చంటిపిల్లలకు పాలెలా పట్టాలి?

Mothers Milk Protects The Baby From Many Infections - Sakshi

బేబీ ఫీడింగ్‌

చంటి పిల్లలకు సాధ్యమైనంతవరకు తల్లిపాలే పట్టాలి. చనుబాలు చాలా మేళ్లు చేస్తాయి. అయితే ఒక్కోసారి తల్లికి పాలు పడని సందర్భాల్లో మాత్రం పోత పాలు ఇవ్వవచ్చు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి.

పాడి పశువుల పాలు : ఆవు, గేదె, మేక వంటి పాడి పశువుల పాలు ఇవ్వవచ్చు.

డబ్బా పాలు : పిల్లల కోసం ఉద్దేశించి అమ్మే పాల పౌడర్‌ను ఉపయోగించి కలిపి ఇచ్చేవి కూడా కొందరు ఇస్తుంటారు.

బిడ్డకు సీసాతో పాలు పట్టాల్సి వస్తే...
►ముందుగా సీసాను, పాల పీకను సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి.
►పాల సీసాను పది నిమిషాల పాటు మరిగే నీళ్లలో ఉంచాలి. అలాగే పాల పీకను కనీసం రెండు నిమిషాల పాటు వేడి నీళ్లలో మరగనివ్వాలి.
►పాలు పట్టాక బిడ్డను వెంటనే పడుకోబెట్టకూడదు. పాలు పట్టగానే బిడ్డను మొదట భుజంపై వేసుకుని నెమ్మదిగా తట్టాలి. ఇలా తేన్పు వచ్చే వరకు తట్టాలి. ఆ తర్వాతే పడుకోబెట్టాలి.
► సీసాలో పాలు తాగించే సమయంలో ఒకసారి తాగాక మిగిలిన పాలను తప్పక పారబోయాలి.
►బిడ్డ నిద్రపోయే సమయంలో పాలు తాగించకూడదు.
►బిడ్డకు తల్లి సీసాతో పాలు తాగించే సమయంలో బిడ్డను ఒళ్లో పడుకోబెట్టి పాలు ఇవ్వాలి.

చంటిబిడ్డకు తల్లిపాలే మంచివి... ఎందుకంటే...
►బిడ్డకు తల్లి పాలు ఇవ్వలేని సమయంలో తప్ప... మరెప్పుడూ పోతపాల గురించి ఆలోచించవద్దు.
►బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టడం ప్రారంభించాలి.
►కొందరు తల్లులు ముర్రుపాలను బిడ్డకు ఇవ్వరు. కానీ అందులో ఎన్నో వ్యాధి నిరోధక శక్తి కలిగిన పోషకాలు ఉంటాయి. వాటిని ఇవ్వడం వల్ల కొన్నిసార్లు బిడ్డ జీవితాంతం ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
►బిడ్డకు నాలుగు నుంచి ఆర్నెల్ల వయసు వచ్చేవరకు కేవలం చనుబాలే సరిపోతాయి. మరే ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు.
►తల్లిపాలు చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి.
►బిడ్డను అనేక అంటువ్యాధుల నుంచి తల్లిపాలు రక్షిస్తాయి. ముఖ్యంగా బిడ్డ పుట్టిన తొలినాళ్లలో పాలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.
►బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో రుతుస్రావం ఆలస్యంగా మొదలతుంది. అంటే చాలా సందర్భాల్లో పాలిచ్చే తల్లుల్లో బిడ్డకూ బిడ్డకూ ఎడం ఉండేలా ప్రకృతే సహాయపడుతుందన్నమాట.
►తల్లికీ, బిడ్డకూ మధ్య మానసికంగా, శారీరకంగా అనుబంధాలు, ఉద్వేగాలు పెంపొందుతాయి.

తల్లి దగ్గర బిడ్డకు పుష్కలంగా పాలు దొరుకుతూ ఉంటే...
►తల్లిపాలు పుష్కలంగా తాగిన బిడ్డ కనీసం 2–3 గంటల పాటు హాయిగా నిద్రపోతుంది.
►తల్లి నుంచి కడుపునిండా పాలు లభ్యమయ్యే బిడ్డ రోజుకు 7 నుంచి 8 సార్లు మల విసర్జన చేస్తుంది.
►బిడ్డలో ఎదుగుదల బాగుంటుంది.
►బిడ్డ హుషారుగా ఆడుకుంటూ ఉంటుంది.
►బిడ్డకు సరిపడా పాలు పడుతున్నంతకాలం అమ్మ పాలే శ్రేష్టమైనవన్న విషయం తల్లి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top