డాడీ లాంటి గర్ల్‌ఫ్రెండ్‌

Rajmata realized that Tara really fell in love with her son - Sakshi

డాడీని ప్రేమించినంతగా అమ్మాయిని ప్రేమించొచ్చు!ఇది అతిశయోక్తే! అమ్మాయిని ప్రేమించినంతగాడాడీని  ప్రేమించొచ్చేమో!విదిలించుకుపోయిన కొడుకును.. వీధిపాలైన ప్రేమనుమళ్లీ గెలుచుకోవాలనినెట్‌లో ఓనమాలు తెలియనిఓ తండ్రి విసిరిన వలే ఈ కథ!కాని అబద్ధం దాగదుగా!అబద్ధం కొన్ని రోజులు అందంగా అనిపించినా..చివరకు డాడీలా కనపడితే! ఏమౌతుంది?!

‘‘నేనేం తప్పు చేశాను? మీ అమ్మ నాతో అబద్ధం ఆడితే నువ్వు నాకు పనిష్మెంట్‌ ఇస్తున్నావ్‌. అవును.. మీ అమ్మకు పెద్ద యాక్సిడెంటే అయింది. కానీ అప్పుడు నువ్వు ఫైనలియర్‌ ఎగ్జామ్స్‌ రాస్తున్నావ్‌. నిజం తెలిస్తే డిస్టర్బ్‌ అయిపోయి నీ చదువు పాడుచేసుకుంటావని.. మీ అమ్మ నాకు అబద్ధం చెప్పి అదే అబద్ధాన్ని నాతోనూ ఆడించింది. మీ అమ్మ సడెన్‌ డెత్‌తో  నా గుండె పగిలింది. బిజినెస్‌లో లాస్‌.. ఇల్లు అమ్మక తప్పని పరిస్థితి.. ఒరేయ్‌.. ఓటమిని కొడుకుతో పంచుకునేంత ధైర్యం లేని తండ్రినిరా.. అందుకే నీకు చెప్పకుండా ఇల్లు అమ్మేశా.

 తారా విషయంలో కూడా నేను చేసింది తప్పు కాదు. నీతో మాట్లాడేందుకు ట్రై..’’ అని అంటూండగానే ఆ తండ్రిని వాటేసుకున్నాడు కొడుకు ‘‘సారీ పాపా (నాన్న).. నన్ను క్షమించు’’ అంటూ. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ‘రాజ్‌మా చావల్‌’ అనే సినిమాలోని దృశ్యం. ఓల్డ్‌ ఢిల్లీలో ప్రాణం దాచుకున్న తండ్రికి, న్యూఢిల్లీలో ప్రాణం పోసుకున్న కొడుక్కి మధ్య భావోద్వేగాల ఘర్షణ, అభిప్రాయభేదాల సంఘర్షణ ఈ సినిమా. ఇంకా చెప్పాలంటే ఫాస్ట్‌ఫుడ్‌కి, సంప్రదాయ భోజనానికి, ఎదురెదురు సంభాషణకు, మెస్సెంజర్‌లో చాటింగ్‌కున్న వ్యత్యాసమే  రాజ్మాచావల్‌. 

 పైన చెప్పిన సీన్‌కి ముందూ,  వెనక కథ.. 
తండ్రి పేరు రాజ్‌ మాథుర్‌(రిషీకపూర్‌). ఓల్డ్‌ ఢిల్లీలోని చాంద్‌నీచౌక్‌లోనే పుట్టి పెరుగుతాడు. ఆ ప్రాంతం.. బాల్య స్నేహితులంటే రాజ్‌మాథుర్‌కి చచ్చేంత ఇష్టం. ‘‘మన పిల్లలకు ఈ గజిబిజి వాతావరణం వద్దు.  ప్రశాంతంగా ఉన్న లొకాలిటీకి మారుదాం’’ అని  భార్య కోరితే కొత్త ఢిల్లీకి షిఫ్ట్‌ అవుతాడు. అక్కడే పుడ్తాడు కబీర్‌ మాథుర్‌ (అనిరు«ద్‌ తన్వార్‌). అమ్మ కూచీ. ఆధునిక తరానికి ప్రతినిధి. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌.

