అత్యంత శక్తిమంతమైన సాధనం క్షమాపణ!! | special story on sorry | Sakshi
Sakshi News home page

అత్యంత శక్తిమంతమైన సాధనం క్షమాపణ!!

Sep 3 2016 11:33 PM | Updated on Sep 4 2017 12:09 PM

అత్యంత శక్తిమంతమైన సాధనం క్షమాపణ!!

అత్యంత శక్తిమంతమైన సాధనం క్షమాపణ!!

యెరూషలేము రాజధానిగా దావీదు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఒకసారి అనూహ్యమైన సంక్షోభాన్నెదుర్కొన్నాడు.

యెరూషలేము రాజధానిగా దావీదు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఒకసారి అనూహ్యమైన సంక్షోభాన్నెదుర్కొన్నాడు. దావీదు మీద అతని కుమారుడైన అబ్రాహామే తిరుగుబాటు చేసి తనను రాజుగా ప్రకటించుకున్నాడు. కాకలు తీరిన శత్రురాజులనెందరినో ఓడించిన దావీదు ఒక తండ్రిగా తన మీద యుద్ధం చేయడన్న ధీమా అబ్షొలాముది. అతడనుకున్నట్టుగానే దావీదు నిస్సహాయుడై ఉన్నట్టుండి కృంగిపోయాడు. నిజమే, పగవారిని శత్రువులెదుర్కొన్నట్టు ఉన్నట్టుండి పగవారుగా మారిన సొంతవారిని ఎదుర్కోవడం మనసున్న వారికెవరికైనా కష్టమైన విషయమే! తాను యుద్ధం ప్రకటిస్తే అందులో అబ్షోలాము చనిపోతాడేమోనన్న భయం దావీదుది.

అందువల్ల దావీదు రాత్రికి  రాత్రి తన పరివారంతో, తన వారనుకున్న సైన్యంతో రాజధాని, రాజ్యాన్ని వదిలి కట్టుబట్టలతో పారిపోయాడు. సింహాసనం మీద కూర్చున్న రాజుకు అంతా భయపడతారు కానీ పారిపోయే రాజు అందరికీ అలుసవుతాడు. అంతకాలం మనసులో పగ ఉన్నా పైకి ప్రేమ నటించిన షిమీ అనే బెన్యామీనీయుడు రాజుగా దావీదు రోజులు ముగిశాయని భావించి దావీదును తరమడం ఆరంభించాడు. నిజమే, మనం పచ్చగా ఉన్నంత కాలం అంతా మనతో బాగానే ఉంటారు కానీ బలహీనపడ్డ మరుక్షణం ముందుగా సొంతోళ్లే శత్రువులకన్నా హీనంగా మాట్లాడతారు.

షిమీ ఇప్పుడు తన అక్కసునంతా వెళ్లగక్కుతూ ‘నరహంతకుడా, దుర్మార్గుడా’ అంటూ భయంకరమైన ఆరోపణలు, శాపనార్థాలన్నీ వింటున్న దేవుడు వాటన్నింటినీ ఆశీర్వాదాలుగా మార్చుతాడని, పైగా కన్నకొడుకే తనను కించపర్చగా పరాయివాడైన షిమీ తనను కించపర్చడంలో వింతేమున్నదని దావీదు అన్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అబ్షాలోము చనిపోగా, దావీదు మళ్లీ యెరూషలేముకొచ్చి సింహాసనాన్ని అధిష్టించాడు. అప్పుడు షిమీ అందరికన్నా ముందుగా వచ్చి దావీదుకు సాగిలపడి క్షమాపణ వేడుకున్నాడు. కొందరంతే, అందితే జుట్టు, అందకుంటే కాళ్లు!! ఎవరిని క్షమించినా క్షమించకున్నా షిమీని మాత్రం చంపితీరాలని సైన్యాధిపతియైన అబిషై దావీదుతో అన్నాడు.

కాని దావీదు షిమీని క్షమించి వదిలేశాడు. అదే దావీదు గొప్పతనం. తాను బలహీనుడిగా ఉన్నప్పుడూ క్షమించాడు. తిరిగి బలం పుంజుకున్న తర్వాత కూడా క్షమించాడు. అబ్షాలోము తిరుగుబాబు దావీదుకు మేలు చేసింది. నిజంగా తన వారెవరో, తన వారెవరు కాదో తెలిసొచ్చింది. కష్టకాలంలో షిమీలాంటివారు పలికిన ప్రతిశాపవచనాన్ని దావీదు విశ్వాసం మేరకు దేవుడు నిజంగానే ఆశీర్వాదాలుగా మార్చడంతో ఆయన మరింత వైభవం పొందాడు. క్షమించడంలో దేవుడెంతో శక్తిని, ఆశీర్వాదాన్ని దాచాడు. అయితే క్షమించడంలోనూ దేవుడెంతో ఆనందాన్ని దాచాడు. అందుకే క్షమాపణ కోరిన ఎంతటి శత్రువునైనా క్షమించడం దైవికం, మానవత్వం, నైతికం మాత్రమే కాదు, ఎంతో ఆశీర్వాదకరం కూడా!!
- రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్

Advertisement
 
Advertisement
Advertisement