అపాయం తొలగిస్తూ అడుగెట్టవమ్మా శ్రీశార్వరి

Special Story About Ugadi Traditions - Sakshi

ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ‘ఉగాది’ అన్న తెలుగుమాట ‘యుగాది’ అన్న సంస్కృత పద వికృతి రూపం. బ్రహ్మ ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు. దీనికి ఆధారం వేదాలను అధారం చేసుకొని వ్రాయబడిన ‘సూర్య సిద్ధాంతం’ అనే ఖగోళ జ్యోతిష గ్రంథం. బ్రహ్మ కల్పం ఆరంభమయే మొదటి సంవత్సరం (ప్రభవ) లో మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం ( చైత్ర మాసం)లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్ధం. అందుకే మొదటి సంవత్సరానికి ‘ప్రభవ’ అని పేరు. చివరి అరవయ్యవ సంవత్సరం పేరు ‘క్షయ’ అంటే నాశనం అని అర్థం.

ఉగాది సంప్రదాయాలు
ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షం లో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు, ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఉగాదిరోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబ కుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం) పంచాంగ శ్రవణం తదితర పంచకృత్యాలను నిర్వహించాలని వ్రతగ్రంథ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారమే. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు.

ఉగాది పూజ
అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినక ముందే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో ‘నింబ కుసుమ భక్షణం’, ‘అశోకకళికా ప్రాశనం’ అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేప పూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులు కానీ, పదిహేను రోజులు కానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు.

ప్రస్తుతం కరోనా వైరస్‌ భయం మూలంగా ఉగాదికి పంచాంగ శ్రవణం చేసే అవకాశం లేదు కాబట్టి కనీసం యూట్యూబ్‌లో లేదా టీవీలలో, రేడియోలలో అయినా పంచాంగంలో రాశిఫలాలను తెలుసుకోవచ్చు. ఉగాది పర్వదినాన శిరఃస్నానం చేయకుండా ఉండటం, విడిచిన లేదా చిరిగిన దుస్తులు ధరించటం వల్ల జన్మజన్మల దరిద్రం, అనారోగ్యం పీడిస్తాయని పెద్దలు చెబుతారు కాబట్టి ఇంటిని, ఒంటిని శుభ్రంగా ఉంచుకోవడం విధాయకం. ఎక్కడికీ కదలలేని చెట్లు కూడా తమ ఆకులను రాల్చేసుకుని చివుళ్లు తొడిగి పూత, పిందెలతో కళకళలాడే ఈ వసంతరుతువులో మనం కూడా మనలోని చెడు అలవాట్లను, నకారాత్మక ఆలోచనలను వదిలేసి, శుచి, శుభ్రత, సంయమనం, సమయపాలన, సమయోచిత కార్యాలను ఆచరించటమనే సద్గుణాలను అలవరచుకుందాం. – డి.వి.ఆర్‌. భాస్కర్‌

శ్రీ శార్వరి అంటే ఏమిటి? 
నేడు మనం అడుగిడుతున్న కొత్త తెలుగు సంవత్సరానికి శ్రీశార్వరి అని పేరు. కాళరాత్రి అని, శుభకరి అని, చంద్రకాంత అని, హిమం అనీ, పంటలు బాగా పండేదనీ అనేక అర్థాలున్నాయి ఈ పదానికి. అంతేకాదు... శ్రీ శార్వరి అనేది అమ్మవారి నామాలలో ఒకటి. అమ్మవారి ముఖం ఎప్పుడూ పచ్చగా ఉంటుంది కాబట్టి పసుపు పూసుకునేది మన సంప్రదాయం ప్రకారం సుమంగళి కాబట్టి ఈ సంవత్సరం అందరికీ ఆరోగ్యాలు మెరుగవుతాయనీ, పంటలు బాగా పండి అందరూ సుఖసంతోషాలతో ఉంటారనీ ఆశిద్దాం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top