
ఆశ్వయుజ శుద్ధ సప్తమి, మంగళవారం, 16–10–2018
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే‘‘
శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మి. జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో రాక్షస సంహారం చేయటం అద్భుత ఘట్టం. మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోకస్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమష్టి రూపమైన అమృత స్వరూపిణిగా దుర్గమ్మ ఈ రోజు మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ తల్లిని దర్శించడం వలన భక్తులకు ఐశ్వర్యం, విజయం ప్రాప్తిస్తాయి.
అంగరంగ వైభవం... దుర్గమ్మ ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ ఉంటుంది. నిత్యం వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు జరుగుతాయి. ఇక దసరా ఉత్సవాల్లో భాగంగా కన్నులపండువగా జరిగే నగరోత్సవం చూడటానికి రెండు కళ్లూ చాలవు.
దుర్గామల్లేశ్వరస్వామి వార్లకు దసరా ఉత్సవాలలో జరిగే నగరోత్సవం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎంతటి ప్రాచుర్యం పొందాయో అదే తరహాలో దుర్గమ్మ దసరా ఉత్సవాలలో నగరోత్సవం అంతటి ప్రాచుర్యాన్ని పొందింది. కేరళ వాయిద్యాలు, పంచవాయిద్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, మహిళా భక్త బృందం కోలాటాలు, వేద పండితుల మంత్రోచ్చారణలతో నగరోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది.
నగరోత్సవంలో ఆలయ అధికారులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి నామస్మరణతో ముందుకు సాగుతారు. దసరా ఉత్సవాలు జరిగే సమయంలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు మల్లేశ్వరస్వామి వారి ఆలయం నుంచి ప్రారంభమయ్యే నగరోత్సవం... అర్జున వీధి, కనకదుర్గనగర్, విజయేశ్వర ఆలయం, ఘాట్ రోడ్డు మీదుగా దుర్గమ్మ సన్నిధికి చేరుతుంది. నగరోత్సవంలో పాల్గొనేందుకు ప్రముఖులందరూ ఆసక్తిని కనబరుస్తారు. మూడేళ్ల కిందట ప్రారంభించిన నగరోత్సవం నానాటికీ అంగరంగ వైభవంగా జరుగుతోంది.
చైత్రమాస బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు
ప్రతి ఏడాది చైత్రమాస బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. 9 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో రోజుకో వాహనంపై ఆది దంపతులు నగర పుర వీధుల్లో విహరిస్తారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఆది దంపతులు వెండి గజ వాహనం, రావణ వాహన సేవ, నంది వాహన సేవ, సింహ వాహన సేవ, వెండి రథోత్సవంపై వాహన సేవ జరుగుతాయి. ఇక ప్రతి ఉగాది పర్వదినాన్ని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లు వెండి రథంపై దుర్గగుడి నుంచి ఊరేగింపుగా నగర పుర వీధుల్లో విహరిస్తారు.
– ఎస్.కె. సుభానీ (ఇంద్రకీలాద్రి), విజయవాడ