సంగీతం అంటే చెవికోసుకుంటాడు. గిటార్‌ ప్లేయర్‌. ఓ బ్యాండ్‌ పెట్టి మ్యూజిక్‌ పెర్‌ఫార్మెన్సెస్‌ ఇవ్వాలనుకుంటాడు. కబీర్‌ సీరియస్‌గా ఆ ట్రయల్స్‌లో ఉన్నప్పుడే అతని తండ్రి హఠాత్తుగా   మకాంను చాంద్‌నీ చౌక్‌కి మార్చేస్తాడు. కనీసం కొడుకుతో మాటైనా చెప్పకుండా. అది కబీర్‌కు కోపం తెప్పిస్తుంది. అమ్మకు జరిగింది చిన్న యాక్సిడెంటే అని అబద్ధమాడి సరిగ్గా ట్రీట్‌మెంట్‌ ఇప్పించలేదని, ఇప్పుడు ఆమె తిరిగిన ఆ ఇంటినీ అమ్మేసి అమ్మ జ్ఞాపకాలకు దూరంగా చాంద్‌నీచౌక్‌ తీసుకెళ్తున్నాడనీ..  డబ్బు తప్ప తండ్రికేదీ  ముఖ్యం కాదనే  అపార్థంతో తండ్రిని బాధపెడుతూ ఉంటాడు.. అతనితో మాట్లాడకుండా.

చాంద్‌నీ చౌక్‌.. ఫేస్‌బుక్‌ తార
తండ్రీకొడుకుల మధ్య మాటలు పెంచడానికి  రాజ్‌మాథుర్‌ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ ఒక ఉపాయం ఆలోచిస్తారు.  రాజ్‌ మాథుర్‌ చేత  ఓ స్మార్ట్‌ ఫోన్‌ కొనిపిస్తారు. అతనిపేరుతో  ఫేస్‌బుక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేయించి కబీర్‌కి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ కూడా పంపిస్తారు. కొడుకు రిజెక్ట్‌ చేయడమే కాక.. తండ్రిని బ్లాక్‌లిస్ట్‌లో పెడ్తాడు. చిన్నబుచ్చుకుంటాడు రాజ్‌మాథుర్‌. అప్పుడు రాజ్‌మాథుర్‌ స్నేహితుడి తల్లి... టెక్నోసావి అన్నమాట. ఆమె తన ఫెబీ అకౌంట్‌లోని ఫ్రెండ్స్, మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌.. వాళ్ల ఫ్రెండ్స్‌ లిస్ట్‌నంతా జల్లెడ పట్టి..  ఒకమ్మాయి ఫోటో తీస్తుంది. దాన్ని ప్రొఫైల్‌పిక్‌గా పెట్టి తార (అమైరా దస్తూర్‌) అనే పేరుతో ఒక కొత్త అకౌంట్‌  క్రియేట్‌ చేస్తుంది. రాజ్‌మాథుర్‌ కొడుకు కబీర్‌కు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తుంది. వెంటనే ఓకే చేస్తాడు కబీర్‌.

 ఆ అకౌంట్‌ నుంచి అమ్మాయిలాగే కొడుకుతో చాట్‌ చేయమని సలహా ఇస్తుంది ఆమె. తామిద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్‌ గ్యాప్‌ పోవాలంటే ఇదొక్కటే మార్గమనుకొని చాటింగ్‌ మొదలుపెడ్తాడు తండ్రి. కబీరూ ఆసక్తిగా తన ఇష్టాయిష్టాలు పంచుకుంటూంటాడు. సందర్భం వచ్చినప్పుడల్లా తారగా చాట్‌ చేస్తున్న రాజ్‌మాథుర్‌ జీవితంలో తండ్రి రోల్‌ గురించి చెప్తుంటాడు. నిర్మొహమాటంగానే ఖండిస్తుంటాడు కబీర్‌. ఎదురెదురుగా కూర్చోని కూడా ఇద్దరూ సెల్‌ఫోన్‌ కీ బోర్డ్‌ ద్వారే మాటలు కదుపుతుంటారు. కబీర్‌కు తెలియదు అవతల చాట్‌ చేస్తోంది  తండ్రేనని. మొత్తానికి పట్టువీడని రాజ్‌మాథుర్‌ చాటింగ్‌ ద్వారా తన కొడుకులో కొంత మార్పు తేగలుగుతాడు. తనతో ప్రత్యక్షంగా కొడుకు మాట్లాడేలా చేసుకోగలుగుతాడు. ఓ పబ్‌లో తను ఇస్తున్న మ్యూజిక్‌ షోకీ తన తండ్రిని ఆహ్వానించేంత దగ్గరవుతాడు కబీర్‌.  

