నెల రోజుల అమ్మ

Special Story About Doctor Mary Anitha From Ernakulam - Sakshi

స్త్రీ అమ్మగా మారడానికి రోజులు అక్కర్లేదు. ఒక్క నిమిషం చాలు. పసిబిడ్డ గుండెలకు తాకిన మరుక్షణమే ఏ స్త్రీ అయినా తల్లిలా మారిపోతుంది. మేరి అనిత కూడా అలా మారింది. కాని ఆమె షించాల్సిన పాత్ర నెలరోజులు మాత్రమే అనే వాస్తవం ఉద్వేగభరితమైనది.

జూన్‌ 14, 2020. ఎర్నాకులంలోని చైల్డ్‌ వెల్‌ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌కు ఒక ఫోన్‌ వచ్చింది. షీనా అనే మహిళకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని, ఆమెకు ఆరు నెలల కుమారుడు ఉన్నాడని, ఆ పసివాణ్ణి చూసుకోవడానికి మనిషి కావాలని. కాని ఎవరూ లేరు. చైల్డ్‌ వెల్‌ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పని చేస్తున్నడా. మేరీ అనితకు ఈ సంగతి తెలిసింది. ఆమె క్లినికల్‌ సైకాలజిస్ట్‌. స్పెషల్‌ చిల్డ్రన్‌ కోసం ఒక కేంద్రం నడుపుతోందామె. ‘ఎవరూ లేరు. కాని నేను ఆ పసివాడికి తల్లినవుతాను’ అంది మేరీ.

కోవిడ్‌ వచ్చిన తల్లిదండ్రులు
ఆ పసివాడి పేరు ఉన్నికుట్టన్‌. తల్లిదండ్రులు నర్సులుగా హర్యానా వెళ్లి ఉపాధి పొందుతున్నారు. అక్కడ మొదట తండ్రికి కరోనా వచ్చింది. అతడు అక్కడే క్వారంటైన్‌లోకి వెళ్లగా తల్లి బాబును తీసుకొని కేరళలోని సొంత ప్రాంతమైన ఎర్నాకులం వచ్చింది. వచ్చాక ఆమెకు కోవిడ్‌ పాజిటివ్‌ తేలింది. అదృష్టవశాత్తు పసివాడికి నెగెటివ్‌ వచ్చింది. తల్లి వైద్యానికి ఆస్పత్రిలో ఉంటే పసివాణ్ణి ఎవరు చూసుకోవాలనే సమస్య వచ్చింది.

షీనా బంధువులు కాని ముసలి తల్లిదండ్రులు కాని సాయం చేసే స్థితిలో లేరు. ఆ సమయంలో మేరీ అనిత ముందుకు వచ్చింది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త అడ్వకేట్‌గా పని చేస్తున్నాడు. వారిని సలహా అడిగితే వారంతా మనస్ఫూర్తిగా పసివాడికి సాయం చేయమన్నారు. పిల్లవాడికి ఏ క్షణమైనా కోవిడ్‌ వచ్చే అవకాశం ఉండటంతో మేరి అనిత వాణ్ణి తీసుకొని పక్కనే ఉన్న ఒక ఖాళీ ఫ్లాట్‌లోకి మారి క్వారంటైన్‌లోకి వెళ్లింది. నెల రోజులుగా బాబుకు అమ్మలా మారి బాగోగులు చూసుకుంది.

నెల రోజుల తల్లి
ఉన్నికుట్టన్‌కు అమ్మపాలు అలవాటు. కాని మేరి అనిత మెల్లగా పోతపాలలోకి మార్చగలిగింది. మెల్లమెల్లగా పసివాడు మేరిలోనే తల్లిని చూసుకోసాగాడు. ఈ నెలరోజులు వారి మధ్యగట్టి బంధం ఏర్పడిపోయింది. తండ్రి హర్యానా నుంచి తిరిగి రాగా, తల్లి కోవిడ్‌ నుంచి బయట పడగా రెండు రోజుల క్రితం మేరి ఆ పసివాణ్ణి సొంత తల్లిదండ్రులకు అధికారుల సమక్షంలో అప్పజెప్పింది. ఉన్నికుట్టన్‌ తల్లిని గుర్తుపట్టి మెల్లగా నవ్వాడు. కాని పసివాణ్ణి తిరిగి ఇస్తూ మేరి కంట నీరు పెట్టుకుంది. ‘ఆమె దేవతలా నా బిడ్డను కాపాడింది’ అని షీనా అంది.

మేరి ఉండే అపార్ట్‌మెంట్‌లోని వారంతా వచ్చి ఉన్నికుట్టన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే తన ఇల్లు చేరుకున్నాక ఉన్ని కుట్టన్‌ మేరి కోసం ఏడుపు మొదలు పెట్టాడు. అది గమనించిన తల్లి షీనా వెంటనే మేరికి కాల్‌ చేసింది. ‘ఒకసారి వీడియోకాల్‌ చేస్తాను. మాట్లాడండి’ అని ప్రాధేయపడింది. మేరి అనిత ఆ విన్నపాన్ని మన్నించలేదు. ‘వద్దు. మీ ప్రేమతో వాణ్ణి నన్ను మరిపించండి’ అని మెల్లగా ఫోన్‌ పెట్టేసింది. పాశం పెంచుకునే సందర్భాలు ఎంత సంతోషాన్ని ఇస్తాయో తుంచుకునే క్షణాలు అంత బాధను మిగులుస్తాయి. కరోనా నమోదు చేసిన లీలల్లో ఇది ఒకటి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top