కళాత్మకం : జిందగీ మే హార్మోనికా సీఖ్ లే!

కళాత్మకం : జిందగీ మే హార్మోనికా సీఖ్ లే! - Sakshi


 మొన్న లామకాన్‌లో  ‘జిందగీ మే ప్యార్ కర్‌నా సీఖ్‌లే...’ ఫూల్ ఔర్ పత్థర్ సినిమా పాటను హార్మోనికాలో సబ్నవీస్ రామకృష్ణ  వినిపించారు. ఆ సాయంత్రం అనేక పాటలను హార్మోనికాలో ‘భాగ్య’నగరి కళాప్రియులు ఆలకించారు.  హార్మోనికా విశేషాల గురించి, తమ అనుబంధం గురించి హార్మోనిస్ట్ రామకృష్ణ  ఇంటర్వ్యూ సారాంశం..

 

 హార్మోనికా బైట్!

 మాది హైద్రాబాద్‌లో స్థిరపడ్డ సంప్రదాయ కుటుంబం. తొమ్మిదేళ్ల వయసులో ‘మంజిల్’ సినిమాకు అమ్మానాన్నలతో వెళ్లాను. దిల్‌తో హై దివానా నా మానేనా మానేనా రుక్ జా నా...’ తొలిసారిగా విన్న హార్మోనిక్ ఇంటర్లూడ్ అది! హార్మోనికా బిట్‌తోనే పాట మొదలవుతుంది. దేవానంద్-నూతన్ ల కోసం రఫీసాబ్, ఆశాభోంస్లే ఆ పాట పాడారు. సచిన్‌దేవ్ బర్మా సంగీత దర్శకుడు. ఈ వివరాలేమీ నాకు తెలీదు. ఫస్ట్‌టైమ్ విన్న హార్మోనికా బిట్ నన్ను బైట్ చేసేసింది.

 

 హార్మోనికా-ఎకార్డియన్‌ల సంవాదం!

 సాధారణంగా పాటల్లో ఒకరు ప్రశ్నించడం మరొకరు సమాధానాలు చెప్పడం మనకు తెలుసు. అలాగే ఎకార్డియన్-హార్మోనికాలు ప్రశ్నోత్తరాల మాదిరిగా సంగీతాన్ని ప్రసరించిన పాట ‘ఫూల్ ఔర్ పత్థర్’లో ఉంది. ఓ.పి.నయ్యర్ సంగీత దర్శకత్వంలో ఆశాభోంస్లే పాడారు. హార్మోనికా ప్రశ్నిస్తోంటే ఎకార్డియన్ సమాధానం చెబుతున్నట్లుంటుంది. ఆ పాటకు, ఎకార్డియన్ ఎవరు వాయించి ఉంటారు? హిందీ చిత్ర సీమలో ఎకార్డియన్ మాస్టర్స్ నలుగురున్నారు. సుమీత్‌మిత్రా, రవ్వాచంద్ర, బి.బల్సారాసాబ్, ఎన్.ఎఫ్.డేనియల్ సాబ్. డేనియల్ సాబ్ ఒక్కరే సజీవులు. పుణెలో ఉన్నారు. ఆయనను ఈ మధ్యే అడిగాను ఫోన్‌లో... సుమీత్ మిత్రా కావచ్చు అన్నారు. ఆ పాట వినడం, ఎలక్ట్రానిక్ పరికరంపై ఎకార్డియన్‌కు హార్మోనికాతో జతగా విన్పించడం నాకు మహదానందం కలిగిస్తుంది. హార్మోనికా, ఎకార్డియన్‌లు ఒకే కుటుంబానికి చెందినవి. హార్మోనికాలోని చెక్క గదులకు నోటిద్వారా గాలిని పంపిస్తే, ఎకార్డియన్‌లో అదే తరహాలోని నిర్మాణంలోకి గాలితిత్తి ద్వారా పంపిస్తారు. తాతమ్మకలలో ‘బ్రహ్మం తాత చెప్పింది...’ పాటను ఎకార్డియన్ వీనులవిందుగా విన్పించడం మరచిపోగలమా!

 

 జునూన్ అంటే పిచ్చి!

