బ్యాలెన్స్‌ ఉంటే ఏ బ్యాలెన్సూ అక్కర్లేదు

Sakshi Special Interview With Shruti Hassan

ఎనభై ఏళ్ల వయసొచ్చాక శ్రుతీహాసన్‌ ఎలా ఉంటారు? ఎలా ఉన్నా.. తెలుగు సినిమాలో మాత్రం ఉంటారు! అంత అఫెక్షన్‌ శ్రుతీకి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే. ‘కాటమరాయుడు’ తర్వాత.. మళ్లీ రెండేళ్లకు ఓ తెలుగు సినిమాకు సైన్‌ చేశారు శ్రుతీహాసన్‌. ఇప్పటికైతే ఆ వివరాలు సీక్రెట్‌. శ్రుతీని వెంటనే చూసేయాలని అనుకుంటే మాత్రం.. వచ్చే నెల అమెరికన్‌ టీవీ చానెల్లో మొదలౌతున్న ‘ట్రెడ్‌స్టోన్‌’ కోసం రిమోట్‌ పట్టుకుని కూర్చోవచ్చు. అందులో నీరా పటేల్‌గా శ్రుతి ఓ బ్యాలెన్స్‌డ్‌ పాత్రలో నటించారు. అంతకన్నా బ్యాలెన్సింగ్‌ విషయాలు ‘సాక్షి’కి శ్రుతీహాసన్‌ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో చాలానే ఉన్నాయి.

లండన్‌లో అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘ట్రెడ్‌ స్టోన్‌’ షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్నట్లున్నారు. ఈ సిరీస్‌ కోసం మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నారట.?
అవును.. నేర్చుకున్నాను. అమెరికన్‌ పాపులర్‌ యాక్షన్‌ మూవీ ‘ది బోర్న్‌’ సిరీస్‌ అధారంగా ఈ టీవీ సిరీస్‌ చేస్తున్నాం. ఇందులో నేను భారతదేశానికి చెందిన హంతకురాలు నీరా పటేల్‌ పాత్రలో కనిపిస్తాను. అక్టోబర్‌ 15 నుంచి అమెరికన్‌ టీవీ చానల్‌ యుఎస్‌ఎ నెట్‌వర్క్‌లో ఈ సిరీస్‌ ప్రసారం అవుతుంది. ఇందులో నా పాత్ర పెద్ద పెద్ద ఫైట్స్‌ చేస్తుంది. ఆ ఫైట్స్‌ కోసమే నాలుగు వారాలు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నాను. సినిమా కోసం నేర్చుకున్న మార్షల్‌ ఆర్ట్స్‌ వ్యక్తిగతంగా కూడా పనికొచ్చేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా నాతో తేడాగా ప్రవర్తిస్తే ఒక్క ‘కిక్‌’ ఇస్తాను (నవ్వుతూ).

ఆడవాళ్లు సున్నితంగా ఉంటారు కాబట్టి మార్షల్‌ ఆర్ట్స్‌ చేయలేరని, నేర్చుకోవడం కష్టం అని అంటుంటారు
స్త్రీ శరీరం వేరు. పురుషుడి శరీరం వేరు. మగవాళ్లు బలవంతులుగా ఉండటానికి కారణం ‘టెస్టోస్టెరోన్‌’ అనే హార్మోన్‌. ఆడవాళ్లకు ఈ హార్మోన్‌ లేకపోవడం వల్ల అంత బలంగా ఉండరు. అయితే ఫైట్‌ చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తిని ఎక్కడ తొక్కాలి? ఎంత స్పీడ్‌గా కిక్‌ చేయాలి? వెనక నుంచి అతన్ని ఎలా పడగొట్టాలి? వంటి టెక్నిక్స్‌ ఉంటాయి. అవి నేర్చుకుంటే ఎంతటి బలవంతుడితోనైనా స్త్రీ పోరాడగలుగుతుంది. నేనెప్పుడూ చెబుతుంటాను.. అమ్మాయిలకు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పించాలని.