ఆ రోజు.. 
ఆ పబ్‌కి తారగా ఎఫ్‌బీ ప్రొఫైల్‌ పిక్‌ ఉన్న అమ్మాయి కూడా వస్తుంది. స్టేజ్‌ మీదున్న కబీర్‌ ఆమెను చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతాడు. అది ఆమె తనకిచ్చిన సర్‌ప్రైజ్‌ అనుకుంటాడు. ఆ షోకి వచ్చిన రాజ్‌ మాథుర్‌ అండ్‌ ఫ్రెండ్స్‌ కంటా పడ్తుంది ఆ అమ్మాయి. అవాక్కవుతారంతా. ఈలోపే ఆ అమ్మాయి వెంట ఇంకో అబ్బాయి పడ్తుంటాడు. తప్పించుకుని వెళ్లబోతుంటే కబీర్‌ ఎదురొస్తాడు... తారా.. తారా.. అంటూ! బిత్తరపోతుంది అమ్మాయి.

పొరపాటు పడ్తున్నాడేమో.. తన పేరు తార కాదని చెప్పబోయి ఆగిపోతుంది. వెంటపడ్తున్నవాడిని తప్పించుకోవడానికి తన ముందున్న వ్యక్తితో తారగానే నటించాలనుకుంటుంది. అతనితో అంతకుముందే పరిచయమున్నట్టు ముద్దు పెట్టుకుంటుంది.  ఇదంతా చూస్తున్న రాజ్‌మాథుర్‌ అండ్‌ ఫ్రెండ్స్‌ అయోమయంలో పడిపోతారు. ఈ సంఘటన తర్వాత ఒకట్రెండుసార్లు కబీర్‌కు  బయట  తారసపడ్తుంది తార. కాని పట్టించుకోదు. ఎఫ్‌బీలో మాత్రం ఏమీ తెలియనట్టే చాట్‌చేస్తుంటే చిర్రెత్తుకొస్తుంది అతనికి. ఆ చిరాకులోనే తండ్రితో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోతాడు కబీర్‌. 

తర్వాత..
ఇదంతా తార మూలంగానేమో అని సందేహపడ్తాడు రాజ్‌మాథుర్‌. కొడుకుకి నిజం తెలిసేకంటే ముందే ఆ అమ్మాయిని పట్టుకొని అసలు విషయం చెప్పేయాలనుకుంటాడు. ఎఫ్బీ ప్రొఫైల్‌ పిక్‌ని జూమ్‌ చేస్తే ఆ ఫొటో వెనకాల మీరట్‌ అని కనిపిస్తుంది. మీరట్‌ వెళ్తాడు. ఆ అమ్మాయి తండ్రి హెడ్మాస్టర్‌. కూతురి మీద కోపంతో ‘‘ఆమె గురించి మాకేమీ తెలియదు.. దయచేసి వెళ్లిపోండి’’ అంటూ వీళ్ల మొహమ్మీదే తలుపేస్తాడు. ఆ అమ్మాయి తమ్ముడు చాటుగా వాళ్లక్క ఫోన్‌నంబర్‌ ఇస్తాడు.  ఢిల్లీ తిరిగొచ్చి ఆ నంబర్‌కి ఫోన్‌ చేస్తాడు. కలుస్తాడు. విషయం చెప్తాడు. తన ఫోటోని వాడుకుంటున్నందుకు పోలీస్‌ కంప్లయింట్‌ ఇస్తానని బెదిరిస్తుంది తార. అలా వాడుకోవాల్సిన గత్యంతరాన్ని వివరించి, ఎలాగైనా సరే  కబీర్‌తో స్నేహం, ప్రేమ నటించి మళ్లీ అతను తన ఇంటికి వచ్చేలా చేయమని ఆ అమ్మాయిని రిక్వెస్ట్‌ చేస్తాడు రాజ్‌ మాథుర్‌.

