సోదరులకు రక్షాపూర్ణిమ

Rakhi Purnima Festival Special Story - Sakshi

పర్వదినం

శ్రావణ పూర్ణిమ, వరలక్ష్మీ వ్రతం అంటే తెలియని వారు ఉండవచ్చునేమో కానీ, రాఖీపండగ అంటే తెలియని వారుండరు. చిన్న నుంచి పెద్ద వరకు పురుషులందరి చేతులూ రకరకాల రాఖీలతో తళతళ మెరిసిపోతుంటాయి.

శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమనాడు సోదరి చేత రక్ష కట్టించుకుంటే దేవతలందరి రక్షణ కలుగుతుందని ప్రాచీన కాలం నుంచి ఉన్న విశ్వాసం. భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడచు శక్తి స్వరూపిణి. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపం. అందుకే ఆమెను తల్లిదండ్రులు మంగళ, శుక్రవారాలలో పుట్టింటి నుంచి పంపరు. వివాహ సమయంలో అప్పగింతల కార్యక్రమం కూడా శుక్రవారం గడిచే దాకా ఆగి ఆ తర్వాతనే పూర్తి చేస్తారు. సోదరి చేత రక్షాబంధనం కట్టించుకుంటే అరిష్టాలన్నీ తొలగి దేవతలందరి అనుగ్రహం కలిగి, సర్వజగద్రక్ష ఏర్పడుతుందనే దృష్టితో ప్రాచీనులు ఈ సంప్రదాయాన్ని ఏర్పరిచారు.

ఈవేళ ఇలా చేయాలి
శ్రావణపూర్ణిమనాడు సూర్యోదయకాలంలోనే స్నానం చేసి, మనం ఎవరి రక్షణ అయితే కోరుకుంటున్నామో– అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు మనఃపూర్వకంగా ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి గల ఈ రక్షికకీ పూజ చెయ్యాలి. అంటే పూజాశక్తిని రాఖీలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట. అలా పూజాశక్తితో కూడుకున్న ఈ రక్షికని సోదరుడు లేదా సోదర సమానంగా భావించిన వ్యక్తి ముంజేతికి కడుతూ– నేను ఫలాని వారికి రక్షణ కోసం కడుతున్నాను అని మనసు నుండా భావన చేసుకుని ఆ రక్షిక మీద అక్షతలని వేయాలి. ఆ తర్వాత తీపి తినిపించాలి. 

యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః
తేన త్వామపి బధ్నామి రక్షే! మా  చల మాచల!

రాక్షసులకి రాజూ, మహాబలవంతుడూ అయిన బలి చక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమైపోయాడో, దేవతలంతా తమ తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికని కట్టారో, ఆ రక్షికా శక్తి నాలో ప్రవేశించిన నేను కూడ ఈ సోదరుడు లేదా మిత్రునికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీనుండి తొలగకుండును గాక! అని పై శ్లోకానికి అర్థం. రక్షాబంధనం కట్టించుకున్న సోదరుడు ఆ సంవత్సరకాలంపాటూ ఆమెకి అన్నింటా అండగా నిలవాలి.

ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమేననీ పౌరాణిక, చారిత్రక గాథల ద్వారా తెలుస్తోంది. ఒకప్పుడు తెల్ల ఆవాలతోనూ, అక్షతలతోనూ పూజించిన సూత్రాన్ని పురోహితుడు ఆ దేశపు రాజు ముంజేతికి ముడి వేసేవాడు. క్రమేపీ ఇది కేవలం సోదరీ సోదరులకు మాత్రమే పరిమితమైన బంధంగా ముడిపడింది.
తన సోదరుని జీవితం ఎల్లప్పుడూ తియ్యగా ఉండాలని, తలపెట్టే ప్రతికార్యం విజయవంతం కావాలని, అతనికి సకల సంపదలు చేకూరాలని కోరుతూ తోబుట్టువులు సోదరుని చేతికి రక్షాబంధనం కట్టే ఈ పండుగ నుంచి గ్రహించవలసిన పరమార్థం ఏమంటే– ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కల్మషమైన ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో జరుపుకునే ఈ పండుగ సమాజంలో అందరూ ఒకరికొకరు తోబుట్టువుల వంటి వారేనని, స్వంత సంబంధం లేకపోయినా, సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు పరిఢవిల్లాలని, తోబుట్టువులు లేరని చింతించకండా సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలిచినప్పుడే ఈ పండుగకు సార్థకత.  – డి.వి.ఆర్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top