ప్రేమే నేరమా!?

Special story on pranai murder - Sakshi

పరువును చూసుకుని పిల్లలు ప్రేమించరు. ‘పరువు తీసే’ ప్రేమను పెద్దలు క్షమించరు. ప్రేమకు, పరువుకు మధ్య తీరని ఘర్షణ ఇది! తరతరాల సంఘర్షణ ఇది. పెద్దలూ ఒకప్పటి పిల్లలే కదా. ఈ నిజాన్ని గుర్తుకు తెచ్చుకుంటే.. ప్రేమ నేరం అవదు. పరువు గుర్తుకే రాదు.

‘‘అమృత వర్షిణి ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఆ అమ్మాయి బాధ చూడలేకపోతున్నాం! దేవుడా.. ఇంత దారుణమా? కన్నబిడ్డల సంతోషం, సుఖం కంటే కావల్సిందేముంది? వాళ్లు ఆనందంగా కనపడుతున్నప్పుడు ‘‘కలకాలం ఇలాగే ఉండనీ’’ అని ఆశీర్వదించాలి. అంత పెద్ద మనసు లేకపోతే.. నోటికి అంత మంచి మాట రాకపోతే.. దూరంగా ఉండిపోవాలి. అంతేకాని ఉసురు తీస్తారా?’’ ఇలాగే బాధపడ్తారు.. ఆలోచిస్తారు స్పందించే గుణమున్న మనుషులైతే!


(ప్రణయ్‌ – అమృత (ఫైల్‌ఫొటో) )

 
పిల్లలు ఎందుకు బలి కావాలి?
అమృత వర్షిణి పెద్ద కులం (?) అమ్మాయి. ప్రణయ్‌.. తక్కువ కులం (?) అబ్బాయి. ఆ అమ్మాయి వాళ్లు బాగా డబ్బున్నవాళ్లు. ఈ అబ్బాయి వాళ్లదీ సౌకర్యవంతమైన జీవనశైలిలో ఉన్న కుటుంబమే. అబ్బాయి ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. కెనడా వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు కూడా. అయితే ఇవేవీ అమ్మాయి తల్లిదండ్రులకు కనిపించలేదు. ‘తక్కువ కులం’ అన్నదొక్కటే  భూతద్దంలో కనిపించింది. అదీ పరువు అనే  వృత్తంలో తిరుగుతూ! అదే వాళ్ల మెదడులోనూ గింగిరాలు కొట్టింది. అందుకే అదను కాచి కన్న బిడ్డ ఆనందాన్ని మింగేశారు. బిడ్డ భవిష్యత్తును మరిచి.. విచక్షణను కోల్పోయి అనాగరికంగా ప్రవర్తించారు. పైగా దాన్ని సమర్థించుకుంటున్నారు. రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కన్నా సమాజం పెంచిన కులం, పరువే ముఖ్యమని చెప్తున్నారు.

ఇప్పుడు ఆత్మావలోకనం చేసుకుందాం తప్పు ఎవరిదో? అమృత వర్షిణికి కలిగించిన దుఃఖం, బాధ, వేదనలో మన పాలు ఎంత ఉందో? ప్రణయ్‌ను పోగొట్టుకున్న తల్లి శోకానికీ మనమెంత బాధ్యులమో? కులాన్ని సృష్టించి ఆ నియమంలో బతికితేనే పరువు అనే భ్రమకు రూపమిచ్చే పిచ్చి ప్రయత్నం చేస్తూ అదే నిజమని నమ్మే మనుషులతో సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది చిరంజీవిగా వర్థిల్లడానికి  పిల్లల్ని బలిపెడుతూ వస్తున్నాం.