చీట్‌ చేయలేనంటుంది. డబ్బు తీసి ముందు పెడ్తాడు రాజ్‌మాథుర్‌. అప్పుల్లో కూరుకుపోయిన ఆ అమ్మాయికి అదొక మంచి అవకాశంగా తోస్తుంది. ఆ  టాస్క్‌కి ఓకే అంటుంది. కబీర్‌తో స్నేహం చేస్తుంది. కబీర్‌ ఆ అమ్మాయితో ప్రేమలో పడ్తాడు. అతను చూపే కన్‌సర్న్‌కి ఆమే అతణ్ణి ప్రేమిస్తూంటుంది. ఆ క్రమంలోనే తన గతం గురించి షేర్‌ చేసుకుంటుంది కబీర్‌తో. మీరట్‌లో ఒక అబ్బాయిని ప్రేమించానని, ప్రెగ్నెంట్‌ కూడా అయ్యానని, వాడు మొహం చాటేశాడని, అబార్షన్‌ చేయించుకున్నానని, పరువు నెపంతో తల్లిదండ్రులు ఇంటికిరానివ్వలేదని..  ఢిల్లీకి వచ్చి  బ్యుటీషియన్‌గా ఉద్యోగం చేసుకుంటున్నానని చెప్తుంది. దాంతో ఆ అమ్మాయంటే మరింత ప్రేమకలుగుతుంది  కబీర్‌కు. 

డ్రామా ఆపేయ్‌..
తార నిజంగానే తన కొడుకుతో ప్రేమలో పడిందని గ్రహించిన రాజ్‌మాథుర్‌ ఆమెను పిలిచి ఆ డ్రామా ఆపేయ్‌మంటాడు. ప్రేమ నిజమని.. డ్రామా కాదని చెప్తుంది తార తడి కళ్లతో. ‘‘సరే, ఆపడానికి ఎంత తీసుకుంటావ్‌?’’ అంటూ మళ్లీ డబ్బు తీస్తాడు రాజ్‌మాథుర్‌. ఆ చర్యతో హర్ట్‌ అయిన తార కబీర్‌ను దూరం పెడ్తూ్తంటుంది. దానికి కొనసాగింపుగా తారగా చాట్‌ చేస్తున్న రాజ్‌మాథుర్‌ కబీర్‌ను బ్లాక్‌ చేస్తాడు. తార ప్రవర్తన అర్థంకాక తల్లడిల్లిపోతాడు కబీర్‌. తండ్రితో సహా అందరూ తనను మోసం చేస్తున్నారని బాధపడ్తూంటాడు. తండ్రికి మరింత దూరమవుతాడు. కొడుకును తన దరికి రప్పించుకోవడానికి హార్ట్‌ ఎటాక్‌ డ్రామా ఆడ్తాడు రాజ్‌మాథుర్‌. ఆ సమయంలోనే రాజ్‌మాథుర్‌ తనకు ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించడానికి వస్తుంది తార. ఆ సంగతి  తెలిసీ... కూపీ లాగుతాడు కబీర్‌. తార పేరుతో తండ్రి ఆడిన నాటకమే కాదు హార్ట్‌ఎటాక్‌ కూడా డ్రామా  బయటపడుతుంది.

తార అసలు పేరు సెహెర్‌ అనీ తేలుతుంది. ఇన్ని అబద్ధాలా? తట్టుకోలేను అని తండ్రిని చీదరించుకుని మళ్లీ వెళ్లిపోతాడు కబీర్‌. ఆ గండం గట్టెక్కించేది తార ఉరఫ్‌ సెహెర్‌ అని, ఆమె మాటే కొడుకు వింటాడనీ ఆమె దగ్గరకు వెళ్లి బతిమాలి, ఒప్పించి కొడుకును వెదికే పనిలో పడ్తాడు రాజ్‌మాథుర్‌ అండ్‌ బృందం.ఎట్టకేలకు ఢిల్లీలోని ద్వారకా మెట్రోస్టేషన్‌లో కొడుకు కనిపిస్తాడు. అప్పటిదే ఆ పైన సీన్‌. కొడుకు అపార్థం తొలగిపోతుంది. తండ్రితో కలుస్తాడు. సెహెర్‌ మనసును రాజ్‌మాథుర్‌ అర్థం చేసుకుంటాడు. కొడుకుతో జత కలుపుతాడు. సెహెర్‌ను ఆమె తండ్రీ క్షమించి అక్కున చేర్చుకుంటాడు. ఇదీ లీనా యాదవ్‌ దర్వకత్వం వహించిన రాజ్మాచావల్‌ మూవీ. 
– సరస్వతి రమ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top