అలా మిమ్మల్ని మీరు రక్షించుకున్న సందర్భం ఏదైనా?
ఒకే ఒకటి. నేను ముంబైలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నా ఇంట్లోకి చొరబడ్డాడు. అప్పటికి నాకు మార్షల్‌ ఆర్ట్స్‌ తెలియదు. కానీ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేంత ధైర్యం ఉంది. నిజానికి ఇలాంటివి ఎదురైనప్పుడు కొందరు అమ్మాయిలు ముందు ‘బ్లాంక్‌’ అయిపోతారు. కానీ ఆ రోజు నేను అతన్ని వేగంగా తోసేసి, బయటకు పారిపోయేలా చేయగలిగాను.

హిందీ మూవీ ‘లక్‌’తో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఈ ఏడాదికి పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా విదేశాల్లో కెరీర్‌ మొదలుపెట్టడం ఎలా ఉంది?
చాలా వేగంగా గడిచిపోయింది. విశేషం ఏంటంటే... పదేళ్ల తర్వాత మళ్లీ న్యూ కమర్‌గా ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్‌తో కెరీర్‌ స్టార్ట్‌ అయింది. నేను దేవుడిని నమ్ముతాను. నా పట్ల చాలా దయగా ఉన్నాడనిపిస్తోంది. ఎందుకంటే తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా ఇక్కడ నా కెరీర్‌ని బాగా తీసుకెళ్లగలిగాను. ఇప్పుడు ఇంకో రూట్‌ చూపించాడు. లైఫ్‌ చాలెంజింగ్‌గా ఉంది. 19 ఏళ్ల వయసులో అమెరికాలో మ్యూజిక్‌ స్కూల్‌లో చేరాను. ఆ రోజలు గుర్తొస్తున్నాయి.

‘కాటమరాయుడు’ తర్వాత తెలుగు సినిమా కమిట్‌ కాలేదు..?
నా మ్యూజిక్‌ బ్యాండ్, ఇంటర్నేషనల్‌ సిరీస్‌తో బిజీగా ఉండటంవల్ల హీరోయిన్‌గా కొంచెం గ్యాప్‌ వచ్చింది. నేను విదేశాల్లో ఉన్నా నాలో ఉన్న సౌత్‌ గాళ్‌ అలానే ఉంది. అందుకే సౌత్‌లో రెండు సినిమాలు సైన్‌ చేశాను. వాటిలో ఒక తెలుగు సినిమా ఉంది. నేను తమిళ అమ్మాయిని అయినా హీరోయిన్‌గా నాకు స్టార్‌డమ్‌ తెచ్చింది ముందు తెలుగు సినిమానే. అందుకే తెలుగు పరిశ్రమకు, ప్రేక్షకులకు నా మనసులో స్పెషల్‌ ప్లేస్‌ ఉంటుంది. నాకు 80 ఏళ్లు వచ్చాక కూడా తెలుగు సినిమాకి అవకాశం వస్తే చేస్తాను.

ఇంతకుముందు మాట్లాడుతూ దేవుడు నా పట్ల దయగా ఉన్నాడని అన్నారు. కానీ దేవుడు   ఫేవర్‌ చేయని సమయాల్లో నిందిస్తారా?
నెవ్వర్‌. ఆ పని మాత్రం చేయను. ఎందుకంటే దేవుడు కష్టాలు ఇచ్చాడంటే ముందు ముందు మంచి ఇవ్వడానికే అని నమ్ముతాను. కొంతమంది లైఫ్‌ని చూస్తే.. పేదవాళ్లు ఎప్పటికీ పేదవాళ్లలా మిగిలిపోరు. మంచి మార్పొస్తుంది. జీవితంలో నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం అది. ఏదో జరిగిందని దేవుడిని నిందించడం కాదు. వాటిని ఎదుర్కొని నిలబడే పవర్‌ మనకి ఇచ్చాడు. దాన్ని ఉపయోగించకుండా దేవుడిని నిందిస్తే ఏం లాభం?

