పూలపాన్పు

order of the order, the lash was executed - Sakshi

చెట్టు నీడ

పాదుషా గారికి పూలపాన్పులో తప్ప నిద్రపట్టదు. అందుకోసం తన  శయన మందిరంలోని మంచాన్ని రోజూ పలు రకాల పూలతో అలంకరించేందుకు ఓ సేవకురాలిని నియమించుకున్నారు. అలా చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు పాదుషా గారు వేటకు వెళ్లి రావడం ఆలస్యమయ్యింది. సేవకురాలు రోజూ లాగే రాజుగారి మంచాన్ని పూలతో అలంకరించింది. ‘ఇన్నేళ్లుగా పాదుషా గారి మంచాన్ని పూలతో ముస్తాబు చేస్తున్నాను కదా, ఒక్కసారి ఈ పూలపాన్పుపై కాసేపు సేదతీరితే’ అనే తలంపు ఆమెకు కలిగింది. వెంటనే పూలపాన్పుపై కాసేపు మేను వాల్చింది. క్షణాల్లోనే గాఢనిద్రలోకి జారుకుంది. అంతలోనే పాదుషా గారు వేటనుంచి తన శయన మందిరానికి వచ్చారు. తన పూలపాన్పుపై పడుకుని ఉన్న సేవకురాలిని చూసి ‘నా పూల పాన్పుపైనే పడుకుంటావా!

ఎంత ధైర్యం’ అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తలారిని పిలిపించి ‘పాదుషా గారి మందిరం విలువేంటో ఇతర సేవకులకు తెలిసొచ్చేలా ఈమెను తల్లకిందులుగా వేలాడదీసి ప్రాణాలొదిలే వరకూ కొరడా దెబ్బలు కొట్టాలని’ ఆజ్ఞాపించారు. ఆజ్ఞ మేరకు కొరడా దెబ్బల శిక్ష అమలు చేశారు. కొరడా దెబ్బలకు ఆ సేవకురాలు పెడబొబ్బలు పెట్టసాగింది. అంతలోనే పకపకా నవ్వడం మొదలెట్టింది! దీన్ని గమనించిన పాదుషాగారు నీ ఏడుపుకు, అంతలోనే నీ నవ్వుకు కారణమేమిటని అడిగారు. దానికా సేవకురాలు ‘కొరడా దెబ్బల నొప్పి భరించలేక ఏడ్చాను. కాని, కేవలం కొన్ని నిమిషాలపాటు మీ పూలపాన్పుపై నిద్రపోయినందుకే నన్నింతగా హింసిస్తున్నారే, మరి జీవితాంతం పూలపాన్పుపై నిద్రపోయేవారి పరిస్థితి పైలోకంలో ఎలా ఉంటుందో ఊహించుకొని నవ్వుకుంటున్నాను’ అని జవాబిచ్చింది. పాదుషాగారి కళ్లు తెరుచుకున్నాయి. ఆ సేవకురాలిని క్షమించి వదిలి వేశారు. పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. తాను అనుభవిస్తున్న అనుగ్రహాలపట్ల అల్లాహ్‌ లెక్క తీసుకుంటాడన్న గుణపాఠం తెలియజేసిన ఆ సేవకురాలిని బహుమతులతో సత్కరించారు.
– నాఫియా 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top