ఇంకెన్ని? ఇంకెంత కాలం?
మొన్ననే.. ఆగస్ట్‌ 23న  అబ్దుల్లాపూర్‌మెట్‌లో విజయలక్ష్మిని సొంత తల్లిదండ్రులే హత్య చేశారు. అమ్మాయికి 27 ఏళ్లు. తాము ఉండే వాడకట్టులోనే ఉంటున్న సురేష్‌ అనే వ్యక్తిని ప్రేమించింది. ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. భద్రాచలంలో కాపురం పెట్టారు. సంతోషంగానే ఉంటున్నారు. ఒక బాబు కూడా పుట్టాడు. మూడేళ్లవాడయ్యాడు. ఆ అమ్మాయి మళ్లీ గర్భందాల్చింది. ఏడు నెలలు.  ఈలోపు అత్తగారు పోయారని తెలిసి భర్త, పిల్లాడితో కలిసి నాలుగేళ్ల తర్వాత ఆ ఊళ్లోకి అడుగుపెట్టింది. కూతురు వచ్చిన విషయం తెలుసుకొని అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారు ఆమె రాను మొర్రో అని అంటున్నా వినకుండా. తర్వాత ఆ అమ్మాయి అదే ఇంట్లో శవమై కనిపించింది.

కూతురి పెళ్లయి నాలుగేళ్లు గడిచినా వాళ్ల కోపం పోలేదు. ఓ బిడ్డను, ఇంకో బిడ్డను కడుపులో మోస్తున్నా ఆ తల్లి మీద దయ రాలేదు. పరువు కోసం కన్న పేగును కోసేసుకున్నారు.
2017లో.. మార్చి నెలలో  తెలంగాణ, పెద్దపల్లికి చెందిన మంథని మధుకర్‌ అనే దళిత యువకుడిని, అగ్ర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడని, అమ్మాయి తరపు బంధువులు అతనిని కిడ్నాప్‌ చేసి హత్య చేశారు.

ఈ సంఘటన తర్వాత అదే యేడు యాదాద్రి జిల్లాకు చెందిన నరేష్, స్వప్నలూ చనిపోయారు. స్వప్న పెద్ద కులస్తురాలు. వాళ్లకన్నా తక్కువ కులానికి చెందిన నరేష్‌ను ప్రేమించి, పెళ్లిచేసుకుందనే కోపంతో స్వప్న తండ్రి ఓ పథకం ప్రకారం ముందు నరేష్‌ను హత్య చేయించాడు. తర్వాత స్వప్న పుట్టింట్లోనే.. బాత్రూమ్‌లో ఉరేసుకుని శవంగా కనిపించింది. అయితే పెళ్లయ్యాక ఈ జంట షోలాపూర్‌లో కాపురముంటుంటే.. స్వప్నను ముందు ఇంటికి తెచ్చి.. తర్వాత నరేష్‌ను హత్య చేయించారు. పెద్దల పట్టింపు, మూర్ఖపు పట్టుదలలు పిల్లలను హత్యచేశాయి.

హత్య చేయడం పరువా?! : సుప్రీం కోర్టు
ఇవి యేడాది కిందటివి. అంతకుముందూ హానర్‌ కిల్లింగ్స్‌ ఉన్నాయి. ఉత్తర భారతదేశానికే పరిమితం అనుకున్న పరువు హత్యలు మనకూ వ్యాపించాయి అంటు వ్యాధిలా.  2014 చివర నుంచి 2017 దాకా అంటే ఆ రెండున్నరేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 17 పరువు హత్యలు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా కులాంతర వివాహానికి సంబంధించినవే.  2014– 2015 నేషనల్‌ క్రైమ్‌రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం హానర్‌ కిల్లింగ్స్‌లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లే ఉన్నాయి.

అంతకంతకూ పెరుగుతున్న వీటి సంఖ్యను చూసి అదిరిపడ్డ సుప్రీంకోర్టు 2006లో ‘‘ హత్య చేయడంలో పరువు ఎక్కడుంది? హేయంగా, దారుణంగా, ఘోరంగా, అమానుషంగా  చేసే ఈ హత్యల వెనక రాక్షసత్వం, భూస్వామ్య ఆధిపత్య మనస్తత్వం తప్ప ఇంకోటి లేదు. ఇలాంటి చర్యలకు ఒడిగట్టేవాళ్లు కఠిన శిక్షకు అర్హులు’’ అంటూ తీర్పునిచ్చింది. సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానమే అంతటి తీర్పునిచ్చినా భయపడట్లేదు. పరువు హత్యలు ఆగలేదు. అంటే అర్థమైంది కదా.. కులం ఎంత బలమైందో. అది పెంచి పోషిస్తున్న పరువు ఎంతటికి తెగిస్తుందో?