జీవితం ఇంకా మీకేం పాఠాలు నేర్పించింది?
మొత్తం ప్రపంచాన్ని చూస్తే ఏదీ స్టేబుల్‌ కాదు. భూమి, సూర్యుడు, చంద్రుడు అన్నీ తిరుగుతూనే ఉంటాయి. బ్యాలెన్స్‌ అనేది లేదు. అందుకే మనం లైఫ్‌ని బ్యాలెన్స్‌ చేసుకోవాలి. చెబితే నవ్వుతారేమో కానీ ఈ మధ్య నేనో ప్రాక్టీస్‌ మొదలుపెట్టాను. ఒక సగం బంతి మీద ఒక కాలు పెట్టి,  ఇంకో కాలితో గాల్లో నిలబడుతూ, పడిపోకుండా నన్ను నేను బ్యాలెన్స్‌ చేయడానికి ట్రై చేస్తున్నాను. మామూలుగా ఒక కాలు మీద నిలబడటమే కష్టం. అలాంటిది ఆ కాలు కింద బంతి పెట్టుకుని బ్యాలెన్స్‌ చేయడం అంటే ఇంకా కష్టం. కానీ నేను అచీవ్‌ చేయగలుగుతున్నాను. త్వరలో రెండు కాళ్లతో బంతి మీద నిలబడి, పడకుండా ప్రాక్టీస్‌ మొదలుపెడతాను. అంత ఏకాగ్రతతో బ్యాలెన్స్‌ చేయగలిగితే మనం లైఫ్‌లో అన్నింటినీ బ్యాలెన్స్‌ చేయగలుగుతాం అని నా నమ్మకం. అసలు మన జాబ్‌ ఏంటంటే ‘లైఫ్‌ని బ్యాలెన్స్‌’ చేయడమే.

అయితే మనం చాలామంది లైఫ్‌లో బ్యాలెన్డ్స్‌గా ఉండాలంటే బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉంటే సరిపోతుందనుకుంటాం. మీరూ అలా ఆలోచించిన సందర్భాలు ఉన్నాయా?
యస్‌. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉంటే చాలని నేనూ అనుకున్న రోజులు ఉన్నాయి. నేను కూడా తప్పులు చేశాను. టూ మచ్‌గా ఖర్చు పెట్టేదాన్ని.  డబ్బులు కోసమే పని చేశాను. కానీ ఆత్మసంతృప్తి దొరకలేదు. హ్యాపీగా ఉండటానికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉంటే సరిపోదని అప్పుడు అర్థమైంది. అయితే నాతో పాటు ఉన్న హీరోయిన్లతో పోల్చితే డబ్బు సంపాదనలో నేను చాలా వీక్‌. నేను అంత స్మార్ట్‌ కాదు. మనీ మేకింగ్‌ క్వాలిటీ నాకు లేదు.

యాక్చువల్‌గా మీ నాన్నగారు కూడా ఈ విషయంలో స్మార్ట్‌ కాదని అంటుంటారు..
నాన్నగారు సినిమాల్లో సంపాదించింది సినిమాల్లోనే పెడుతుంటారు. మామూలుగా ఎవరైనా అయితే ప్రాపర్టీస్‌ కొంటారు. కానీ నాన్నగారు రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ బేనర్‌ పెట్టి, సినిమాలు నిర్మిస్తుంటారు. ఆయనకు సినిమాలంటే ప్రేమ.

మరి.. మాకేమైనా మిగుల్చుతారా? ప్రాపర్టీలో మా షేర్‌ ఎంత? అని మీరు, మీ చెల్లెలు అడిగిన సందర్భాలేమైనా?
(నవ్వేస్తూ). మా చైల్డ్‌హుల్డ్‌ చాలా కంఫర్టబుల్‌. నాన్నగారు మమ్మల్ని చెన్నైలో మంచి స్కూల్లో చదివించారు. ఆ తర్వాత అమెరికాలో బెస్ట్‌ కాలేజీలో చేర్చారు. మంచి ఫుడ్, మంచి బట్టలు, ఖరీదు గల కార్లు, మంచి ఇల్లు... ది బెస్ట్‌ ఇచ్చారు. 21 ఏళ్లకే నేను హీరోయిన్‌ అయి, సంపాదించడం మొదలుపెట్టాను. అప్పటినుంచి నాన్నగారి దగ్గర్నుంచి డబ్బులు తీసుకోవడం మానేశాను. ఇంతవరకూ నాన్నగారిని ప్రాపర్టీలో నా షేర్‌ ఏంటి? అని అడగలేదు. ఎందుకంటే నాకు కావాల్సిన ఆస్తులను నేనే సంపాదించుకుంటాను. రేపు నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తాను. తల్లిదండ్రులు ఇచ్చేవి ఇస్తారు. కానీ మన ప్రయత్నం ఉండాలి.

