ఏనుగుల ప్రవృత్తి ఇలా ఉందేం?!

Some reactions and instincts found in nature - Sakshi

ప్రకృతిలో కనిపించే కొన్ని ప్రతిచర్యలూ, ప్రవృత్తులు వింతగా అనిపిస్తుంటాయి. ఇదేమిటి.. ఇలా జరుగుతుందేమిటి అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఉదా : అడవి పచ్చగా లేనప్పుడు ఆహారం కోసం ఏనుగులు అలమటిస్తూ ఉంటాయి. వర్షాలు మొదలై చెట్లు పచ్చబారగానే ఆ లేత చిగుళ్లు తినేటప్పుడు వాటి ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. చిగురిస్తూ పక్కలకు పెరిగే ఆ కొమ్మల్ని అడ్డంగా విరిచేస్తుంటాయవి. కొన్నిసార్లయితే కొన్ని మొక్కలకు మొక్కల్నే పెరికి అవతల  పారేస్తుంటాయి.

వేసవిలో ఆహారం అంతగా దొరకనప్పుడు అంతకంతకూ అలమటించిపోయాయి కదా.. మరి ఇప్పుడు హాయిగా ఆ లేత చిగుర్ల మేతను మేయవచ్చు కదా. మనిషి మరో ముద్ద ఎక్కువ తిన్నట్టు... కావాలంటే ఏనుగూ మరో కొమ్మ ఎక్కువ తినవచ్చు. కానీ ఏమిటీ వృథా? అందునా ఏనుగులు చాలా తెలివైనవి. ఒక్కసారి తాము పడిన కష్టాన్నీ... ఒక్కసారి తమకు దొరికిన నీటి వనరును ఎన్నడూ మరచిపోవు. ఎప్పుడూ గుర్తుంచుకుంటాయి. ఆ కష్టకాలపు అనుభవంతో రాటుదేలి, మరో సీజన్‌కు అదే కష్టం రాకుండా జాగ్రత్తపడతాయి. మరి ఇంతటి జాగ్రత్తపరుల  చేత ఈ దుందుడుకు వ్యవహారాన్ని ఎందుకు చేయిస్తుంది ప్రకృతి?

ఎందుకంటే.. మరుసటి ఏడాదికి మరో తరం పుట్టుకొస్తుంది. అవి ఏనుగులు మాత్రమే కాదు... మరెన్నో జీవరాశుల సంతానాలు! వాటన్నింటికీ తగినన్ని చెట్లూ, ఆకులూ, తద్వారా వచ్చే పండ్లూ ఫలాలూ కావద్దూ?! అందుకే ఏనుగులు చిన్నా చితకా చెట్లను పీకిపారేస్తాయి. అలా మరిన్ని అదనపు చెట్లకు అవసరమైన నేలను తయారు చేస్తాయి. సూర్యకాంతికి అడ్డొస్తున్న పక్కలకు పాకే కొమ్మలను విరిచేస్తాయి. తద్వారా ఆ కాంతి సువిశాలమైన స్థలంలోకి ధారాళంగా వచ్చేలా చేస్తాయి. ఇలా మరిన్ని ఫలవంతమైన వృక్షాలకు అనువైన నేలను తయారు చేస్తాయి. తమతో పాటు మరిన్ని జీవులకు అవసరమైన ఆహారం కోసం... అదనపు ఫలాల కాపుకు రంగం సిద్ధం చేస్తాయి.

విధ్వంస ప్రక్రియల్లోను, విరిచేసే ప్రక్రియల్లోనూ మరెన్నో జీవరాశులకు మేలు చేసే గుణాన్ని ఇన్‌స్టింక్ట్‌ ద్వారా దేవుడు ఏనుగు లాంటి జంతువులకు ఇచ్చాడు. విధ్వంసం సరే... మరి  నిర్మాణాత్మకమైన పనులు చేస్తాడన్న పేరున్న మనిషికి ఇచ్చిన విచక్షణ ఏమిటి? దాంతో అతడు చేస్తున్నదేమిటి? ఆలోచించాలి. ఒక చెట్టును నరికేముందు వంద చెట్ల మొక్కలను నాటేందుకు ఆలోచించే పనేముంది?!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top