మళ్లీ మొహంజొదారో | once again Civilization | Sakshi
Sakshi News home page

మళ్లీ మొహంజొదారో

Jul 14 2016 11:03 PM | Updated on Sep 4 2017 4:51 AM

మళ్లీ మొహంజొదారో

మళ్లీ మొహంజొదారో

తొంభై శాతం మంది దర్శకుల ఊహలు తేలికైన కమర్షియల్ కథలకే పరిమితమవుతాయి. కానీ అశుతోష్ గోవారికర్ లాంటి దర్శకులు మాత్రం...

నాగరికత
 
తొంభై శాతం మంది దర్శకుల ఊహలు తేలికైన కమర్షియల్ కథలకే పరిమితమవుతాయి. కానీ అశుతోష్ గోవారికర్ లాంటి దర్శకులు మాత్రం... థింక్ బిగ్ అన్నట్లు భారీ సినిమాలనే ఎంచుకుంటారు. ఆ కథలతో అద్భుతాలను సృష్టించి ప్రేక్షకులను అబ్బురపరుస్తారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన లగాన్, స్వదేశ్, జోథా అక్బర్... ఇలాంటి అనుభూతిని పంచినవే. లగాన్ భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ అవార్డులకు పోటీ పడింది. అశుతోష్ గోవారికర్ రూపొందిస్తున్న కొత్త సినిమా మొహంజొదారో కూడా భారీ చిత్రమే.
 మొహంజొదారో చిత్రం 100 కోట్ల రూపాయల పైచిలుకు బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సింధులోయ నాగరికత కథానేపథ్యం. ప్రపంచ ప్రాచీన నాగరికతల్లో సింధులోయ నాగరికత ఒకటి. క్రీస్తు పూర్వం 6 వేల సంవత్సరాల నాడు ఈ నాగరికత విలసిల్లింది. ఈ నాగరికతలో మొహంజొదారో ఒక ముఖ్య పట్టణం.

ఆనాడే జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మొహంజొదారో ఓ సాక్ష్యం. వేల ఏళ్ల క్రితమే సింధు ప్రజలు ఎంతో ముందుచూపుతో ఆలోచించారు. ఎంతో ప్రణాళికాబద్దంగా సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. 1920లో సింధు నాగరికత అవశేషాలు బయటపడ్డాయి. అప్పుడే హరప్పా, మొహంజొదారో పట్టణాల గురించి ఆధునిక ప్రజలకు తెలిసి వచ్చింది. యునెస్కో 1980లో మొహంజొదారోను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

ఈ చరిత్ర ఆధారంగానే  మొహంజొదారో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అశుతోష్. దానికోసం అతడు చాలా అధ్యయనం చేశాడు. ఏడుగురు పురావస్తు శాస్త్రజ్ఞుల సహాయంతో సింధు నాగరికత విషయాలు తెలుసుకున్నాడు. అప్పటి ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు, సంస్కృతి, భావోద్వేగాలు లాంటి సమాచారమంతా సేకరించాడు. పురావస్తు తవ్వకాలు జరిగిన గుజరాత్‌లోని ధోలావిరా లాంటి ప్రాంతాలు పరిశీలించాడు. సింధు నాగరికత గురించి అతికొద్ది ఆధారాలే లభిస్తున్నాయి. దీంతో చరిత్ర తెలుసుకుని సినిమాకు అన్వయించుకునేందుకు దర్శకుడికి మూడేళ్ల సమయం పట్టింది.

మొహంజోదారో ఒక ప్రేమ కథ. సింధూ లోయ నాగరికతను ఆవిష్కరిస్తూ కథ సాగుతుంటుంది. తన శత్రువు కూతురిని ప్రేమించిన వ్యక్తి ఎలాంటి ప్రతిఘటన ఎదుర్కొన్నాడనేది ప్రధాన  ఇతివృత్తం. అప్పటి పట్టణ వాతావరణాన్ని స్టూడియోలో వీఎఫ్‌ఎక్ తో పునసృష్టి చేశారు. ద డే ఆఫ్టర్ టుమారో, 10,000 బీసీ లాంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన నిపుణులు మొహంజొదారోను ప్రతిష్టించారు. ఆనాటి మానవుల శరీరాకృతి కోసం హృతిక్ రోషన్ మూడు నెలలు విదేశీ నిపుణుల దగ్గర శిక్షణ తీసుకున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. మొహంజొదారో కోసం హృతిక్ 50 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నాడట. ఏఆర్ రెహమాన్ స్వరపర్చిన పాటలు ఈ నెల 6 న విడుదల అయ్యి ఇప్పటికే అలరిస్తున్నాయి. సినిమా ఆగస్టు 12న విడుదలకు సిద్ధమవుతోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement