వ్యాక్సిన్‌ వచ్చేవరకు ప్లాస్మాథెరపీయే మంచి ప్రత్యామ్నాయం

Plasma Therapy Better For Still Coming Vaccine Doctor Vasanthi - Sakshi

అమెరికా సైంటిస్ట్‌ డాక్టర్‌ వాసంతి అవధానుల

‘‘కరోనా వ్యాధి ప్రపంచాన్ని కబళిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ వ్యాధికి ఇప్పటివరకూ మందులేకపోవడంతో... వ్యాక్సిన్‌ వచ్చేవరకు ప్లాస్మాథెరపీ చికిత్స, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ లాంటి మందులు వాడటం తప్పనిసరి’’ అంటున్నారు హూస్టన్‌లోని బెలోర్‌ కాలేజీ ఆఫ్‌ మెడిసిన్‌లో వైరస్‌ వ్యాధులను నిరోధించే రంగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్‌ వాసంతి అవధానుల.

హూస్టన్‌లో ఉన్న బేలోర్‌ కాలేజీ ఆఫ్‌ మెడిసిన్‌కు మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. ఫెడరల్‌ గవర్నమెంట్‌ ప్రధాన సంస్థ అయిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ)తో అనుబంధం కూడా ఉంది. ఆ సంస్థకు చెందిన మెడికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌లో వైరస్‌ వ్యాధులను నిరోధించే విషయంలోడాక్టర్‌ వాసంతి అవధానుల 2007 నుంచి శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వైజాగ్‌కు చెందిన తెలుగు మహిళ అయిన వాసంతి... ఆంధ్రయూనివర్సిటీలో ఎంఎస్సీ చదివి, అమెరికా వచ్చి యూనివర్సిటీ ఆఫ్‌ టెన్నెస్సీలో ఎంఎస్‌... ఆ తర్వాత వైరల్‌ డిసీజెస్‌లో పీహెచ్‌డీ చేశారు.

అమెరికాలో కరోనా వైరస్‌ విపరీతంగా ప్రబలడంతో కరోనాకు మందు కనిపెట్టే ప్రయత్నంతో పాటు, దానికి సరైన చికిత్స విషయంలోనూ ఆమె  అక్కడి ఇతర శాస్త్రవేత్తలతో పాటు కలిసి కృషి చేస్తున్నారు. దీనికితోడు అన్ని రకాల మెడికల్‌ రీసెర్చ్, ముఖ్యంగా వైరల్‌ డిసీజెస్‌ మీద కూడా రీసెర్చ్‌ కొనసాగిస్తున్నారు.

కరోనా సంక్షోభ సమయంలో హూస్టన్‌లో ఉన్న టెక్సస్‌ మెడికల్‌ సెంటర్‌తో కలిసి పనిచేయడం వల్ల టెక్సస్‌ మెడికల్‌ సెంటర్‌లో ఆధ్వర్యంలో దాదాపు 15 హాస్పిటల్‌స ఉండటం వల్ల కరోనా బాధిత రోగుల చికిత్సలో పరోక్షంగా డాక్టర్‌ వాసంతి కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి దీనికి సరైన చికిత్సలేని నేపథ్యంలో ‘ప్లాస్మా థెరపీ’ని ప్రయోగించినప్పుడు కేసుల్లో సత్ఫలితాలు వచ్చినందున... వ్యాక్సిన్‌ వచ్చేవరకు ఈ ప్లాస్మాథెరపీ చికిత్స ప్రాణాలు కాపాడేందుకు దోహదం చేస్తుందని డాక్టర్‌ వాసంతి పేర్కొంటున్నారు.

ఒక వ్యక్తికి వైరస్‌ సోకినప్పుడు... ఆ వైరస్‌ ద్వారా వచ్చిన వ్యాధిని ఎదుర్కొనేందుకు యాంటీసెల్స్‌/యాంటీబాడీస్‌ అనే రక్షణ కణాలు పుడతాయి. అవి వైరస్‌ను ఎదుర్కొని దాన్ని నిరోధిస్తాయి. ఆ వ్యక్తికి జబ్బు తగ్గిపోయిన తర్వాత కూడా అతడి రక్తంలో యాంటీసెల్స్‌ అలాగే ఉండిపోతాయి. అప్పుడు ఆ వ్యక్తి రక్తంలోంచి... వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధకశక్తి ఉన్న సెల్స్‌ను తీసుకుని, పరిస్థితి విషమంగా ఉన్న వేరే రోగికి ఇవ్వడం ద్వారా చికిత్స పొందుతున్న రోగిలో రోగనిరోధక వ్యవస్థను పెంపొందేలా చేయడమే ‘ప్లాస్మాథెరపీ’ చికిత్స. ఈ చికిత్స వల్ల పరిస్థితి చేయిదాటిపోయిన రోగి కూడా కోలుకునే అవకాశం ఉంటుంది.

‘‘కరోనా రోగుల విషయంలో ప్లాస్మాథెరపీని మార్చి మొదటివారంలోనే మేము ప్రారంభించాం. ఆ ప్రక్రియ సత్ఫలితాలు ఇస్తోందని అతితక్కువ సమయంలోనే తెలుసుకున్నాం. దాంతో ప్లాస్మా థెరపీని మరింత ఎక్కువ మందికి ఇవ్వడం మొదలుపెట్టాం. న్యూయార్క్‌లో సైతం ఈ ప్లాస్మాథెరపీ చికిత్సను మొదలుపెట్టారు. ఈ థెరపీకి సుమారుగా 3 నుంచి 4 యూనిట్ల రక్తం సరిపోతుంది. అయితే కరోనా వ్యాధికి సంబంధించి ఒక్కొక్క వ్యక్తి ఒక్కోలా ప్రతిస్పందిస్తున్నారు. కొందరికి వెంటనే నయమైపోతుంటే... మరికొందరికి వ్యాధి అదుపులోకి రావడానికి 2 – 3 వారాలు పడుతోంది. అయితే ఒక రోగికి కరోనా వచ్చి తగ్గాక 3 –4 వారాల వరకు వారి దేహంలో ఈ రోగనిరోధకశక్తి ఉండే కణాలు ఉంటాయి, ఆ సమయంలోనే వారు ప్లాస్మాథెరపీకి డోనర్‌గా రావాల్సి ఉంటుంది‘‘ అని డాక్టర్‌ వాసంతి తెలిపారు.

‘‘కరోనాకి హెచ్‌ఐవీ మందులు కూడా వాడుతున్నారనీ, అలాగే మలేరియాకి వాడే హైడ్రోక్లోరోక్విన్‌ మందులును కూడా ఉపయోగిస్తున్నారనీ వార్తలు వస్తున్నాయి. అంటే ఒక సమస్యను కట్టడి చేసేందుకు వాడే మందులే, దీనికి కూడా వాడుతున్నారు. అయితే ఈ చికిత్స ప్రక్రియలన్నీ కరెక్టనీ లేదా కాదని చెప్పడం ఇప్పుడే సాధ్యం కాదు. మనకు అందుబాటులో ఉన్న మార్గాలన్నింటినీ ప్రయోగించి చూస్తున్నామన్నమాట. కరోనాను నిర్దిష్టంగా వ్యాక్సిన్‌ కనిపెట్టేవరకు ఇలా అన్ని మార్గాలను అనుసరించి చూడటంలో తప్పులేదు. అయితే అర్హులైన డాక్టర్‌ సలహా లేకుండా ఎవరికి వారు ఈ మందులను తీసుకోవడం మాత్రం చాలా ప్రమాదం.– డాక్టర్‌ వాసంతి అవధానుల

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top