  వృత్తిరీత్యా నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్‌ని. హార్మోనికా హాబీనా? కాదు! ఎ సార్ట్ ఆఫ్ వర్షిప్. ఇట్సె జునూన్.  పిచ్చి అనుకోవచ్చు. ఇది బ్యూటిఫుల్ ఇన్‌స్ట్రుమెంట్.

 తొలి తెలుగు సినీగాయని రావుబాలసరస్వతిగారు చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న కార్యక్రమంలో, భారతీయవిద్యాభవన్ కార్యక్రమాల్లో హార్మోనికా వినిపించాను.  ఒకసారి ప్రముఖ గాయని గాయత్రీదేవి బెంగళూరు నుంచి వచ్చారు. ‘అప్‌నా దిల్ పర్వానా’ పాడాలన్నారు. ఆ పాటలో ముఖ్యమైన హార్మోనికా వాయించేవారు బెంగళూరు నుంచి రాలేదు. ఆనాటి కార్యక్రమంలో ప్రేక్షకులు ముఖ్యంగా గాయత్రీదేవి ఎంతో ఆనందించారు. నన్నెవరైనా అభినందిస్తే హార్మోనికా మహానుభావులు రాహుల్ దేవ్ బర్మన్, మిలన్ గుప్తాలు గుర్తొస్తారు. ఆ అభినందనలు వారికే చెందుతాయి.  ఆర్.డి.బర్మన్ టంగ్‌స్లాపింగ్ అవీ ఇవీ చేసి ఎక్స్‌పరిమెంట్ చేశాడు. హైద్రాబాద్‌లో ఓల్డెస్ట్ హార్మోనికా ప్లేయర్ గవ్వల రాజ్‌కుమార్‌గారు. మిలన్‌గుప్తా శిష్యుడు వినాయక్‌గారు.

 

 ఇందిరా పార్క్‌లో ‘మిలన్’

 మిలన్ గుప్తా ఇండియన్ హార్మోనికా లెజెండ్. ఆయన హార్మోనికాలో క్లియర్‌గా, అక్షరం అక్షరం పలికిస్తారు. మిలన్‌గుప్తా వంటి మహానుభావుడు ప్రస్తుతం మదన్‌కుమార్ శర్మ. ఆయన పుణెలో ఉన్నారు. ఆయన కూతురు ఇక్కడున్నారు. 2014లో వస్తారు. ఆయనొస్తే ఆయన గౌరవార్థం ఒక ప్రోగ్రాం చేస్తాం. హైదరాబాద్ ఓల్డెస్ట్ హార్మోనికా ప్లేయర్ గవ్వల రాజ్‌కుమార్‌గారు. మిలన్‌గుప్తా శిష్యుడు వినాయక్‌గారికి సరిరాగలవారు లేరు. మిలన్ గుప్తా స్ఫూర్తితో ఏర్పడ్డ ‘హార్మోనికా లవర్స్ ఆఫ్ హైద్రాబాద్’ (ఏ్చఔౌఏ) లో 30 మంది సభ్యులం ఉన్నాం. మేమంతా ప్రతి ఆదివారం హైదరాబాద్ లోయర్ టాంక్‌బండ్ వద్ద గల ఇందిరాపార్క్‌లో ఉదయం 9-11 గంటల మధ్య కలుస్తుంటాం. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా నేర్పేందుకు హార్మోనికా లవర్స్ సాదరంగా స్వాగతిస్తారు!

 - పున్నా కృష్ణమూర్తి

 

 ఇట్సె జునూన్. ఇట్సె మాడ్‌నెస్. పిచ్చి అనుకోవచ్చు. తాత్వికంగా చెప్పాలంటే ‘ఇదియే సాధనము, ఇహ-పరములకు’! ఇది బ్యూటిఫుల్ ఇన్‌స్ట్రుమెంట్. బ్రెత్ కంట్రోల్ వస్తుంది. ఇట్సె సార్ట్ ఆఫ్ యోగా టైప్. యోగ ద్వారా లభించే ప్రయోజనం, ఆరోగ్యం హార్మోనికా ఇస్తుంది.

 -  రామకృష్ణ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top