భయం'కరి' | Elephant attacks on crops from 15 days | Sakshi
Sakshi News home page

భయం'కరి'

Oct 29 2025 6:07 AM | Updated on Oct 29 2025 6:07 AM

Elephant attacks on crops from 15 days

15 రోజులుగా పంటలపై గజదాడులు 

ఆదివారం తెల్లవారుజామున గ్రామంలోకి ఏనుగులు 

చోద్యం చూస్తున్న అటవీ అధికారులు 

బిక్కుబిక్కుమంటున్న గ్రామస్తులు

గజరాజు ఘీంకరిస్తున్నాడు.. శేషాచలం నుంచి బయటకు వచ్చి కర్షకుడిపై కన్నెర్ర చేస్తున్నాడు.. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలను సాంతం ఆరగిస్తున్నాడు.. ఆనక ఇష్టారీతిన ధ్వంసం చేస్తున్నాడు..కంచె, చెట్టు, తోట, పంట, ఇలా వేటినీ వదలడం లేదు.. చివరకు అడ్డొచ్చిన అన్నదాతనూ మట్టుబెడుతున్నాడు..వరుసదాడులతో హాలికుని కంట కన్నీరు పెట్టిస్తున్నాడు. 

ఫలితంగా అటు నష్టం.. ఇటు కష్టంతో పుడమిపుత్రుడి పరిస్థితి దయనీయంగా మారింది. గజరాజుల నుంచి కాపాడండిమహాప్రభో అని మట్టి మనుషులు వేడుకుంటున్నా.. అటవీ అధికారులు మాత్రం పర్యటనలు, పరిశీలనకేపరిమితమవుతుంటేచేష్టలుడిగి చూడడమే రైతన్న వంతైంది.

చంద్రగిరి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అటవీ సమీప గ్రామాల్లోని ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. కష్టపడి పండించిన పంటలు చేతికి అందేలోపు గజదాడుల్లో ధ్వంసం అవుతున్నాయి. ఏడాది పొడవునా ఏనుగుల దాడులతో రైతుకు కన్నీళ్లే మిగులుతున్నాయి. గజరాజులు ఏకంగా గ్రామాల్లో­కి చొరబడడంతో ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నెల రోజులుగా మదపు­టేనుగులు గ్రామాల్లో  స్వైరవిహారం చేస్తు­న్నా అటవీ అధికారు లు చోద్యం చూస్తుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరో ప్రాణం బలికాకముందే ఏనుగుల సంచారాన్ని కట్టడి చేయాలని కోరుతున్నారు. చంద్రగిరి మండలంలోని సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె పరిసర గ్రామాల్లో ఏనుగుల దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. ప్రతిరోజూ రాత్రి వేళల్లో ఏనుగులు గ్రామ సమీపంలోని పంటలపై దాడులు చేయడం పరిపాటిగా మారుతోంది. 

మండలంలోని చిన్నరామాపురం, భీమవరం, కొండ్రెడ్డికండ్రిగ, బూడిదగట్టువారిపల్లి, యల్లంపల్లి గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అటవీ అధికారులు అటువచ్చి, ఇటు వెళుతున్నారే తప్ప, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత జనవరిలో ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్‌ మరణించారు. ఈ క్రమంలో మరో ప్రాణం బలికాక ముందే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

గ్రామాల్లో స్వైరవిహారం 
ఆదివారం తెల్లవారుజామున సుమారు 8 ఏనుగుల మంద చిన్నరామాపురంలోకి రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయం పశువుల వద్దకు వెళ్లిన, పాడి రైతులు పరుగున ఇళ్లలోకి వచ్చి, తలుపులు వేసుకున్నారు. ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏనుగుల గుంపు చిన్నరామాపురంలోకి చేరుకుని పెద్ద ఎత్తున ఘీంకరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అనంతరం గ్రామం వెనుక ఉన్న పొలాల్లోకి వెళ్లి పంటలను నాశనం చేశాయని వాపోయారు. 

సోమవారం మరోసారి వరి, మామిడి పంటల ధ్వంసం 
బూడిదగట్టువారిపల్లిలోని పొలాల్లో పంటలను ఏనుగులు సోమవారం తెల్లవారుజామున ధ్వంసం చేసినట్లు గుర్తించిన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు, గ్రామస్తులు సంయుక్తంగా ఏనుగులను తరిమేందుకు యత్నించారు. డప్పులు వాయిస్తూ, బాణసంచా పేల్చుతూ వాటిని బెదరగొట్టారు. ఈ లోపే ఓ కౌలు రైతుకు చెందిన వరి పంటను పూర్తిగా నాశనం చేసినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి యల్లంపల్లిలోని మరో ఇద్దరి రైతుల పొలాల్లోకి వెళ్లాయి. మామిడితోట ప్రహరీ గేట్లు, టేకు చెట్లతోపాటు ఫెన్సింగ్‌ను పూర్తిగా ధ్వంసం చేశాయి. 

