అమ్మా.. నీకు నచ్చినట్లే ఉండు

Our childhood grew with the knowledge that we learned from the mother - Sakshi

వైరల్‌ పొయెట్రీ

‘‘ఇక్కడ ఇంగ్లిష్‌లో మాట్లాడడానికి ప్రయత్నించకు. అయినా మా స్కూలుకొచ్చేటప్పుడు మంచి దుస్తులు వేసుకుని రావచ్చు కదా, మరీ ఇలా వచ్చావేంటి? నా ఫ్రెండ్స్‌ ముందు నాకు ఎంబరాసింగ్‌గా ఉంటుంది’’... ఇలా పిల్లలు నిర్దయగా, కర్కశంగా మాట్లాడినా సరే... గాయపడకుండా ఎవరైనా ఉన్నారంటే అది తల్లి మాత్రమే. గాయపడినా  క్షమించగలిగింది తల్లి మాత్రమే. ఆధునిక, నాగరిక పొరలన్నీ తల్లి మనసు ముందు దిగదుడుపే. అమ్మ ఎలా ఉంటే అలాగే ఉండాలి. ఆమెను అలాగే ఉండనివ్వాలి. ఆమె ఎలా ఉండాలనుకుంటే అలా ఉండనివ్వాలి. ఆమెకు ఎందులో సంతోషం ఉంటే ఆ సంతోషంలో ఆమెను జీవించనివ్వాలి. ఆమె నాగరకంగా ఉన్నా అనాగరకంగా ఉన్నా అమ్మే. మనకు ప్రపంచాన్ని తెలియచెప్పింది ఆమే. ఆమె నుంచి నేర్చుకున్న జ్ఞానంతోనే మన బాల్యం ఎదిగింది. ఇప్పుడు మనలో రెక్కలు విచ్చుకున్న విజ్ఞానం ఆమెలో తప్పులు వెతకడానికి కాదు. ఆమె తన పిల్లల తప్పుల్ని కూడా ఆనందంగా స్వీకరించింది, క్షమించింది.

ఆమె ఆమెగా జీవించే క్రమంలో ఆమెలో కనిపిస్తున్న తప్పులను పిల్లలు స్వీకరించాల్సిందే. అమ్మకు అండగా ఆమె పక్కన నిలవాల్సిందే... అలా నిలబడే విజ్ఞతను మనలో నింపింది కూడా ఆమె పెంపకమే..’’ అంటూ ఆశువుగా ఓ కవిత రాశారు అనామిక.అనామికది జైపూర్‌. మదర్స్‌డే రోజున (మే నెల 12వ తేదీ) ఆమె స్నేహితులు నిర్వహించిన సాహిత్య సదస్సుకు హాజరయ్యారు. తల్లి గురించి చిన్న కవితలు, కథలు చదివి వినిపించవలసిందిగా ఆ కార్యక్రమానికి వచ్చిన తల్లులందరినీ... కోరారు నిర్వహకులు. పది నిమిషాల్లో అందరూ కవితలు రాశారు. చదివారు.అనామిక రాసిన కవిత అక్కడికి వచ్చినవారందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో సంచలనాన్ని సృష్టించింది. యూ బ్యూబ్‌లో ఎనిమిది లక్షల మంది వీక్షించారు. ఫేస్‌బుక్‌లో వ్యూస్‌ నంబర్‌ అయితే ఏకంగా ఎనిమిది మిలియన్లను దాటి పోయింది. ఈ కవితను విన్న తల్లులు, తండ్రులు వాళ్ల పిల్లలకు షేర్‌ చేస్తున్నారు. పిల్లలు వాళ్ల పేరెంట్స్‌కు చూపిస్తున్నారు.

ఓ యువతి అయితే నేరుగా అనామిక దగ్గరకు వచ్చి ‘అమ్మను అమ్మలా ఉంచడానికి మీ కవిత నాకు ఎంతగానో ప్రోత్సాహం కలిగించింది’ అని చెప్పింది. అనామిక ఇలాంటి సంతోషకరమైన అనుభవాలను పంచుకుంటూ ‘‘నా గుండెల్లోంచి నేరుగా అక్షరాల రూపంలో బయటకు వచ్చిన భావం అది. విన్న వాళ్లందరినీ అంతే హృద్యంగా గుండెలోతుల్ని తాకుతుంది. ఎందుకంటే అమ్మ గురించిన భావన ఎవరినైనా కదిలించి తీరుతుంది’’ అన్నారు. పిల్లలకు దుఃఖం వస్తే భుజమిచ్చే ఆసరా అమ్మ. అలాంటి అమ్మ పట్ల పిల్లలు చూపించాల్సిన ప్రేమకు కూడా కొలతలు , కొలమానాలు ఉండకూడదు. తల్లి మీద ఓవర్‌ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉండకూడదు, ఆమె ట్రెండ్‌కు తగ్గట్టుగా మారాలని ఆశించి, ఎలా ఉండాలో నిర్దేశిస్తూ ఆమె మీద ఒత్తిడి తీసుకురాకూడదు’’ అన్నారు అనామిక.
– మంజీర

అనామిక కవిత
ఆమె తల్లి, ఆమెలో తప్పు ఎందుకుంటుంది?ఆమె నిన్ను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి శ్రమించింది.నీ బాక్సులో ఎప్పుడూ రుచికరమైన మంచి ఆహారాన్ని పెట్టింది. నీ దుస్తుల్ని శుభ్రంగా ఉతికి పెట్టింది. నిన్ను మరకలు లేకుండా సమాజానికి చూపించింది.ఆమె తల్లి, ఆమెలో తప్పు ఎందుకుంటుంది?ఆమె పని చేయడానికి బయటికెళ్తే వద్దని ఆపేస్తారు పిల్లలు.ఆమె ఇంట్లోనే ఉండి అందరికీ అన్నీఅమరుస్తుంటే ఆమెని వెక్కిరిస్తారు. నేనూ ఓ తల్లినే. తల్లిగా నేనూ తప్పు కాకూడదు.అమ్మా నిన్ను బాధించి ఉంటే నన్ను క్షమించు. ఒట్టు... ఇక ఎప్పుడూ నీ వెంటే ఉంటాను.అమ్మా! నువ్వెప్పుడూ తప్పు కాదు. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి.ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు.మా అనుమతి నీకు అక్కర్లేదు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top