అచ్చతెలుగు కన్నడమ్మాయి

special story to tv serial actor meghana - Sakshi

చిలిపితనం, అమాయకత్వం, అందం కలబోస్తే.. మేఘన! కన్నడ దేశంలో పుట్టిన ఈ అమ్మాయి ‘శశిరేఖ’గా  టీవీ వీక్షకుల మదిని దోచుకున్నారు. మంగ, నిత్య పాత్రలతో భిన్న పాత్రలను పోషిస్తున్నారు. కథానాయికగాను,  ప్రతికథానాయికగానూ నటనలో వైవిధ్యం చూపుతున్నారు. ఈ విలక్షణ నటితో ఆమె ‘టీవీయానం’  గురించి సాక్షి ముచ్చటించింది. 

మేఘన.. ‘ఆలీబాబా 40 దొంగలు’ అనే కన్నడ నాటకంలోని కథానాయిక ‘హసీనా’ పాత్రతో మొట్టమొదటిసారిగా రంగస్థలం మీద కనిపించారు.  తర్వాత ‘రాబిన్‌హుడ్‌’ నాటకంలో నటించారు. మండ్యా రమేశ్‌ స్థాపించిన ‘నటన’ రంగ మందిరంలో తన ఎనిమిదవ ఏటనే చేరి స్టేజ్‌ నాటకాల కోసం నటనలో శిక్షణ పొందారు. ఈ రోజు తాను టీవీ తారను కావడానికి కారణం తన గురువు గారేనంటారు మేఘన. ‘‘నేను పుట్టింది మైసూరులో. అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. ప్రస్తుతం అమ్మ, అన్నయ్య, అమ్మమ్మ, నేను మైసూరులోనే ఉంటున్నాం’ అని వారి ఫ్యామిలీ గురించి మరిన్ని వివరాలు చెప్పారు మేఘన. 

బెస్ట్‌  న్యూస్‌ ఫేస్‌
‘‘నేను ఈ రోజు నటిని అయ్యానంటే రమేశ్‌గారే కారణం. మా అమ్మ, నాన్న కూడా నన్ను బాగా ఎంకరేజ్‌ చేశారు. మా కుటుంబంలో అందరూ ఉన్నత చదువులు చదువుకున్నవారే. నేను మాత్రమే మధ్యలో నటన వైపు మళ్లాను. నాకు 14 సంవత్సరాలు వచ్చేవరకు రంగస్థలం మీదే ఉన్నాను. స్కూల్లో కంటే ‘నటన’ సంస్థలోనే ఎక్కువసేపు ఉండేదాన్ని. అయితే నాకై నేను ఎప్పుడూ యాక్టర్‌ని కావాలి అనుకోలేదు. ఇంట్లో అందరికీ కళలంటే అభిమానం. అందువల్ల నాకు ప్రోత్సాహం లభించి ఉంటుంది. మొత్తం 250 నాటక ప్రదర్శనలిచ్చాను. డిగ్రీ చదువుతుండగా తొలిసారి కన్నడ సీరియల్‌లో అవకాశం వచ్చింది. ఒక భక్తి సీరియల్‌లో అది సపోర్టింగ్‌ పాత్ర. ఆ సీరియల్‌కి ‘బెస్ట్‌ న్యూ ఫేస్‌’ అవార్డు వచ్చింది. ఆ తరవాత కన్నడలోనే రెండు సీరియల్స్‌ చేశాను. కొద్ది రోజులకే తెలుగులో అవకాశం వచ్చింది. ‘శశిరేఖా పరిణయం’ సీరియల్‌ కోసం తెలుగులో అన్నపూర్ణ సంస్థ వాళ్లు పిలిపించారు. ‘‘నాన్నగారికి ఇష్టం లేకపోయినా నా ఉత్సాహం చూసి సరేనన్నారు. మా అమ్మమ్మ నాగరత్నం ఈ రోజు వరకు నాతో షూటింగులకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ‘జీ’ తెలుగులో  ‘కల్యాణ వైభోగమే’ చేస్తున్నాను. చూసే ఉంటారు ఇందులో మంగ, నిత్య రెండూ నేనే. నెగెటివ్‌ అండ్‌ పాజిటివ్‌. ఇప్పుడు ‘రక్తసంబంధం’ అనే కొత్త సీరియల్‌ వస్తోంది’’ అని చెప్పారు మేఘన.

అటొక అడుగు ఇటొక  అడుగు
తండ్రి అనారోగ్యం రీత్యా చాలాకాలం షూటింగ్‌ కోసం  మైసూరు, హైదరాబాద్‌ మధ్య ప్రయాణాలు చేశారు మేఘన. అందువల్ల కొన్నిసార్లు షూటింగులకు వెళ్లలేకపోయేవారు. దాంతో నటనకు కొంతకాలం విరామం వచ్చింది. ‘‘కిందటి సంవత్సరం నాన్నకి క్యాన్సర్‌ బయపడింది. సీరియల్స్‌ చేస్తూ నాన్నను చూసుకోవలసి వచ్చింది. యూనిట్‌ సహకరించడం వల్లనే మధ్య మధ్యలో మైసూరు వెళ్లి నాన్నని చూసి వచ్చేందుకు వీలైంది. ఓసారి  మనసు ఉండబట్టలేక, నాన్న దగ్గర పది రోజులు ఉందామని బయలుదేరాను. కాని మైసూరు వచ్చి ఆసుపత్రిలో ఆయనను చేర్చే లోపే అంతా జరిగిపోయింది. చివరి రోజుల్లో నాన్న దగ్గర ఎక్కువరోజులు ఉండలేకపోయాననే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ బాధను మరచిపోలేకపోయాను చాలాకాలం’’ అని తండ్రిని గుర్తు చేసుకున్నారు మేఘన.

తెలుగు వారే ఆదరించారు
బిజీగా ఉంటే కోలుకోవచ్చుననే ఉద్దేశంతో మళ్లీ సీరియల్స్‌ ఒప్పుకున్నారు. నాలుగైదు రోజులకి ఒకసారి మైసూరు వెళ్లి వస్తున్నారు. తెలుగు సీరియల్స్‌లో బిజీగా ఉండటం వల్ల తెలుగు చిత్రాలకు, కన్నడ సీరియల్స్‌కు చెయ్యలేకపోతున్నారు. ‘‘నన్ను తెలుగు వారు బాగా ఆదరించారు. ‘శశి బి టెక్‌’ గా నేను పాపులర్‌ అయ్యాను. అందరూ తెలుగింటి ఆడపడుచుననే అనుకుంటున్నారు’’ అని సంతోషంగా చెప్పారు మేఘన. పరిశ్రమలో ఇంతవరకు తాను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, పరిశ్రమ నుంచి పిలుపు అందుకుని, వచ్చిన పాత్రలు మాత్రమే చేస్తున్నాననీ చెప్పారు. 
– పురాణపండ  వైజయంతి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top