ఫైనల్లీ.. ఇన్ని విషయాలు ఫ్రాంక్‌గా చెప్పారు. మరి.. మైఖేల్‌ కోర్సలే నుంచి విడిపోయిన విషయం గురించి మాట్లాడతారా?
లైఫ్‌లో ఓపెన్‌గా ఉండాలనే విషయం నా ఫస్ట్‌ రిలేషన్‌షిప్‌ ద్వారా తెలుసుకున్నాను. మొట్టమొదటిసారి నేను రిలేషన్‌లో ఉన్నప్పుడు ఆ విషయం బయటకు చెప్పడానికి భయపడ్డాను. ఎవరైనా ఏమైనా తప్పుగా అనుకుంటారేమో? అని భయం. ఆ రిలేషన్‌ వర్కవుట్‌ కాలేదు. ఆ తర్వాత కొన్నేళ్లకు మళ్లీ ఓ బంధం ఏర్పడింది. ఈసారి ఎందుకు బయటకు చెప్పకూడదు? అనిపించింది. అవును.. ఓ స్పెషల్‌ రిలేషన్‌ ఉన్నానని బయటకు చెప్పేశాను.

నేనలా ఫ్రాంక్‌గా చెప్పడాన్ని చాలామంది మెచ్చుకున్నారు. జీవితాంతం కొనసాగించాలనే ఏ బంధాన్నయినా మొదలుపెడతాం. అది కుదరనప్పుడు ఏం చేయగలం? ఆ బంధం మొదలైనందుకు హ్యాపీ ఫీలయ్యాను. ముగిసిపోయనప్పుడూ ఆనందపడ్డాను.  నా ఆలోచన చాలా ప్యూర్‌గా ఉంది. ఆ రిలేషన్‌కి నేను నా బెస్ట్‌ ఇచ్చాను. కానీ వర్కవుట్‌ కాలేదు. లైఫ్‌లో ఇలాంటివి చాలామందికి ఉంటాయి. విఫలమవుతున్న వివాహ బంధాలను కూడా చూస్తున్నాం కదా. ఏదీ మన చేతుల్లో ఉండదు. లైఫ్‌ ఎలా తీసుకెళితే అలా వెళ్లడమే. కానీ మన ఆలోచనలు, చేసే పనులు ‘ప్యూర్‌’గా ఉండాలి.
– డి.జి. భవాని

ఇటీవల మీ నాన్నగారు నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆ విషయం గురించి?
నేను ఈ మధ్య హీరోయిన్‌గా 10 ఇయర్స్‌ కంప్లీట్‌ చేశాక ‘పదేళ్లు కంప్లీట్‌ చేశారు. నాట్‌ ఎ జోక్‌. చాలా సాధించారు’ అని లండన్‌లో అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు నాన్నగారు 60 ఏళ్లు పూర్తి చేశారని తెలిసి, ‘వావ్‌... 60 ఇయర్స్‌.. గ్రేట్‌’ అన్నారు. నిజమే.. 60 ఏళ్ల కెరీర్‌ ముందు 10 ఏళ్లు ఎంత? ఎంతో డెడికేషన్‌ ఉండబట్టే నాన్నగారు ఇన్నేళ్లు ఉండగలిగారు. నాకు లైఫ్‌లో ఇన్‌స్పైరింగ్‌ పర్సన్‌ అంటే నాన్నగారే. ఆయనకు భయం అనేది తెలియదు.

సినిమాల్లో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందున్నారు. ఇప్పుడు పాలిటిక్స్‌లోకి వెళ్లారు. రాజకీయాలు అంత ఈజీ కాదు. అయినా వెళ్లారు. చిన్నప్పటినుంచీ నాన్న ధైర్యం చూస్తూ పెరిగాను కాబట్టి నాకు భయం తక్కువ. పదేళ్లు ఇక్కడ సినిమాలు చేసి, హఠాత్తుగా అమెరికాలో కెరీర్‌ స్టార్ట్‌ చేయడానికి ఇన్‌స్పిరేషన్‌ మా నాన్నగారు. ఏమవుతుందో ఏంటో అని భయపడితే ఇంతదాకా వచ్చేదాన్ని కాదు. అసలు నా ఫీలింగ్‌ ఏంటంటే.. లైఫ్‌లో చాలామంది ‘భయం’ వల్ల ఏదీ సాధించకుండా మిగిలిపోతుంటారు.

