బ్యాక్టీరియాతో ఒత్తిడికి ఔషధాలు..

Psilocybin Mushrooms Helps In Stress Relief - Sakshi

పుట్టగొడుగుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్నది మనకు తెలిసిన విషయమే. కొన్ని రకాల పుట్టగొడుగుల్లో ఉండే సైలోసైబిన్‌ అనే రసాయనం ఒత్తిడి చికిత్సకూ ఉపయోగపడుతుంది. అయితే వీటి మోతాదు చాలా తక్కువ. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయడం అసాధ్యం. ఈ నేపథ్యంలో మియామీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ బ్యాక్టీరియా సాయంతో సైలోసైబిన్‌ రసాయనాన్ని తయారు చేసే పద్ధతిని ఆవిష్కరించారు. బ్యాక్టీరియా జీవక్రియల్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఇది సాధ్యమైంది.

పుట్టగొడుగుల్లో సైలోసైబిన్‌ రసాయనాన్ని ఉత్పత్తి చేసే జన్యువులను ఇకోలీ బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టినప్పుడు అవి గ్రాముల స్థాయిలో సైలోసైబిన్‌ ఉత్పత్తి చేశాయి. ఇది ఒకరకంగా బీర్‌ తయారు చేయడం లాంటిదేనని.. ధాన్యం గింజలతో తయారైన ద్రావణాన్ని బ్యాక్టీరియా సాయంతో పులియబెట్టినట్లు ఉంటుందని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. తగిన పరిస్థితుల్లో ప్రతి లీటర్‌ ద్రావణం ద్వారా 1.16 గ్రాముల సైలోసైబిన్‌ ఉత్పత్తి అయినట్లు చెప్పారు. తొలుత ఈ పద్ధతిలో మిల్లిగ్రాముల స్థాయిలో మాత్రమే సైలోసైబిన్‌ ఉత్పత్తి అయ్యేదని, ఉష్ణోగ్రత వంటి అనేక అంశాల్లో మార్పులు, చేర్పులు చేయడం ద్వారా ఉత్పత్తిని 500 రెట్లు ఎక్కువ చేయగలిగామని వివరించారు. పరిశోధన వివరాలు మెటబాలిక్‌ ఇంజనీరింగ్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top