గతంలో ఎప్పుడూ లేదు 
10 ఏళ్ల కాలంలో ఎప్పు డూ ఏనుగులు ఇంత పెద్ద స్థాయిలో పొలాలపై దాడు లు చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం రెండు నెలలుగా ఏనుగులు పెద్ద ఎత్తున పంటలపై దాడులకు చేస్తూనే ఉన్నాయి. అధికారులు వచ్చి ఎన్ని చర్యలు తీసుకున్నా, ఏనుగుల దాడులు మాత్రం ఆగడం లేదు. ఏనుగుల దాడులను నివా రించేందుకు శాశ్వత పరిష్కారం చూపితే రైతులకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రభుత్వం స్పందించి ఆ దిశగా చర్యలను చేపట్టాలి.  – రాగిణి, సర్పంచ్, చిన్నరామాపురం 

నా నోట్లో మట్టి కొట్టాయి  
నేను కొన్నేళ్లుగా భూమిని కౌలుకు తీసుకుని వ్యవసా యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా ను.  20 రోజుల్లో చేతికి వ చ్చే వరి పంటను ఆదివా రం రాత్రి ఏనుగులు తొక్కి నాశనం చేశాయి. సు మారు రూ.లక్ష పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట నాశనం అయ్యింది. ఇప్పుడు భూమి యజమానికి నేను ఎలా నగదు చెల్లించాలి. అటవీ అధికారులే మో పచ్చి వడ్లను కోసుకోమని సలహాలు ఇస్తున్నా రు. ఇలా ఎవరైనా చేస్తారా..?  – చిన్నబ్బ, కౌలు రైతు, బూడిదగట్టువారిపల్లి 

100 మీటర్లు వెళ్లి ఉంటే ప్రాణాలు పోయేవి 
వేరుశనగ పంటను రక్షించుకునేందుకు ఆదివారం రా త్రి నేను బైక్‌లో పొలం దగ్గరకు వెళ్లాను. మార్గం మధ్య లో పెద్ద ఎత్తున ఏనుగులు ఘీంకారాలు చేస్తూ, రోడ్డును దాటుతున్నాయి. వెంటనే అప్రమత్తమై బైక్‌ లైట్లు ఆఫ్‌ చేసి వెనుదిరిగి వచ్చేసి, ప్రాణాలను కాపాడుకున్నాను. అనంతరం ఏనుగుల దాడులపై గ్రామస్తులకు సమాచారం చే రవేశాను. అజాగ్రత్తగా ఉంటే నా ప్రాణాలు   పోయేవి.   – కృష్ణమోహన్, రైతు, కొండ్రెడ్డికండ్రిగ

మామిడి తోటలో వీరంగం చేశాయి 
నాకు, మా అక్కకు చెంది న మామిడి తోటల్లో ఏనుగులు వీరంగం చేశాయి. ఏనుగుల మంద దారి మళ్లి మా పొలాలపై పడ్డా యి. తోటకు రక్షణగా ఏర్పాటు చేసిన గేటును పూర్తిగా ధ్వంసం చేసి, విసిరి పడేశాయి. అక్కడ నుంచి మరో తోటలోకి వెళ్లి ఫెన్సింగ్‌ను తొక్కుకుంటూ అటవీలోకి వెళ్లిపోయాయి. 

ఈ ఏనుగుల మంద కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాం. వ్యవసాయాన్నే నమ్ముకున్న మాకు వేరే బతుకు మార్గం తెలియదు. మాపై ప్రభుత్వం కరుణ చూపి ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకోవాలి. లేకుండా అప్పుల పాలై కుటుంబం రోడ్డున పడడం తప్పదు.  – నాగేశ్వరమ్మ, మహిళా రైతు, యల్లంపల్లి 

ప్రాణభయంతో పరుగులు తీశాం 
ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమ యంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చాం. ఈ క్రమంలో మా పెంపుడు కుక్క పెద్ద ఎత్తున అరిచింది. వెనక్కి తిరిగి చూస్తే సుమారు 8 ఏనుగుల మంద గ్రామంలోకి వచ్చేసింది. వెంటనే నేను, నా కోడలు ఇంట్లోకి పరుగులు తీసి, తలుపు గడియ పెట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాం. ఏనుగులు మమల్ని చూసి ఉంటే దాడికి పాల్పడేవి. 20 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఏనుగుల మంద గ్రామంలోకి వచ్చిన సందర్భాలు లేవు. అధికారులు ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకోవాలి.  – చేకూరి సిద్ధమ్మ, చిన్నరామాపురం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement