మగపిల్లల్ని సన్మార్గంలో నడిపిస్తే..

Sexual attacks on India issue - Sakshi

ఆడపిల్లలు నిర్భయంగా జీవిస్తారు

పెంపకం

ఒక్కో దేశానికి ప్రస్తుతం ఒక్కో సమస్య ఉంది. సిరియా సమస్య అంతర్యుద్ధం. పాకిస్తాన్‌ సమస్య ఉగ్రవాదం. ఆఫ్రికాదేశాల సమస్య పేదరికం. రష్యా సమస్య అమెరికా. అమెరికా సమస్య డొనాల్డ్‌ ట్రంప్‌.  భారతదేశం సమస్య.. లైంగిక దాడులు! ఏదో జాడ్యం ప్రబలినట్లుగా ఇటీవలి కాలంలో చిన్నారులపై, బాలికలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌.. ఒక రాష్ట్రం అని చెప్పలేం. దేశమంతా ఈ వికృత ఘటనలకు నివ్వెరపోతోంది. ఆగ్రహావేశాలు దావానలంలా వ్యాపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం వైపు నుంచి ఒక్క భరోసా కూడా లభించలేదు. ‘ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. జాగ్రత్త’ అనే ఒక్క హెచ్చరికా వినిపించలేదు.

చివరికి ఈ రెండు రోజుల్లో మాత్రమే పెద్దవాళ్లు నోరు విప్పారు. ‘ఇలాంటి చర్యలు సిగ్గుచేటు’ అని భారత రాష్ట్రపతి, భారత ప్రధాని వ్యాఖ్యానించారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ లండన్‌ వెళ్లినప్పుడు ఆయనకేమీ ఆత్మీయ స్వాగతం లభించలేదు. అక్కడి భారతీయులు దేశాన్ని కుదిపేస్తున్న లైంగిక దాడులపై ప్లకార్డులతో మౌనంగా తమ నిరసన వ్యక్తం చేశారు. సమాధానంగా మోదీ పెదవి విప్పారు. ఈ ధోరణి కొనసాగడానికి వీల్లేదన్నారు. మగపిల్లల్ని సన్మార్గంలో నడిపిస్తే ఆడపిల్ల భద్రత గురించి ఆలోచించే అవసరమే ఉండదని అన్నారు. ఆ మాట నిజమే కానీ, ఈ లోపు జరిగే దారుణాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఒకటి ప్రభుత్వం వైపు నుంచి ఉండాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top