సదాచరణలు | Sakshi
Sakshi News home page

సదాచరణలు

Published Mon, May 29 2017 11:34 PM

సదాచరణలు

రమజాన్‌ కాంతులు

హజ్రత్‌ అబూహురైరా (ర) కధనం ప్రకారం ముహమ్మద్‌ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు. ‘రమజాన్‌ వస్తూనే స్వర్గద్వారాలన్నీ తెరవబడతాయి. నరక ద్వారాలన్నీ మూసివేయబడతాయి. షైతానులు బంధించబడతారు’. సత్కార్యాభిలాషులైన దైవదాసులు రమజాన్‌ మాసంలో ఆరాధనల్లో, దైవవిధేయతలో నిమగ్నమైపోతారు. పగలంతా రోజా పాటిస్తూ, గ్రంధ పారాయణంలో గడుపుతారు. రాత్రిలోని ఒక పెద్దభాగం తరావీహ్, తహజ్జుద్, దుఆ, ఇస్తెగ్‌ ఫార్‌లలో వెచ్చిస్తారు. ఈ శుభాల ప్రభావం వల్ల సాధారణ విశ్వాసుల హృదయాలు కూడా ఆరాధనలు, సత్కార్యాలౖ వెపు మొగ్గి చెడులకు దూరంగా ఉంటాయి. ఈ విధంగా ఇస్లామ్, ఈమాన్‌ల భాగ్యం పొందిన ప్రజలు దైవభీతి, దైవప్రసన్నత,ౖ దెవవిధేయతల మార్గంలో సహజంగానే ముందుకుపోతారు.

మానవ హృదయాల్లో ‘మంచి’ ‘సత్కార్యాభిలాష’ అన్నది ఏ కాస్త ఉన్నా అది దైవ ప్రసన్నత కోసం పరితపిస్తుంది. దీంతో ఏ చిన్న సదాచరణ చేసినా ఈ పవిత్రమాసంలో అనేకరెట్లు అధికంగా ప్రసాదించబడుతుంది. ఇతర మాసాలతో పోల్చుకుంటే ఈ మాసం సదాచరణల విలువ అత్యంత అధికం. వీటన్నిటి ఫలితంగా ఇలాంటి వారికోసం స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. నరకద్వారాలు మూసుకుపోతాయి. వీరిని అపమార్గం పట్టించడం షైతానుల వల్లకాని పని. దుష్కార్యాల వైపు ప్రేరేపించలేకపోయినప్పుడు షైతానులు బంధించబడినట్లే గదా!

స్వర్గద్వారం తెరుచుకున్నది
నరకమార్గం మూసుకున్నది
దుర్మార్గుడైన సాతానుకు
మనాదిగట్టిగ పట్టుకున్నది!
వెనుకముందు చూడకుండ
సత్కార్యములనాచరించు
కురుస్తున్నది దైవకరుణ
అన్నిచెడులను విస్మరించు!!
–  మదీహా అర్జుమంద్‌

Advertisement
Advertisement