ఇప్పుడు మన దేశీ స్టార్స్‌ చాలా మంది వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తున్నారు. మీక్కూడా ఆ ఐడియా ఉందా?
డెఫినెట్‌గా చేస్తాను. నా ఫోన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమేజాన్, ఊట్‌.. ఇలా అన్ని యాప్స్‌ ఉన్నాయి. ట్రావెల్‌ చేస్తున్నప్పుడు దాదాపు అన్ని సిరీస్‌లను చూస్తాను. ఇండియన్‌ షోస్‌లో నాకు ‘సాక్రెడ్‌ గేమ్స్‌’ అంటే చాలా ఇష్టం. మంచి స్క్రిప్ట్, రోల్‌ దొరికితే తప్పకుండా వెబ్‌ సిరీస్‌ చేస్తాను.

 స్లిమ్‌ అయ్యారు?
ఒక కారణం మార్షల్‌ ఆర్ట్స్‌. నిజానికి మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే ఎవరినో కొట్టడానికి నేర్చుకునేది కాదు. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్‌గా ఉంచుకోవడానికి మీతో మీరు ఫైట్‌ చేయడానికే మార్షల్‌ ఆర్ట్స్‌.  ఈ ఆర్ట్స్‌ వల్ల నాకు లైఫ్‌లో చాలా ఫోకస్‌ వచ్చింది.

మరి డైట్‌ సంగతి?
దేవుడు మనకు ఒకే ఒక్క జీవితం ఇచ్చాడు. సలాడ్స్‌ తింటూ కూర్చుంటే ఏం బాగుంటుంది? లైఫ్‌  బోర్‌ కొట్టేస్తుంది. అందుకని అన్నీ బాగా తింటాను. బాగా వర్కవుట్స్‌ చేస్తాను.

ఇండియాలో స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకుని, విదేశాల్లో కొత్త ఆర్టిస్ట్‌ అనిపించుకోవడం ఎలా ఉంది?
ఒక న్యూ కమర్‌ ఎలా కష్టపడతారో అలానే పడుతున్నాను. ఒక విషయంలో మాత్రం చాలా రిలీఫ్‌గా ఉంది. ఎందుకంటే ‘మీ నాన్నగారు కమల్‌హాసన్‌ కదా.. మీ అమ్మ సారిక కదా. వాళ్లు గొప్ప ఆర్టిస్టులు’ అంటూ పోలిక పెట్టేవాళ్లు ఇక్కడ లేరు. కానీ మన దగ్గర వేరే విధంగా ఉండేది. తల్లీతండ్రిలా మంచి పేరు తెచ్చుకుంటుందో? లేదో అనేవారు. నా మీద నాకు నమ్మకం ఉన్నప్పటికీ నాన్న లాంటి లెజెండ్రీ ఆర్టిస్ట్‌తో పోల్చినప్పుడు చాలా భయం అనిపించేది.

బయటకు మాత్రం మామూలుగా ఉండేదాన్ని. కంపేరిజన్‌ అనేది మన దగ్గర ఎప్పుడూ ఉంటుందేమో? ఎందుకు అలా అంటున్నానంటే ‘శ్రీమంతుడు’ రిలీజయ్యాక ‘చాలా బాగా నటించారు’ అంటూనే ‘మీ నాన్నగారు ‘స్వాతిముత్యం’ సినిమాలో ఎంతో బాగా నటించారు’ అన్నారు ఒక వ్యక్తి. నాకు నవ్వాగలేదు. నాన్న ఎక్కడ? నేను ఎక్కడ? అయితే లండన్‌లో  ‘శ్రుతి ఎలా యాక్ట్‌ చేస్తోంది? తను ఎంత టాలెంటెడ్‌’ అని మాత్రమే చూస్తున్నారు. దాంతో కొంచెం స్వేచ్ఛ దొరికినట్లుగా ఉంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top