ఉత్తరానికి కొత్త రక్తం

Paromita Bardoloi By Her Own Admission Loves To Write Letters - Sakshi

పెన్‌ బాక్స్‌

ఉత్తరం అనే పదమే డిక్షనరీలోంచి మాయమైపోతుంటే ఫేస్‌బుక్‌లో మాత్రం ఓ పేజీ కనిపిస్తోంది.. ‘లెటర్స్‌ ఫ్రమ్‌ ఎ స్ట్రేంజర్, ఇండియా’’ అనే పేరుతో! ఆ పేజీని మొదలుపెట్టిన మహిళ పారోమితా బార్దోలై. అస్సాం నివాసి. తన పన్నెండో ఏట నుంచి ఉత్తరాలు రాసే అభిరుచిని అలవాటుగా చేసుకున్నారు ఆవిడ! తల్లిదండ్రులతో ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా అక్కడ పరిచయమైన తన ఈడు పిల్లల దగ్గర చిరునామాలు ఇచ్చిపుచ్చుకుని .. స్వంత ఊరు తిరిగొచ్చాక వాళ్లకు ఉత్తరాలు రాసేవారట. సాంకేతిక విప్లవం తర్వాత ‘హేయ్‌.. వాట్సప్‌..’ అంటూ ఫోన్‌ యాప్‌లే పొద్దుకు పదిసార్లు పలకరిస్తూండడంతో ఉత్తరాల ఊసే లేకుండా పోయింది కదా. అందుకని ఉత్తరాలకు మళ్లీ ఊపిరి పోయడానికి డిజిటల్‌ మీడియానే ప్లాట్‌ఫామ్‌ చేసుకుంటే.. అని ఆలోచించారు పారోమితా.

వెంటనే ఫేస్‌బుక్‌లో పేజీ తెరిచారు. ఎవరైనా తమకు ఉత్తరాలు రాస్తే బాగుండు అనుకునే వాళ్ల నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను ఆహ్వానించారు. వెంటనే ప్రపంచ వ్యాప్తంగా వినతులు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఉత్తరాలు రాస్తాం.. ఉత్తరాలు అందుకుంటాం అని. ఆ స్నేహ విన్నపాలను పంపిన వాళ్లను స్నేహితుల జాబితాలోకి మార్చేసుకున్నారు పారోమితా. తీర్పులు, సూక్తులు వల్లించకుండా.. జీవితానుభూతులు, నేర్చుకున్న విషయాలు, మరిచిపోలేని జ్ఞాపకాలు.. ఇలా మంచి భావనలను పంచి కొత్త ఉత్సాహం కలిగేలా మీరు రాసే ఉత్తరాలు ఉండాలి అనే షరతు కూడా పెట్టారు. అలాగే ‘లెటర్స్‌ ఫ్రమ్‌ స్ట్రేంజర్, ఇండియా’ పేజీలో ఫ్రెండ్స్‌ అయిన వాళ్లంతా పద్దెనిమిదేళ్లు నిండిన వారై ఉండాలి, విధిగా తమ చిరునామాలు ఆధారాలతో సహా పొందుపర్చాలన్నది నిబంధన.

జాబు అందుకున్నాక జవాబు రాయడం, రాయకపోవడం వాళ్ల ఇష్టం. ఉత్తరం కోసం ఎదురుచూడ్డం, అందుకున్నాక దాన్ని చదవడం.. వంటి నిజమైన అనుభూతి కోసం ఉత్తరాలు రాయించుకునే వాళ్లే ఎక్కువని పారోమితా చెబుతున్నారు.  ఇప్పటివరకు ఆమె తన స్వహస్తాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తర ప్రియులకు దాదాపు వంద జాబులు రాసి పోస్ట్‌ చేశారు. ఈ ఉత్తరాల ప్రయాణంలో ప్రతి నెలా 30 మంది చేరుతున్నారట. ‘‘త్వరలోనే ఈ వంద ఉత్తరాలతో ఓ పుస్తకాన్నీ వేయాలనుకుంటున్నాను’’ అని చెబుతున్నారు పారోమిత.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top