సమస్త ‘ప్రకృతి’కి ప్రణామం!

Software Engineer Rambabu Turns as Farmer In Vetapalem Prakasam - Sakshi

ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న ఉత్తమ రైతు

తాను స్థాపించిన హార్డ్‌వేర్‌ కంపెనీ వదిలి వ్యవసాయం చేపట్టిన యువకుడు

అతనో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధినేత. ఉన్నత చదువులు చదివి హార్డ్‌వేర్‌ కంపెనీ నడుపుతూ ప్రకృతి వ్యవసాయానికి ఆకర్షితుడై చివరికి తన కంపెనీని వదులుకున్నాడు. తనకున్న 4 ఎకరాల వ్యవసాయ భూమిలో అతి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని సాగిస్తూ ఆదర్శ రైతుగా అధికారుల మన్ననలు, ప్రశంసలు అందుకుంటున్నాడు. అతని పేరు చెరుకూరి రాంబాబు.

సాక్షి, వేటపాలెం (ప్రకాశం): మండలంలోని పందిళ్లపల్లికి చెందిన చెరుకూరి బసవయ్యది వ్యవసాయ కుటుంబం. తాను కష్టపడుతూ కుమారుడైన రాంబాబును బీఎస్సీ కంప్యూటర్‌ చదివించాడు. తండ్రి ఆశించినట్లు రాంబాబు విద్యాభ్యాసం అనంతరం 2002లో చీరాల్లో మైక్రో కంప్యూటర్స్‌ పేరుతో హార్డ్‌వేర్‌ కంపెనీ స్థాపించి మంచి పేరు సంపాదించాడు. కానీ అతనిలో ఏదో తెలియని కొరత ఉన్నట్లు గ్రహించాడు. వ్యవసాయంలోనే నూతన ఒరవడి సృష్టించాలనుకున్నాడు. అలా ఆలోచిస్తున్న తరుణంలో సుభాష్‌ పాలేకర్‌ చేపట్టిన ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని సృజనాత్మకతతో మెళకువలు త్వరగా ఆకలింపు చేసుకుని తనకున్న నాలుగు ఎకరాల్లో వరిసాగు ప్రారంభించాడు. మొదటి సంవత్సరం ఎకరానికి 15 నుంచి 17 బస్తాల దిగుబడి వచ్చింది. తక్కువ దిగుబడి వచ్చిందని కుంగిపోకుండా నాలుగు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు.

ఎలా చేస్తారు..
ముందుగా విత్తనశుద్ధి చేసుకొని నారుమడి వేసి 25 నుంచి 30 రోజుల వ్యవధిలో నారు పీకి పొలంలో నాట్లు వేస్తారు. ప్రతి పది రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో కలిపి పైరుకు అందించడం జరుగుతుంది. 15 రోజులకు ఒక పర్యాయం జీవామృతం పైరుపై పిచికారీ చేస్తారు. పురుగు ఆశించినప్పుడు అజ్ఞాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ని కషాయాలు ముందుగానే తయారుచేసి ఉంచుకుని అవసరమైనప్పుడు పిచికారీ చేస్తారు. ఇలా నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం వలన ఈ సంవత్సరం 36 బస్తాలు ఎకరానికి పండించగలిగాడు. ఈవిధంగా పండించిన ధాన్యంను బియ్యంగా మలచి 50 కేజీల బస్తా బియ్యం రూ. 2500కు అమ్ముతున్నాడు.

అదే క్రిమిసంహారక మందులు వాడిన ధాన్యం రూ.1300 అమ్ముతున్నారు. మార్కెట్‌లో 25 కేజీల సాధారణ బియ్యం రూ.1250 గా ఉంది. అదే ధరకు ఈ ప్రకృతి వ్యవసాయం బియ్యంను కూడా అమ్ముతున్నారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన ఆహారం ప్రజలకు అందుతుంది. ప్రకృతి వ్యవసాయం వలన ఎకరానికి రూ. 5వేల నుంచి రూ. 7వేలు వరకు పెట్టుబడి మిగులుతుంది. ఇలా 25 బస్తాలు పండించినా, రసాయనిక పద్ధతిలో 35 బస్తాలు పండించినా ముందు విధానంలోనే అధిక లాభం ఉంటుంది.

ప్రకృతి వ్యవసాయమే లాభసాటి..
ఉదాహరణకు ఎకరానికి ప్రకృతి వ్యవసాయం ద్వారా 25 బస్తాలు పండిస్తే బస్తాకు రూ.2500 చొప్పున రూ.62,500 వస్తాయి. పురుగు మందులు ఖర్చు లేదు. అదే రసాయనిక పద్ధతిలో 35 బస్తాలకు రూ.1300 చొప్పున రూ.45,500 వస్తాయి. యూరియా, పురుగు మందులకు రూ.7000 ఖర్చవుతుంది. మిగిలేది రూ. 38,500 మాత్రమే. అదే కౌలు చేసే రైతులకు కౌలు రూ. 20 వేలు పోను  35 బస్తాలు పండించగలిగితే సుమారు రూ. 15 వేల నుంచి రూ 20 వేల వరకు మాత్రమే మిగులుతాయి. ఈ లెక్కల ప్రకారం ప్రకృతి వ్యవసాయంలో అధిక లాభం ఉంటుంది. సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయం వలన అధిక లాభాలే కాకుండా అందరికీ ఆరోగ్యం అందేలా చేయవచ్చు. రైతే దేశానికి వెన్నుముక అనే నానుడికి సరైన అర్థం రావాలంటే ప్రతి రైతూ పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి. మనం పండించిన ఆహారం మన ప్రాంతాల వారే తినడం వలన ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గుతాయి. రూపాయి విలువ పెరుగుతుంది. రాబోయే తరానికి బలమైన, దృఢమైన పౌరులను దేశానికి అందించినవాళ్లమవుతాము.
పెట్టుబడి లేకుండా అధిక లాభాలు పొందుతున్నాను
ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి పెట్టుబడి లేకుండా సహజంగా లభించే ఆకుల ద్వారా కషాయాలు తయారు చేసి అధిక లాభాలు పొందుతున్నాను. ముందు ప్రయత్నంలో కొద్దిపాటి దిగుబడి వచ్చినప్పటికీ ఇప్పుడు దిగుబడి బాగా పెరిగింది. అందరూ ఈ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని ఆశిస్తున్నా. గతేడాది ప్రభుత్వ ఎన్‌పీఎం షాపు ఏర్పాటుకు సహాయం చేశారు. దీని ద్వారా అన్ని రకాల కషాయాలను తయారుచేసి గ్రామంతో పాటు ఇతర గ్రామాలకు కాషాయాలు అందిస్తున్నాను. రెండేళ్ల క్రితం ఉత్తమ ఆదర్శ రైతుగా ప్రభుత్వం అవార్డు అందుకోవడం జరిగింది. ఎవరైనా ఈ వ్యవసాయ పద్ధతులు ఆచరించేందుకు ముందుకు వస్తే నేర్పేందుకు సిద్ధంగా ఉన్నా. గత ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయ శాఖలో ఐసీఆర్పీగా నియమించి, సేవలు అందజేస్తున్నా. వ్యవసాయంలో సలహాలు కావాలన్నా.. బియ్యంతో పాటు ఇతర సేంద్రియ ఉత్పత్తులు కావాలనుకున్నా 9966889697 నంబర్‌ను సంప్రదించవచ్చు.
- రైతు రాంబాబు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top