రంగం సిద్ధమైంది

Question And Answer About Army Women Commission - Sakshi

ప్రశ్న- జవాబు

‘రోడ్‌ మ్యాప్‌’ అంటే ఏమిటి? భారత సైన్యంలోని మహిళా ఆర్మీ అధికారుల్ని ‘పర్మినెంట్‌ కమిషన్‌’లోకి తీసుకోడానికి రోడ్‌ మ్యాప్‌ రెడీ అయిందని గురువారం ఆర్మీ చీఫ్‌ నరవణె అన్నారు కదా.
రోడ్‌ మ్యాప్‌ అంటే ఒక ప్రణాళిక. ఒక పనికి విధి విధానాలు ఏర్పాటు చేసుకోవడం. ఆర్మీలోని ‘పర్మినెంట్‌ కమిషన్‌’ (పి.సి) లోకి ఆర్మీలోని ‘షార్ట్‌–సర్వీస్‌ కమిషన్‌’(ఎస్‌.ఎస్‌.సి.)లో ఉన్న మహిళా ఆర్మీ అధికారులను తీసుకోవాలని గత సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ పనికి రోడ్‌ మ్యాప్‌ తయారైంది.

తక్షణం ఎవరికి ప్రయోజం?
సుప్రీంకోర్టు ఇచ్చిన గడుపు మేరకు మూడు నెలల్లో.. ఎస్‌.ఎస్‌.సి.లో ఏ విభాగంలోనైనా పదేళ్ల సర్వీసు పూర్తి చేసిన మహిళా ఆర్మీ అధికారులందరికీ ప్రయోజనమే. పి.సి.లోకి వారికి పదోన్నతి లభిస్తుంది.

ఎస్‌.ఎస్‌.సి.లో పదేళ్లు పూర్తయిన వారంతా కచ్చితంగా పి.సి.లో చేరాల్సిందేనా?
కచ్చితంగా ఏం లేదు. ఇష్టం ఉన్నవారు చేరవచ్చు. ఇష్టం లేనివాళ్లు పదేళ్ల సర్వీసు తర్వాత మరో నాలుగేళ్లు ఎస్‌.ఎస్‌.సి.లోనే ఉండొచ్చు. ఆ తర్వాత వారికి ఉద్యోగ విరమణే.

రోడ్‌మ్యాప్‌ తయారైంది. తర్వాతేమిటి?
ప్రస్తుతం ఆర్మీలో 1653 మంది మహిళా ఆర్మీ అధికారులు ఉన్నారు. వారిలో పదేళ్ల సర్వీసు పూర్తయిన వారు 600 మంది ఉన్నారు. ఇక ఇప్పుడు వీళ్లందరికీ లెటర్‌లు పంపుతారు. పర్మినెంట్‌ కమిషన్‌లోకి వెళ్లడం సమ్మతమేనా అని. సమ్మతం అయినవారు 60 ఏళ్ల వయసు వచ్చేవరకు పి.సి. అధికారిగా ఉండొచ్చు. ఆర్మీలోని వివిధ విభాగాలలో (పోరాట విధులు సహా) అత్యున్నత హోదాలకు చేరుకోవచ్చు. ఇప్పటి వరకు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఉన్న పురుషులకు మాత్రమే పర్మినెంట్‌ కమిషన్‌లోకి వెళ్లేందుకు వీలుండేది.

భారత సైన్యంలో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు?
అన్ని విభాగాల్లోని స్త్రీ పురుషులందరూ కలిపి 13 లక్షల మంది ఉన్నారు. వారిలో 41 వేల మంది పురుష ఆఫీసర్‌లు. (మహిళా అధికారుల సంఖ్య.. పై సమాధానంలో ఉంది చూడండి).

గత ఏడాది రిపబ్లిక్‌ పరేడ్‌లో తొలిసారి పురుష సైనిక దళానికి సారథ్యం వహించిన ఆర్మీ అధికారి లెఫ్ట్‌నెంట్‌ భావనా కస్తూరి (27)  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top