రమణీయ శ్రీ రామాయణం

Mullapudi Sridevi Says About Ramaneeya Sri Ramayana With Sakshi

ఆవిష్కరణ

అన్నిటికీ వాల్మీకి రామాయణమే మూలం, ఆధారం. అన్ని రామాయణాలతో పాటు ఇదీ మరొక్క రామాయణం. ఇందులో నా సొంత కవిత కొంచెం కూడా లేదు. ఉన్నదంతా వాల్మీకి కవితా సౌందర్యమే.
– ముళ్లపూడి శ్రీదేవి,ముళ్లపూడి వేంకటరమణ సతీమణి

బాపు రమణలు రామభక్తులు. బొమ్మలతో, అక్షరాలతో రాముడి ఋణం కొంతైనా తీర్చుకుని వెళ్లిన జంట. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ముళ్లపూడి వెంకటరమణ సతీమణి ముళ్లపూడి శ్రీదేవి. ఎన్నటికైనా వాల్మీకి ఉపమానాలను ఒక పుస్తకంగా తేవాలని నాలుగు దశాబ్దాల క్రితమే ఆలోచన చేశారు రమణగారు. అప్పుడు సాధ్యపడలేదు. ఇప్పటికి ఆ ఆలోచన ఆచరణలోకి వచ్చింది. ‘రమణీయ శ్రీ రామాయణం’ పేరున ఈ పుస్తకాన్ని శ్రీదేవి ఈరోజు ఆవిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా తన మనసులోని మాటలను సాక్షితో పంచుకున్నారు ముళ్లపూడి శ్రీదేవి.

ఇది ముళ్లపూడి వెంకటరమణగారి కోరిక. అంటే రమణగారు నాకు కలలో కనిపించి రామాయణం రాయమన్నారని కాదు నేను చెప్పేది. రమణగారి చిన్న వయస్సులో – అంటే ఇంకా ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడని రోజుల్లో – వాల్మీకి రామాయణాన్ని శ్రీనివాస శిరోమణి తెలుగులో వచనానువాదం చేస్తున్నారు. అది ఆంధ్ర పత్రికలో ఆదివారం సారస్వతానుబంధంలో ప్రచురింపబడేది. తెలుగువారంతా ఆ రామాయణాన్ని ఇష్టంగా భక్తిగా చదివారు. ఆ రోజుల్లో శిరోమణి గారి దగ్గర వెంకటరమణ గారు సహాయకుడిగా పనిచేశారు. ఆ సందర్భంగా అనువాదం కోసం ఎన్నో రామాయణాలు పరిశీలించారు. వాల్మీకి మహర్షి కవిత్వం, ఆయన శైలి, ఆయన భక్తి ఆకళింపు చేసుకున్నారు. రామాయణమన్నా, రాముడన్నా భక్తి తాత్పర్యాలు ఏర్పడ్డాయి. ఆ ఇష్టంతోనే రమణగారు ‘సీతాకల్యాణం’ కథ రాశారు.

‘ఉపమా కాళిదాసస్య’ అని లోకోక్తి. ‘ఉపమా వాల్మీకస్య’ అని రమణగారు అంటారు. వాల్మీకి మహర్షి కథ చెప్పే పద్ధతి చాలా సరళంగా ఉంటుంది. కథ చెప్పేటప్పుడు అలంకారాలు ఎక్కువగా ఉపయోగించడు. కథ సూటిగా సాగిపోతుంది. వర్ణనల విషయంలో మాత్రం వాల్మీకి ఉపమాలంకారాన్ని విరివిగా ఉపయోగించాడు. ఆయా సమయాలలో సందర్భానుసారంగా ఒకటిరెండు ఉపమానాలు చెప్పి ఊరుకోడు. ఒకదాని వెంట మరొకటిగా పుంఖానుపుంఖంగా ఉపమా లంకారాలు గుప్పిస్తాడు. పాఠకుడిని ఊపిరి తిప్పుకోనివ్వడు. వాల్మీకి ప్రయోగించిన  ఈ పద్ధతి రమణగారిని ఎక్కువగా ఆకర్షించింది. రమణగారి కథల్లో కూడా ఈ ఉపమానాల ప్రయోగం తరచుగా కనిపిస్తుంది. విశేషమైన ఈ ప్రయోగాన్ని పాఠకులకు అందించాలని రమణగారి కోరిక.

వాల్మీకి చెప్పిన రామకథను మళ్లీ చెప్తూ, సందర్భానుసారంగా వచ్చిన ఉపమానాలను యథాతథంగా అమర్చటం సముచితంగా ఉంటుందని నాకు అనిపించింది. నాకు తోచిన పద్ధతిలో రామాయణం చెప్పటానికి పూనుకున్నాను. ఇంత ప్రయత్నానికీ మూలకారణం ముళ్లపూడి వెంకటరమణగారే. రామాయణం ఒక కొత్త ఉద్దేశంతో చెప్పడానికి ప్రయత్నించాను. అన్నిటికీ వాల్మీకి రామాయణమే మూలం, ఆధారం. అన్ని రామాయణాలతో పాటు ఇదీ మరొక్క రామాయణం. ఇందులో నా సొంత కవిత కొంచెం కూడా లేదు. ఉన్నదంతా వాల్మీకి కవితా సౌందర్యమే.

రమణగారు వాల్మీకి రామాయణంలోని ఉపమానాలను అందరికీ ప్రత్యేకంగా చెప్పాలని ఆశించారు. వాల్మీకి ఎంత గొప్పగా, ఎంత అందంగా వాడాడో చెప్పాలనుకున్నారు. ఎలా చెబితే బాగుంటుందా అని ఆచార్య డా. బేతవోలు రామబ్రహ్మం, మహామహోపాధ్యాయ డా. పుల్లెల శ్రీరామచంద్రుడు వంటి పెద్దలను అడిగారు. అందరూ ఆలోచన బావుందన్నారు. కానీ ఎలా రాయాలో చెప్పలేదు. దానితో రమణ గారు ఈ అంశాన్ని పుస్తకంగా తీసుకురాలేదు.

అప్పట్లో వాల్మీకి ఉపమానాలను నా స్వదస్తూరితో రాసి ఉంచాను. అందువల్ల అది నా మనసులో ఉండిపోయింది. నేను ప్రతి ఉపమానానికి అంకెలు వేసి పెట్టుకున్నాను. మా అమ్మాయి సలహా మేరకు కార్యరూపంలోకి దిగాను. వాల్మీకి ఎప్పుడు, ఏ సందర్భంలో, ఏ అర్థంలో ఉపమానాలు చెప్పారో వివరంగా రాసి, నా బ్లాగులో పెట్టాను. మొత్తం  రెండు సంవత్సరాల పాటు రాశాను. నేను పూర్తిచేసిన మరునాడు తిరుపతిలో ఉండే కథాప్రపంచం పబ్లిషర్‌ కిరణ్‌ ఈ పుస్తకం ప్రచురిస్తానన్నాడు. రామాయణం రాస్తూ నా ఒంటరితనాన్ని దూరం చేసుకోవడమే కాదు, నా మనసులో నాతోనే ఉన్న రమణ గారి కోరిక నెరవేర్చాను’ అని ముగించారు ముళ్లపూడి శ్రీదేవి.
– డా. వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top