అక్కినేని నాగార్జున నటించిన ఐకానిక్ కమర్షియల్ మూవీ 'శివ' రీరిలీజ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో రామ్‌గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్‌గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇప్పుడు తెలుగులో మరోసారి వెండితెరపైకి రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కల్ట్ మూవీ శివను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ మూవీని మరోసారి బిగ్ స్క్రీన్‌పై ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే శివ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సరికొత్త 4కె వర్షన్‌లో శివ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్, హీరోలు శివ మూవీపై ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమా గతిని మార్చేసిన సినిమా శివ అంటూ పలవురు స్టార్స్ కామెంట్స్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం శివ 4కె ట్రైలర్ మీరు కూడా చూసేయండి.
కాగా.. ఈ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్‌గా నటించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్‌ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించారు రాం గోపాల్ వర్మ.


