పరి పరిశోధన

Periodical research - Sakshi

ఉక్కులాంటి కలప
ఉక్కులాంటి దృఢమైన కలప త్వరలోనే భవన నిర్మాణరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తుపాకి తూటాలను సైతం తట్టుకోగల అలాంటి ‘సూపర్‌వుడ్‌’ను అమెరికాలోని మేరీలాండ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా రూపొందించారు. మామూలు కలపను నుజ్జు నుజ్జు చేసి, నీటిలో కరిగే ద్రావణంలో కలిపి ముద్ద చేసి అత్యధిక సాంద్రతతో రూపొందించిన ఈ ‘సూపర్‌వుడ్‌’ను రకరకాలుగా పరీక్షించి దీని దారుఢ్యాన్ని నిగ్గుతేల్చారు.

దారుఢ్యంలో ఇది ఉక్కును సరిపోలినా, సాధారణ కలప కంటే తేలికగానే ఉంటుందని మేరీలాండ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నుజ్జు చేసిన కలపలో సోడియం హైడ్రాక్సైడ్, సోడియం సల్ఫైట్‌ రసాయనాలు కలిపిన నీటితో ముద్దగా చేసి, ఆ ముద్దను రెండు లోహపు పలకల మధ్య భూమి ఉపరితల వాతావరణం కంటే 50 రెట్లు ఎక్కువ పీడనంతో అదిమి పట్టి, వంద డిగ్రీల ఉష్ణోగ్రతతో వేడిచేయడం ద్వారా ఈ ‘సూపర్‌వుడ్‌’ను రూపొందించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఉక్కునైనా ఛేదించగల వాటర్‌గన్‌
ఉక్కునైనా ఛేదించగల వాటర్‌గన్‌ అందుబాటులోకి వచ్చింది. దీనిని షూట్‌ చేస్తే, ఇందులోంచి పెనువేగంతో దూసుకొచ్చే నీరు.. ఉక్కు, కాంక్రీట్, ఇటుకలు, చివరకు బులెట్‌ప్రూఫ్‌ గ్లాస్‌ను కూడా ఛేదించగలదు. ఏదైనా గోడపై దీనిని గురిచూసి ప్రయోగిస్తే, మూడంగుళాల రంధ్రం ఏర్పడి, అందులోంచి నీరు లోపలకు దూసుకుపోతుంది. అగ్నిమాపక పరికరాలను తయారు చేసే‘పైరోలాన్స్‌’ అనే కంపెనీకి చెందిన నిపుణులు ఈ వాటర్‌గన్‌ను అల్ట్రా హైప్రెషర్‌ పరిజ్ఞానంతో తయారు చేశారు.

ఈ ‘పైరోలాన్స్‌’ వాటర్‌గన్స్‌ను ప్రస్తుతం అమెరికన్‌ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ బలగాలు ఉపయోగిస్తున్నాయి. కొద్ది విమానాశ్రయాల్లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటి సైజును బట్టి ఒక్కొక్కటి 15 వేల డాలర్ల నుంచి 80 వేల డాలర్ల వరకు ఇవి దొరుకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్నిమాపక దళాలు వీటిని ఉపయోగించేటట్లయితే చాలా వరకు అగ్నిప్రమాదాలను నిరోధించవచ్చని ‘పైరోలాన్స్‌’ కంపెనీకి చెందిన ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండులు, షాపింగ్‌మాల్స్, సినిమా థియేటర్స్‌ వంటి జనసమ్మర్దం గల ప్రదేశాల్లో వీటిని అందుబాటులో ఉంచితే, అగ్నిప్రమాదాలను తేలికగా అరికట్టడం సాధ్యమవుతుందని చెబుతున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top