ప్రిన్సిపల్‌లో తేడా | nenu shakti campaign | Sakshi
Sakshi News home page

ప్రిన్సిపల్‌లో తేడా

Feb 12 2018 2:05 AM | Updated on Feb 14 2018 1:34 PM

nenu shakti campaign - Sakshi

కాలేజీకి కొత్త ప్రిన్సిపాల్‌ వస్తున్నట్టు ఉప్పందింది. అదీ ఒక ఆడ ప్రిన్సిపాల్‌ రాబోతున్నట్టు గుప్పుమంది. ఇది తెలిసి ఒక మగాడు ఉసూరుమంటే ఒక మగాడు హుషారు పడ్డాడు. ‘ఇంతబతుకూ బతికి ఇంటెనకాల చచ్చినట్టు ఒక ఆడ ప్రిన్సిపాల్‌ కింద పని చేయాలా?’ అన్నాడు ఒక మగ లెక్చరర్‌. ‘అయితే ఏమిటోయ్‌. మన పని ఈజీ కాలేదూ’ అన్నాడు మరో మగ లెక్చరర్‌. స్టాఫ్‌రూమ్‌లో అంతా సందడి సందడిగా ఉంది. ‘ఏం ఈజీ’ అన్నాడు మగ లెక్చరర్‌. ‘వచ్చినామె డ్యూటీ చేస్తుందనుకున్నావా? లీవులు పెట్టడమే సరిపోతుంది’ అన్నాడు ఈ లెక్చరర్‌. ‘ఎందుకు పెడుతుందండీ’ అన్నారెవరో. ‘మరి? చీటికిమాటికి లీవు పెట్టడమేగా ఆడవాళ్ల పని.

పూజలనీ, వ్రతాలనీ, తద్దినాలనీ, పిల్లలకు జ్వరాలనీ, ఊర్నుంచి అత్తగారు వచ్చారనీ... సీటులో ఎప్పుడు ఉండి చస్తారు కనుక. సెలవు ముందుపుట్టి ఆడవాళ్లు ఆ వెంటనే పుట్టారు’ అన్నాడతడు. అంతటితో ఆగలేదు. థియరీ చెప్పాడు. ‘ఇక వీళ్లు టైమ్‌కు రావడం గగనం. పిల్లలను స్కూళ్లకు పంపి, మొగుళ్లను రెడీ చేసి, అద్దం ముందు నిలబడి గంటలు గంటలు సింగారించుకుని వచ్చేసరికి పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. ఈలోపు మనదే రాజ్యం. మాహిష్మతి మనదే కట్టప్పా’ చాలా హుషారుగా ఉన్నాడతను. కారణం ఉంది. కాలేజీలో ఆల్రెడీ ఒక లేడీ లెక్చరర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌గా ఉంది.

ఇప్పుడు ప్రిన్సిపాల్‌గా ఇంకో లేడీ వస్తే అది కోఎడ్యుకేషన్‌ కాలేజీ కనుక ఇద్దరూ ఆడవాళ్లుండటం సమ్మతం కాదు కనుక వైస్‌ ప్రిన్సిపాల్‌ పోస్ట్‌ తనకే వస్తుందని ఇతని ధీమా. ‘ఆవిడగారు లీవు పెట్టినప్పుడల్లా నేనే కదా బాసు. అప్పుడు చూపిస్తా తడాఖా’ అన్నాడు. ఈ మాట మగ లెక్చరర్లను ఆలోచనలో పడేసింది. ‘నువ్వే బాస్‌ అయితే గనక మమ్మల్ని కొంచెం చూసీ చూడనట్టుగా వదిలేస్తావుగా’ అన్నాడొకడు. ‘క్లాస్‌ సగంలో ఉండగా బయటికొచ్చి సిగరెట్లు కాల్చుకోవచ్చుగా?’ అని అడిగాడు ఇంకొకడు. ‘సంతకం పడేసి క్లబ్బుకు వెళ్లొచ్చు కదా’ అన్నాడు ఒకడు. ‘నేనసలు క్లాసులే తీసుకోను’ అన్నాడు వేరొకడు.

