ఊరు మారింది 

Special story to Adivasi Entrepreneurs - Sakshi

ముందడుగు / ఆదివాసీ ఆంట్రప్రెన్యూర్‌లు

గుజరాత్‌ రాష్ట్రంలోని బార్డోలి తాలూకాలో ఓ కుగ్రామం.. హాల్పట్టి. ఆదివాసీలు నివసించే గ్రామం అది. గవర్నమెంట్‌ స్కూల్‌లో టీచర్‌ పాఠం చెబుతోంది. ఓ నలుగురు పెద్ద మనుషులు వచ్చారు. వాళ్లలో ఒకతడి కంఠం ఖంగుమంది ‘వీళ్లకు పాఠాలు చెప్పడం ఆపెయ్‌. వీళ్లంతా చదువరులైతే రేపు మా పొలాల్లో పనులు చేసేదెవరు’ అని హుంకరించాడతడు. హాల్పట్టి పొలాలన్నీ జమీందారుల చేతుల్లోనే ఉన్నాయి. చిన్న రైతులు, ఆదివాసీల పొలాలు కూడా వాళ్ల చేతుల్లోకే వెళ్లిపోయాయి. పంటలు సరిగ్గా పండక, పంట పెట్టుబడి కోసం  తెచ్చిన అప్పు పెరిగిపోవడంతో పొలాలు అప్పులోకే జమయ్యాయి. ఆ రైతులు తమ పొలాల్లోనే కూలీలయ్యారు. 

అప్పుడొచ్చింది సౌమ్య!
హాల్పట్టి గ్రామంలోని ఆదివాసీ మహిళలకు కొడవలి చేతపట్టి పొలం పనులు చేయడమే కాదు, అదే చేతుల్తో రోజూ ఇంట్లో చేసే పనులతోనే కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చనే కొత్త ఆలోచనకు బీజం వేసింది సౌమ్య. ఆమెది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌. ఢిల్లీలో హిందూ కాలేజ్‌ నుంచి కామర్స్‌లో డిగ్రీ చేసింది. అనేక స్టార్టప్‌ కంపెనీలకు మార్కెటింగ్‌ చేసింది. మార్కెటింగ్‌ రంగంలో మంచి సంపాదన ఉంది. మార్కెటింగ్‌ కంటే దానికి మూలమైన ఉత్పత్తి రంగం మీద ఆసక్తి పెరిగిందామెకు. అలా మొదలైందామె ప్రయాణం. గుజరాత్‌లోని బార్డోలి తాలూకా, హాల్పట్టి ఆదివాసీ తండా ఆమె కార్యక్షేత్రమైంది. స్థానిక మహిళలను చైతన్యవంతం చేసింది. అగాఖాన్‌ రూరల్‌ సపోర్టు ప్రోగ్రామ్‌ ద్వారా ఇరవై వేల రూపాయలతో వారికి గ్రైండర్, తిరుగలి తీసిచ్చింది. 

ఇద్దరే ముందుకొచ్చారు
ఆ మహిళలు చేయాల్సింది కొత్తగా ఏమీ లేదు, రోజూ ఇంటి కోసం చేసుకునే మసాలాలనే ఎక్కువ మొత్తంలో చేసి ప్యాక్‌ చేయాలి. ఎండు మిర్చితో కారం, పసుపు కొమ్ములను ఎండబెట్టి పసుపు పొడి చేయడం వంటివే. పని చేయడానికైతే అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఒక బ్రాండ్‌ పేరుతో వ్యాపారం మొదలు పెట్టడానికి వెనుకడుగు వేశారు. ముప్పై మందిలో వ్యాపారం మొదలు పెట్టడానికి ధైర్యం చేసింది పాతికేళ్ల సోనమ్‌ బెన్, శోభన్‌బెన్‌లు మాత్రమే. తేజ్‌ మసాలా పేరుతో తయారు చేసి, తమ ఉత్పత్తులను తామే విక్రయించుకుంటున్నారు.

పంచాయితీ భవనమే ఫ్యాక్టరీ
ఈ మహిళలు అంతా కలిసి పని చేయాలనైతే అనుకున్నారు కానీ ఎక్కడ చేసుకోవాలి? ఒక చోట కూర్చుని పని చేసుకోవడానికి ఎవరివీ అంత విశాలమైన ఇళ్లు కాదు. ముడిసరుకు నిల్వ చేయడానికి అనువైనవి కూడా కాదు. ఎంత కరకుగా ఉన్న ఊరి పెద్దలయినా సరే... ఆడపిల్లలు ముందుకొచ్చి పని చేసుకుంటామంటే ముచ్చటపడతారు. అలాగే ఊరిపెద్ద గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఒక గది ఇచ్చాడు. కారం, పసుపు, గరం మసాలా, మసాలా చాయ్‌ పౌడర్, చికెన్‌మసాలా, కొత్తిమీర– జీలకర్ర మసాలా, పావ్‌భాజీ మసాలా, పులావ్‌ మసాలాలు తయారయ్యాయి. 50, 100 గ్రాములు తూకం వేసి, ప్యాకింగ్‌ మెషీన్‌తో ప్యాక్‌ చేయడం కూడా నేర్చుకున్నారు. ఇక హైవే మీద ఒక గుడారం వేసి టేబుల్‌ వేసుకున్నారు. అదే వారి దుకాణం. నెలకు పాతిక కిలోల వరకు అమ్ముడవుతున్నాయి. ఈ దుకాణంతోపాటు వారం వారం సంతలకు కూడా వెళ్తారు.

తేజ్‌ మసాలా హైవే మీద ప్రయాణించే దూరప్రాంతాల వాళ్లను చేరింది, కానీ ఉన్న ఊళ్లో ఇళ్ల నుంచి బయటకు రాని మహిళలకు తెలియడానికి చాలా రోజులు పట్టింది. ఆదివాసీ మహిళలు ఇంటింటికీ వెళ్లి తమను పరిచయం చేసుకున్నారు. ‘ఒకసారి వాడి చూద్దాం’ అని తీసుకున్న వాళ్లు వీటికి మంచి మార్కులు వేయడంతో డోర్‌ టు డోర్‌ మార్కెటింగ్‌ కూడా మంచి ఫలితాలనే ఇస్తోంది. ఐదు నెలల పాటు తాజాదనం తగ్గని క్వాలిటీ కూడా డిమాండ్‌ పెరగడానికి ఓ ప్రధాన కారణం.

‘ఉత్పత్తిని ఇంకా పెంచాలి’
నెలకు నలభై కిలోల మసాలాలు తయారవుతున్నాయిప్పుడు హాల్పట్టిలో.  ఒక్కొక్కరికి నెలకు నికరంగా ఐదు వేల రూపాయలు మిగులుతున్నాయి. డిమాండ్‌ ఉంది. కాబట్టి నెలకు 80 కిలోలకు పెంచడం ఇప్పుడు వారి లక్ష్యం. వ్యాపార విస్తరణలో మరో ముందడుగు వేస్తున్నారిప్పుడు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో మార్కెట్‌ జోన్‌ కనిపించింది. బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు వీరి ఉత్పత్తులను కొనడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మార్కెట్‌ తమ సొంతమైతే పరిశ్రమను విస్తరించడానికి మరెంతో సమయం పట్టదని ధీమాగా చెప్తున్నారు. అవకాశం వస్తే తన ఉనికిని చాటు కోవడానికి మహిళలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులలో బతుకీడుస్తున్నా సరే, చిన్న అవకాశాన్ని పట్టుకుని ఎదిగి తీరుతారు.
– మంజీర 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top