రంగు తగ్గితేనేం... చురుకు తగ్గదు

Parenting tips - Sakshi

పేరెంటింగ్‌ టిప్స్‌

ఒకరి మేనిఛాయ ఉన్నట్లు మరొకరిది ఉండదు. అలాగే ఇంట్లో ఇద్దరు – ముగ్గురు పిల్లలుంటే అందరూ తెల్లగా ఉండకపోవచ్చు. ఇంట్లో అందరూ తెల్లగా ఉండి ఒకరు కాస్త రంగు తక్కువగా కాని నల్లగా కాని ఉంటే వారికి తెలియకుండానే న్యూనతకు గురయ్యే ప్రమాదం ఉంది. అది కూడా అమ్మాయిలైతే మరీ ఎక్కువ. ఇలాంటి పిల్లలున్న తల్లిదండ్రులకు పరిస్థితిని విచక్షణతో సమన్వయం చేసుకోవడం సున్నితమైన, కష్టమైన ఎక్సర్‌సైజ్‌. అలాంటి తల్లిదండ్రులకు కొన్ని జాగ్రత్తలు...

పిల్లల దగ్గర రంగు గురించిన ప్రస్తావన తీసుకు రాకూడదు. ఇంటికెవరైనా వచ్చినప్పుడు కాని, ఎక్కడికైనా వెళ్లినప్పుడు కాని తెల్లగా ఉన్న పిల్లలు కనిపిస్తే తమకు తెలియకుండానే ‘అబ్బ! తెల్లగా... ఎంత అందంగా ఉందా అమ్మాయి’’ అంటూ పొగడడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు పక్కనే ఉన్న తమ పిల్లల మనసు చివుక్కుమంటుందన్న సంగతి మర్చిపోతారు.
రంగు ముఖ్యం కాదని అందచందాలు ముఖ కవళికలను బట్టి ఉంటాయని పిల్లలకు తెలియచేయాలి. వీటన్నింటికంటే చదువు, సంస్కారం, అచీవ్‌మెంట్స్‌ ముఖ్యమని తెలియచెప్పాలి. బాహ్యసౌందర్యం కంటే అంతఃసౌందర్య ప్రాధాన్యతా తెలియజేయాలి.
బంధువులు, ఫ్రెండ్స్‌ కలిసినప్పుడు వాళ్లు అయ్యో మీ అమ్మాయా? ఇంత నల్లగా ఉందేం పాపం? అంటూ తమ ఆశ్చర్యాన్ని ధారాళంగా ప్రకటించేస్తుంటారు. పిల్లల ఎదురుగా అలా అనడం తప్పని వాళ్లను సంస్కరించడం కష్టమే కాని అదే సమయంలో మీరిచ్చే సమాధానం మాత్రం మీ అమ్మాయి మనసు నొచ్చుకోని విధంగా ఉండాలి. మీ సమాధానం ఘాటుగా ఉంటే బంధువులు నొచ్చుకుంటారని రాజీపడడం కంటే మీ అమ్మాయి ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా ఉండడమే ముఖ్యమని గుర్తించాలి.
పిల్లలు చదువుతోపాటు మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్‌ వంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌లో నిమగ్నమయ్యేటట్లు చూడా లి. వాళ్ల మనసు తాము సాధిస్తున్న అచీవ్‌మెంట్స్‌ మీదే కేంద్రీకృతమవుతుంది కాబట్టి అదే పనిగా రంగు గురించి బెంగ పడకుండా ఉంటారు. తమకంటూ ప్రత్యేకత సాధించుకోవడం ద్వారా తాము దేనిలోనూ తీసిపోమన్న ఆత్మవిశ్వాసం దృఢపడుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top