పేరు శశికళా పటాన్‌కర్‌. అప్పటికి ఇరవై ఏళ్లుగా ఆమె డ్రగ్స్‌ బిజినెస్‌లో ఉంది. గంజాయి అమ్ముతూ పట్టుబడి 2001లో ఒకసారి అరెస్ట్‌ అయి, బయటికి వచ్చింది. బాంబేలో డ్రగ్‌ బ్యారెన్‌గా ఎదిగింది. మ్యూ–మ్యూ (పార్టీ డ్రగ్‌), ఎం–క్యాట్, బబుల్స్‌.. ఇలా గిరాకీ ఉన్న డ్రగ్గులన్నిటికీ బేబీ అండర్‌ వరల్డ్‌ డీలర్‌. ఆమె పేరు యు.కె. వరకు  వెళ్లింది. ఆ టైమ్‌లోనే ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ధర్మరాజ్‌ కలోఖే దగ్గర 120 కేజీల ‘బబుల్స్‌’ (మెఫెడ్రోన్‌) పట్టబడింది. ధర్మరాజ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌. మెరైన్‌ డ్రైవ్‌ పోలీస్‌స్టేషన్‌లోనే, అతడి డెస్క్‌లోనే ఇంత డ్రగ్గు బయటపడింది. డొంక కదలింది. బేబీ సామ్రాజ్యం బీటలు వారింది. పోలీసులు అరెస్ట్‌ చేశారు.                  

సైనేడ్‌ మల్లిక
‘సైనేడ్‌ మల్లిక’ పేరు వింటే ఇప్పటికీ బెంగుళూరులో ఆడవాళ్లు మెడలోని ఆభరణాలను తడుముకుంటారు! ఆమె అసలు పేరు కేడీ కెంపన్న. కంట్రీస్‌ ఫస్ట్‌ ఫిమేల్‌ సీరియల్‌ కిల్లర్‌. కర్ణాటకలోని కగ్గరిపుర ఆమె బర్త్‌ ప్లేస్‌. చిట్‌ ఫండ్‌ బిజినెస్‌ చేసేది. అందులో భారీగా లాస్‌ రావడంతో భర్త ఆమెను అప్పులవాళ్లకు వదిలేసి పారిపోయాడు. ఎలాగైనా డబ్బు సంపాదించి, అప్పులు తీర్చి రిచ్‌గా బతకాలని మల్లిక ఆశ. ఆడవాళ్లను నమ్మించి, వాళ్లను చంపి ఒంటిపై బంగారు నగల్ని దోచుకోవడం మొదలుపెట్టింది. ఒక్క బెంగుళూరులోనే ఆమె ఈ ఇరవై ఏళ్లలో ఐదు హత్యలు చేసింది. గుడులకు తిరగడం, డిప్రెషన్‌లో ఉన్నవాళ్లను కనిపెట్టడం, పూజ చేస్తే ఫలం ఉంటుందని నమ్మించి పాడుబడిన దేవాలయాలకు తీసుకెళ్లి సైనేడు కలిపిన నీళ్లు తాగించడం, వాళ్లు చనిపోయాక ఒంటి మీద నగలు ఒలుచుకెళ్లడం.. ఇదీ మల్లిక స్టెయిల్‌ ఆఫ్‌ క్రైమ్‌. ఆరో హత్య చేయబోతుండగా కలాసిపాళ్యం పోలీసులకు దొరికిపోయింది. 

ఫూలన్‌దేవి
మన దేశంలోని ఆడపిల్ల పుట్టడమే తాళిబొట్టుతోనైనా పుడుతుందేమో కానీ, తుపాకీ చేతబట్టి మాత్రం పుట్టదు. ఫూలన్‌ జీవితంలో ఇవి రెండూ జరిగాయి. పదకొండేళ్ల వయసులో ఇష్టంలేని పెళ్లితాడును పుటుక్కున తెంపేసిన ఫూన్‌దేవి, అగ్రకులాలవారు దురహంకారంతో తనపై జరిపించిన అత్యాచారాలను భరించలేక ఆయుధాన్ని చేతపట్టింది. 21 మందిని గన్‌డౌన్‌ చేసింది. పోలీస్‌ హంట్‌ మొదలైంది. పిట్టకు దొరకలేదు ఫూలన్‌. చివరికి తనే లొంగిపోతానని చీటీ పంపింది. అయితే కొన్ని కండిషన్స్‌ పెట్టింది. మధ్యప్రదేశ్‌ పోలీసులకు మాత్రమే సరెండర్‌ అవుతానంది. యు.పీ.పోలీసుల మీద నమ్మకం లేదంది. తన ఆయుధాల్ని దుర్గామాత ఎదుటగానీ, మహాత్మాగాంధీ ఫొటో ముందు కానీ పెడతానంది. తనకు మరణశిక్ష విధించబోమన్న హామీ కావాలంది. తన అనుచరులకు వేసే శిక్ష ఎనిమిదేళ్లకు మించకూడదంది. కొంత భూమిని ఇవ్వాలంది. లొంగిపోయే రోజు తన కుటుంబం మొత్తానికీ పోలీస్‌ ఎస్కార్ట్‌ ఉండాలంది. అన్నిటికే ‘ఎస్‌’ అంది గవర్నమెంట్‌. బందిపోటు రాణిగారు సాక్షాత్కరిస్తే చాలు అనుకుంది! మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి అర్జున్‌సింగ్, 300 మంది పోలీసులు, పదివేల మంది పౌరులు.. ఇంతమంది హాజరయ్యారు ఫూలన్‌ లొంగుబాటు కార్యక్రమానికి! ఆమెపై 48 కేసులు పెట్టారు. విచారణ పేరుతో 11 ఏళ్లు జైల్లో ఉంచారు. చివరికి.. సత్ప్రవర్త కలిగి ఉంటాననే హామీ తీసుకుని విడుదల చేశారు. ములాయం సింగ్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఫూలన్‌ పై కేసులన్నీ తీయించేశారు. రాజకీయాల్లోకి తీసుకున్నారు. ఫూలన్‌ ఎంపీ అయ్యాక.. పార్లమెంట్‌లో లంచ్‌ బ్రేక్‌కి బయటికి వచ్చినప్పుడు దుండగులు ఆమెను కాల్చిచంపారు. భారతదేశంలో ఇప్పుటికీ నటోరియస్‌ ఉమన్‌ క్రిమినల్‌ ఎవరూ అంటే ఫూలన్‌దేవే! చట్టం దృష్టిలోనే ఆమె నటోరియస్‌ కావచ్చు. అంతకన్నా నటోరియస్‌.. ఆమెను అలా మార్చిన పరిస్థితులు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top