లేనిది వచ్చిందా? ఉంటే పెరిగిందా?
ఒకమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడానికి మనసులు కలవాలి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉండాలి. ఎన్ని కష్టాలొచ్చినా కలిసి బతకగలమనే ధైర్యం ఉండాలి. బ్యాలెన్స్‌ చేసుకోగల సత్తా ఉండాలి. వీటిల్లో కులం ప్రాధాన్యం ఎక్కడ ఉంది? దాని ప్రస్తావన ఎందుకు? కాపురానికి కులం అక్కర్లేనప్పుడు దాన్ని అంటుకుని ఉన్న పరువు గురించి ఎందుకు అంత గింజుకులాట?  అమృత విషయంలోనే వాళ్ల నాన్న మారుతీరావును తీసుకుంటే.. ప్రణయ్‌ను చంపకముందు వరకు మారుతీరావు ఎవరో మిర్యాలగూడలో కొంతమందికి తప్ప తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇతర ప్రాంతాల వారికెవరికీ తెలియదు.

అమృత, ప్రణయ్‌లు పెళ్లి చేసుకున్నాక కూడా కొంతమంది ఎవరైనా మాట్లాడుకుని ఉంటారేమో కాని అదేమాటతో మొన్నటి వరకూ ఆ ఎవరూ రామకోటి రాసి ఉండరు.  ఎవరూ పట్టించుకోని, ఎవరి ఆలోచనల్లో, జ్ఞాపకాల్లో లేని, నిలబడని మారుతీరావుకు పరువు ఎక్కడినుంచి వచ్చింది? ప్రాణం తీసేంతగా ఎందుకు పగను పెంచింది? ప్రణయ్‌ను చంపి ఆయన పెంచుకున్న పరువేంటి? అసలు కులమంటే ఏంటి? మానవత్వాన్ని మించిందా? అమృత ప్రశ్న కూడా ఇదే!

దేశమంతా అభిమానులున్న రజనీకాంత్, జగపతిబాబు, సల్మాన్‌ఖాన్‌ లాంటి ఎందరో సెలబ్రిటీలే  కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా  తమ పిల్లలకు వాళ్లు కోరుకున్న వ్యక్తులతో మూడుముళ్లు వేయిస్తుంటే వాడకట్టులో పట్టుమని పదిమందికి తెలియని మనకెందుకు ఇంత పరువు, ప్రతిష్టల పెనుగులాట? పిల్లలనే చంపుకునేంత  మూర్ఖపుబాట? పిల్లలకు పెద్దల నుంచి మేమున్నామనే భరోసా కావాలి. భయపడితే వెన్నుతట్టి గుండెల్లో దాచుకోవాల్సినవాళ్లం.. పిల్లలను భయపెట్టి పొట్టలో పొడుస్తున్నాం. రేప్పొద్దున మన పిల్లలు మనల్ని నమ్మకుండా చేసుకుంటున్నాం. పెద్దలూ ఆలోచించండి.

– సరస్వతి రమ

ఏ తప్పు చేశారనీ...
ఈ పిల్లలు ఏ తప్పు  చేశారనీ వాళ్లకు ఈ శిక్ష?  ‘‘కులమేంటి? మానవత్వం కంటే ఎక్కువా? కులం కోసం మా నాన్న చేసిన పనేంటి?’’  అని ఆమృత ప్రశ్నిస్తోంది. రానురాను కులం, మతం అంతరించాలి కాని ఇప్పుడవే ప్రధానంగా మారుతున్నాయి. ఈ ధోరణి పోవాలి. – భండారు విజయ, ప్రరవే జాతీయ సమన్వయకర్త

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top