ఈ పరిపరి విన్నపాలు విని చిద్విలాసంగా అభయం ఇచ్చాడు లెక్చరర్‌. శుభముహూర్తం వచ్చింది. మగ లెక్చరర్లకు మళ్లీ ఉప్పందింది. లేడీ ప్రిన్సిపాల్‌ ఉదయం ఎనిమిది గంటలకే వచ్చేసిందట. బాప్‌ రే వచ్చేసిందా. ఆ రోజంతా కాలేజీ హడావిడి హడావిడిగా ఉంది. లేడీ ప్రిన్సిపాల్‌ అసలు తన రూమ్‌లోనే కూచోలేదు. కాలేజ్‌ అంతా తిరుగుతూనే ఉంది. క్లాసులు మానిటర్‌ చేసింది. లెక్చరర్లు ఎంతసేపు క్లాసు చెపుతున్నారో గమనించింది. అసలు ఎలా చెబుతున్నారో గమనించింది. దొంగ పర్మిషన్లు బుట్టదాఖలు అయ్యాయి. సిక్‌ లీవ్‌లో ఉన్న లెక్చరర్‌ క్లాసును తనే తీసుకుని చెప్పినప్పుడు ఆ వాగ్ధాటికి పిల్లలు రెప్పవేయకుండా విన్నారన్న వార్త కూడా కారిడార్లలో పాకి అక్కడి నుంచి ఒకరిద్దరి వెన్నులో కూడా పాకింది.

సాయంత్రం అయిదున్నరకి స్టాఫ్‌తో చిన్న మీటింగ్‌. ‘ఇన్ని రోజులు ఎలా గడిచాయో తెలియదు నాకు. ఇక మీదట ఇవాళ గడిచినట్టు గడుస్తాయి’ అంది. మగలెక్చరర్ల ముఖాలు మెల్లగా మాడిపోయాయి. వైస్‌ ప్రిన్స్‌పాల్‌ పోస్టు ఆశించిన లెక్చరర్‌ మనసులో ఆశ మినుకుమినుకుమంటోంది. ‘మరి వైస్‌ప్రిన్సిపాల్‌ సంగతి?’ నసిగాడు. ‘ఏంటి ప్రాబ్లమ్‌?’ అడిగిందామె. ‘ఇంకా పాత ముతక సామెతల్లోనే ఉన్నారా? రెండు కొప్పులకు పడదని భావిస్తున్నారా? ఇక్కడకు వచ్చేముందే వైస్‌ ప్రిన్స్‌పాల్‌ గురించి తెలుసుకున్నాను. ఆమె చాలా బాగా పని చేస్తున్నదని రిపోర్ట్‌ ఉన్నాయి. వైస్‌ ప్రిన్స్‌పాల్‌గా ఆమే కంటిన్యూ అవుతుంది. ప్రిన్స్‌పాల్‌గా, వైస్‌ ప్రిన్సిపాల్‌గా మగాళ్లే ఉండి కాలేజీలు నడుపుతున్నప్పుడు మేమెందుకు నడపకూడదు. ఇంకా బాగా నడిపి చూపిస్తాం’ అంది. మగాళ్లు పూర్తిగా నేల కరుచుకుపోయారు.

మెల్లగా లేచారు వెళ్లడానికి. ‘కూర్చోండి. ఎక్కడకు వెళతారు. చాయ్‌ తాగరా’ అందామె. ‘చాయ్‌ తాగడానికి ఇంతకుమించిన అకేషన్‌ ఏముంది?’ అని తిరిగి రెట్టించింది. ‘అవునవును ఏముంది’ అని చతికిలపడ్డారు మగలెక్చరర్లు. ఆనాటి పొగలు కక్కే చాయ్‌ వాళ్లకు చాలారోజుల పాటు గుర్తుండిపోయింది. కథ ముగిసింది. మృణాళిని రాసిన ‘లేడీ బాస్‌’ కథ ఇది.బాస్‌ అంటే ప్యాంటూ షర్టూ వేసుకుని ఉండాలన్న అభిప్రాయం మగాళ్లలో పాతుకుపోయింది. మీసం ఉండాలని, మగవాడు అయి ఉండాలని, మగవాడి కిందే పని చేయాలని.... ఇంట్లో నాన్న పెత్తనం అలవాటయ్యి ఆఫీసులో మగ పెత్తనం ఆశిస్తారు.

సంతకం పెట్టే చేయికి, నిర్ణయం తీసుకునే బుర్రకి స్త్రీ, పురుష తేడా ఎందుకుంటుంది అనే ఆలోచన లేదు. డాబా మీద వడియాలు ఆరవేయడానికి వెళ్లినప్పుడు మాత్రమే స్త్రీలు ఆకాశం వైపు చూడాలనుకునే మగవారు అంతరిక్షంలో చక్కర్లు కొట్టిన సునీతా విలియమ్స్‌ వంటివారిని మెడనొప్పి పుట్టినా సరే చూడక తప్పదు. రోజులు మారాయి. అదిగో సుఖోయ్‌ విమానంలో నిర్మలా సీతారామన్‌.


- మృణాళిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement