పతకాలను ఛేదించింది

Ramayamma has won medals at national level competitions - Sakshi

స్త్రీ శక్తి

అర్జునుడు విల్లు ఎక్కుపెట్టి గురి చూస్తే, అతడికి పక్షి కన్ను తప్ప మరేమీ కనిపించేది కాదు. అందుకే గొప్ప విలుకాడయ్యాడు. రామాయమ్మ విల్లు ఎక్కిపెట్టి గురి చూసినా అంతే.. బాణం లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది. అందుకే రామాయమ్మ చేతిలో బాణాన్ని రామబాణం అంటారు ఆమె గురించి తెలిసిన వాళ్లు. విలువిద్య మగవాళ్లకే పరిమితం అని ఎవరూ నిర్దేశించలేదు, కానీ మహిళలు ఆసక్తి చూపకపోవడంతో ఆ కళకు మగవాళ్ల విద్య అనే ముద్ర పడింది. ఆ ముద్రను కూడా బాణంతో ఛేదించింది రామాయమ్మ. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. కడబాల రామాయమ్మది తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం. ఆదివాసీ మహిళ. ప్రస్తుతం ఆమె దేవీపట్నం మండలం ముసినికుంట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా అమ్మాయిలకు విలువిద్యలో శిక్షణనిస్తున్నారు.

నాన్న నేర్పించాడు
‘‘చిన్నప్పుడు నాన్న నాకు ఆడుకోవడానికి విల్లంబులు తయారు చేసిచ్చాడు. అలా బాణాలు వేయడం అలవాటైంది. మాది గంగవరం మండలం మోహనాపురం. ప్రాథమిక విద్య సొంతూర్లోనే. హైస్కూల్‌కి అడ్డతీగలకు వెళ్లాను. ఆ స్కూల్లో పీఈటీ రాజయ్య సార్‌ నేను బాణాలు వేయగలనని గుర్తించి మరిన్ని మెళకువలు నేర్పించారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు కూడా తీసుకెళ్లారు. జాతీయ స్థాయిలో, రూరల్‌ విలువిద్య పోటీల్లో బంగారు పతకాలు వచ్చాయి. ఆ తర్వాత పంజాబ్, ఒడిషా, కేరళ, మధ్యప్రదేశ్‌లలో జరిగిన జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో కూడా పతకాలందుకున్నాను. న్యూఢిల్లీలో 1982లో జరిగిన ఆసియా క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు ఇప్పటికీ సంతోషాన్నిచ్చే విషయం. రంపచోడవరం ఏజెన్సీలో పుట్టిన నేను రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించగలనని కలలో కూడా ఊహించలేదు’’ అన్నారు రామాయమ్మ.

స్వతహాగా అబ్బుతోంది
ఏజెన్సీ ఏరియాలో పుట్టి పెరిగిన వాళ్లకు విలువిద్యలో రాణించే లక్షణం పుట్టుకతోనే అబ్బుతోందని చెప్పారు రామాయమ్మ. ‘‘తూర్పు ఏజెన్సీలో అనేక మంది విద్యార్థుల్లో విలువిద్యలో రాణించే సత్తా ఉంది. జాతీయ స్థాయి మహిళల విలువిద్య పోటీల్లో ఎర్రపాలెం పాఠశాల విద్యార్థినులు ద్వితీయస్థానం సాధించారు. నేను ఇప్పటి వరకు 50 మంది విద్యార్థులకు విలువిద్యలో ఉత్తమ శిక్షణ ఇచ్చాను. రంపచోడవరం కేంద్రంగా ఆర్చరీ క్లబ్‌ ఏర్పాటు చేస్తే వీరిని నైపుణ్యం కలిగిన క్రీడాకారులగా తీర్చిదిద్దవచ్చు. ఒలింపిక్స్‌  ఆర్చరీ పోటీలకు ఏజెన్సీ ప్రాంతం నుంచి విలువిద్య క్రీడాకారులను పంపించాలనేది  నా కోరిక’’ అన్నారామె.
సాక్షి ప్రతినిధి, రంపచోడవరం

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top