జానీ... అబద్ధమే చెప్పాడు!

Questions from society - Sakshi

చెప్పే మాటకి, చేసే పనికి మధ్య వైరుధ్యం కనిపిస్తే కృతి అడిగినటువంటి ప్రశ్నలు సమాజం నుంచి వస్తాయి. తేడా అంతా చిన్నారి కృతి అడిగినట్లు సమాజం ప్రశ్నలు మాటల్లో ఉండవు. ఆ మనిషిని విశ్వసించకపోవడం అనేది చూపుల్లో కనిపిస్తుంది. ‘‘నాన్నా! రైమ్స్‌ బుక్‌... మామయ్య తెచ్చాడు’’ చూపించింది కృతి. ‘‘రైమ్స్‌ నేర్చుకుందామా’’ అంటూ బుక్‌ చేతిలోకి తీసుకుని కూతుర్ని ఒళ్లో కూర్చోబెట్టు కున్నాడు కృతి నాన్న. ‘‘జానీ జానీ... ఎస్‌ పపా, ఈటింగ్‌ షుగర్‌? నో పపా, టెల్లింగ్‌ లైస్‌? నో పపా, ఓపెన్‌ యువర్‌ మౌత్‌? హహ్హహ్హ...’’ నాన్న చెప్పినట్లు పలుకుతోంది కానీ... కృతి చూపంతా జానీ వెనుక దాచేసిన చక్కెర బాటిల్, నోట్లోంచి కారుతున్న చక్కెర మీదనే ఉంది.

‘‘జానీ చేతిలో షుగర్‌ బాటిల్‌ నాన్నా, నోట్లో కూడా చక్కెర ఉంది’’ చూపించింది. ‘‘నిజమే బంగారం’’ కాదనడానికి వీల్లేని పరిస్థితి. ‘‘చక్కెర తింటూ తినట్లేదని అబద్ధం చెప్పాడు, అబద్ధాలు చెబుతున్నావా అని అడిగితే కాదని మళ్లీ అబద్ధమే చెప్పాడు. జానీ రెండు అబద్ధాలు చెప్పాడు’’ వేళ్లు చూపించింది కృతి. ఆన్సర్‌ దొరకదని తెలిసినా క్షణకాలం కృతిని తప్పించుకుందామని పుస్తకంలో ముఖం దాచు కున్నాడు నాన్న. రైమ్స్‌ బుక్‌లో నక్షత్రాలు గిర్రున తిరుగుతున్నాయి. జానీ అబద్ధం చెప్పాడని చెబితే ఎందుకు చెప్పాడని మళ్లీ ప్రశ్న వస్తుంది, అది తప్పు కదా అని అనుబంధ ప్రశ్న, ఈ చైన్‌ ఈ రోజుకి తెగదు.

‘‘నాకు ఆఫీస్‌కి టైమయింది కన్నా’’ అంటూ ఒడిలో నుంచి కృతిని దించేశాడు నాన్న. చిన్నప్పుడు తార్కికత చాలా చురుగ్గా ఉంటుంది. వయసుతోపాటు లాజిక్‌ సెన్స్‌ను కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ పెద్దవాళ్లమవుతాం. ఇక మిగిలే సెన్స్‌ అంతా ‘ఒకరికంటే మనం వెనుకపడకూడదు’... అనేదొక్కటే. రేపటి రోజున మనల్ని మనం మనిషిగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నించే సహనం ఎప్పుడు ఎక్కడ జారిపోయిందో గుర్తుండదు. ఇప్పుడు తెలిసిందల్లా రేపటిలోకి వెళ్లడానికి అడ్డుగా ఉన్న నేటిని దాటేయడమే. నేటిని దాటడానికి చెప్పిన అబద్ధం మర్నాడు నిలదీస్తుంది. దానికి సమాధానం చెప్పడం కృతిని మాయ చేసినంత సులభం కాకపోవచ్చు. నిన్నటి రోజున చెప్పిన అబద్ధం నేడు నిలదీస్తూనే ఉంటుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top