
డాక్టర్ నోముల సత్యనారాయణ (1940–2018) వృత్తిరీత్యా ఇంగ్లిష్ లెక్చరర్‌గా పనిచేశారు. ఆయన్ని సన్నిహితులు వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా అంటారు. ఆయన విమర్శా వ్యాసాలు ‘సామ్యవాద వాస్తవికత– మరికొన్ని వ్యాసాలు’గా వచ్చాయి. టావ్‌చెంగ్ రాసిన చైనీస్ నవలను ‘నా కుటుంబం’గా తెలుగులోకి అనువదించారు. నోముల ఉదయం, సాయంత్రం కొంతసేపు నల్లగొండలోని ఒక దుకాణం దగ్గర కూర్చునేవారు. ఆయన పూర్వ సహచరులు, యువమిత్రులు అక్కడికి వస్తుండేవారు కలవడానికి. సాహిత్యం చుట్టూ ప్రపంచం చుట్టూ ముచ్చట్లు నడుస్తుండేవి. అట్లా వచ్చిన ఓ యువకుడు నోములను ఒక ప్రశ్న అడిగాడు: ‘‘ఈ ‘విద్యాదాత’, ‘సభాసమ్రాట్’ వీళ్లకు ఈ బిరుదులు ఎవరిచ్చిండ్రు సార్?’’ నోముల నవ్వుతూనే, ‘‘వాళ్లేమన్నా అడుక్కతింటున్నారయా, ఎవరిచ్చేదేంది, వాళ్లకు ఇష్టమైనది వాళ్లే పెట్టుకుంటరు, నీకే బిరుదు కావాలే?’’ అని ఎదురు ప్రశ్నించారట.‘
(సౌజన్యం: నోముల స్మారక సంచికలోని దాసి సుదర్శన్ వ్యాసం)