హాయ్‌.. చిన్నారీ

Parents Struggling With Children due To Lockdown In Hyderabad - Sakshi

లాక్‌డౌన్‌లో కాలూచెయ్యీ ఆడదు. ఆటిజం పిల్లలున్న తల్లిదండ్రులకు మాత్రం ఆ తేడా తెలియదు! ఆ చిన్నారుల శిక్షణ, సంరక్షణల కోసం వాళ్లెప్పుడూ.. లాక్‌డౌన్‌లో ఉన్నట్లే ఉంటారు. శిక్షణ కొనసాగింపు మాత్రమే ఇప్పుడు వారి సమస్య. ఆ సమస్యకు హారిక మంచి పరిష్కారం కనిపెట్టారు.

ఆటిజం ఉన్న పిల్లలను ప్రత్యేక పాఠశాలలకు పంపుతూ వస్తున్న తల్లిదండ్రులకు ఈ ‘లాక్‌డౌన్‌’ సమయంలో ఆ పిల్లల్ని చూసుకోవడం పెద్ద సవాల్‌ అవుతోంది. అలాంటి తల్లిదండ్రులకు, వారి పిల్లలకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నారు ఆటిజం చికిత్సా నిపుణురాలు పట్లోళ్ల హారికారెడ్డి. ‘స్పెషల్లీ ఏబుల్డ్‌ చిల్డ్రన్‌’ కోసం హైదరాబాద్‌ అత్తాపూర్‌లో ఉన్న యాదా ఎబిఎ సెంటర్‌లో నిపుణురాలిగా ఉన్న హారిక సైకాలజీలో ఎమ్మెస్సీ చేశారు. అమెరికాలోని ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలోని సైకాలజీ విభాగంలో ఆటిజం ముఖ్యాంశంగా రెండేళ్ల కోర్సు చేసి వచ్చాక గత ఐదేళ్లుగా ఆటిజం ఉన్న చిన్నారులను సాధారణ స్థితికి తెచ్చేందుకు వారికి, వారి తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు మూతపడినా ఆటిజం పిల్లల మానసిక స్థితిని మెరుగు పరిచేందుకు, అదే సమయంలో తల్లిదండ్రులకు ఆలంబనగా నిలిచేందుకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన సాక్షితో ముచ్చటించారు.

పిల్లలకు.. పెద్దలకూ
‘‘ఆటిజం ఉన్న పిల్లల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండవు.  వాళ్లంతట వాళ్లు ఆడుకోలేరు. తినలేరు. పిలిస్తే పలకరు. ఇలాంటి పిల్లలకు వారానికి నలభై గంటల చొప్పున రెండు సంవత్సరాలు అంతరాయం లేకుండా శిక్షణ ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఓ వైపు ఇలా పిల్లలకు శిక్షణ ఇస్తూనే మరోవైపు ఆ పిల్లలతో ఎలా మెలగాలో పెద్దలకీ శిక్షణ ఇస్తుంటాం. అయితే ఆ శిక్షణ.. పూర్తయ్యేవరకు క్రమం తప్పకూడదు. అందుకే ఈ లాక్‌డౌన్‌లోనూ వారందరికీ ఆన్‌లైన్‌లో ప్రతిరోజూ కౌన్సెలింగ్‌ ఇస్తున్నాను. ఈ ఖాళీ టైమ్‌లో పిల్లలను ఎలా ఎంగేజ్‌ చేయాలి, వారిచేత ఏమేం యాక్టివిటీస్‌ చేయించాలి, వాళ్ల ప్రవర్తనలో మార్పులు వస్తే ఎలా హ్యాండిల్‌ చేయాలి.. ఇలాంటివన్నీ ఆన్‌లైన్‌లోనే సూచిస్తున్నాను.

‘వెళ్లి కూర్చో’ అనకూడదు
ఇంట్లో అయితే రోజులో ఇన్ని గంటలు చెప్పాలి అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఉదాహరణకు.. తల్లి కిచెన్‌లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ టైమ్‌లో అమ్మాయి / అబ్బాయి వస్తే ఓ దగ్గర కూర్చో అని చెప్పకూడదు. కూరగాయలన్నీ కలిపి వాటిని వేటికవి విడి విడిగా చేయమనాలి. కూర్చోబెట్టి కొద్దిసేపు ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ నేర్పించవచ్చు. ఏ పనులు వీలైతే అందులో నిమగ్నం అయ్యేలా చెయ్యాలి. తీరిక సమయాలలో మన చిన్నప్పుడు ఆడిన అష్టాచెమ్మా, మ్యూజికల్‌ చెయిర్స్, డ్యాన్స్‌.. ఇలా ఫన్‌గా ఉన్నవన్నీ చేయిస్తుంటే పిల్లలకు ఉత్సాహం కలుగుతుంది. ఇలాంటి టైమ్‌లో ప్రత్యక్ష శిక్షణలో ఉన్నంతగా చేయలేరు. కానీ, కొంత రిజల్ట్‌ అయితే తప్పకుండా ఉంటుంది.

తండ్రికి కనెక్ట్‌ అవుతారు
మగపిల్లలు తండ్రి చెబితే త్వరగా కనెక్ట్‌ అవుతారు. తండ్రి నేర్పిస్తే త్వరగా నేర్చుకుంటారు. స్నానం చేయడం ఎలాగో చెప్పడం, బట్టలు వేసుకోవడం, పెన్ను పట్టుకోవడం.. రాయడం.. ఇలా ఏవైనా తండ్రి చెప్పవచ్చు. కాసేపు పిల్లలతో ఆడుకున్నా వాళ్లు బాగా రిలీఫ్‌ అవుతారు. తోబుట్టువులు ఇంట్లో ఉంటే వాళ్లతో కలిసి ఆడుకోవడం, కలిసి చేసే పనుల వల్ల నలుగురితో మసలే నైపుణ్యాలు కూడా పెరుగుతాయి’’ అని తెలిపారు హారిక.

‘దిద్ది’ పంపుతున్నా
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ తీసుకుంటున్న తల్లిదండ్రులలో కొందరు.. చెప్పినవి పాటిస్తూ తమ పిల్లలు నేర్చుకున్న విషయాలను వీడియోలు చేసి పంపిస్తున్నారు. ఆ వీడియోలు చూసి పిల్లల ప్రవర్తనలో లేదా పాటించే పద్ధతుల్లో ఎక్కడైనా లోపం ఉంటే వాటిని కరెక్ట్‌ చేస్తూ ఉంటాను. కొన్ని మెళుకువల్ని ఎలా పాటించాలో చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. వారి పిల్లలందరి గురించి నాకు ముందే కొంత తెలుసు కాబట్టి వారికి సంబంధించిన విషయాలను మరింత వివరంగా చెప్పగలుగుతాను. ఇప్పుడు అదే చేస్తున్నాను. – హారికారెడ్డి, ఆటిజం చికిత్సా నిపుణురాలు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top