సాధనమున చరిత్ర సమకూరు రచనలోన..

Mohitha Writes Article About Telugu Literature - Sakshi

రిపోర్ట్‌

తెలుగువాడి చరిత్ర ఆశ్చర్యాల పుట్ట. ఆ చరిత్ర మనకెందుకు అందుబాటులో లేకుండా పోయిందనేది కూడా ఆశ్చర్యమే. మద్రాసుకు, కర్ణాటకకు, ఒరిస్సాకు, మహారాష్ట్రకు, ఇంకా అనేకులకు మన ప్రదేశాలను, వీరులను, కళలను, చివరకు చరిత్రను కూడా ధారాదత్తం చేశాము. మన చరిత్ర మనకు తెలియకపోవడం వల్ల, మన జాతి పట్ల మనకే గర్వం కలగడం లేదు. జాతిని వెలుగులోకి తీసుకు రావాలంటే చరిత్ర మీద దృష్టి పెట్టాలి. ఈ అవగాహన కోసమే ఈ నెల 14, 15 తేదీల్లో విజయవాడ దగ్గరలోని ఒక ఆహ్లాదకరమైన స్థలి వేదికగా ‘కాలయంత్రం – 2020’ చారిత్రక కథారచన కార్యశాల జరిగింది. సాయి పాపినేని ఏర్పాటు చేయగా, కార్పొరేట్‌ వర్క్‌ షాప్‌ స్థాయిలో జరిగిన ఈ కాలయంత్రంలో– 35 మంది తెలుగు రచయితలు ఒక దగ్గర కూడితే చిందే సాహిత్యపు సందడి ఒక ఎత్తయితే, సాహితీ సృజనలో చెయ్యి తిరిగినవారితో పాటు ఇప్పుడిప్పుడే కలం పట్టిన వారు కూడా అపురూపమైన చారిత్రక క్షణాలను శ్రద్ధగా నోట్సుల్లో ఒడిసిపట్టుకుంటూ కనపడటం మరో ఎత్తు.

ఈ రెండు రోజుల్లో అనేకానేక అంశాలు చర్చకు వచ్చాయి. వెయ్యేళ్ళు నిండిన తెలుగు సాహిత్యంలో రావల్సినంత చరిత్ర ప్రాధాన్యతతో కథలు రాలేదనే నిజాన్ని అందరూ అంగీకరించారు.  చరిత్రను పాఠ్యపుస్తకం లాగానో, పరిశోధక వ్యాసంలాగానో కాక కథలాగా చెబితే చదువుతారని తాజాగా ‘శప్తభూమి’ నవల నిరూపించింది. సాహిత్యంలోంచి వాస్తవాన్ని వడగట్టాలంటే సాహిత్యేతరాలైన చారిత్రక ఆధారాలు కూడా పరిశీలించాలి. శాసనాలు, నాణేలు, పురావస్తు అవశేషాలు, హస్తకళలు, ఆచార వ్యవహారాలు, పాటలు, గాథలు, నదులు, చెరువులు, పట్టణాలు, ఆలయాలు, ఊరిపేర్లు, ఇంటిపేర్లు, రహదార్లు, భవనాలు– ఇలా ప్రాచీన సంప్రదాయాలతో సంబంధమున్న ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూసి ఒకదానికొకటి అనుసంధానం చేసి తప్పో ఒప్పో తేల్చుకోవాల్సిన పని చరిత్రను రచించే, సాహిత్యంగా మలచే ప్రతి రచయితా చేసి తీరవలసిందే. అయితే, ఈ ప్రయత్నంలో అనేక సందేహాలు ఎదురవుతాయి. ఏది చరిత్ర? ఏది అభూత కల్పన? ఈ రాజు ఇలా చేసి ఉంటాడా? సంభావ్యత ఎంత? ఈ కార్యశాలలో ప్రసంగించిన నిపుణులు వీటికి జవాబులిస్తూ రచయితలకు తోడుంటామని మాటిచ్చారు. 

ఆంధ్ర ప్రాంతంలోనే దొరికిన ఐదు లక్షల సంవత్సరాల కిందటి ఆదిమ మానవుని అవశేషాలు, కళింగాంధ్రులు, రేనాటి చోళులు, జంబూద్వీప వృత్తం, జాతక కథలు, నాగులవంచలో డచ్‌ చరిత్ర, యానాం చరిత్ర, భారతీయ, అంతర్జాతీయ భాషలలో వచ్చిన చారిత్రక మహా/ సూక్ష్మ కథనాలు, శ్రీలంక నుంచి ఫిలిప్పీన్స్‌ దాకా విస్తరించిన ఆంధ్ర సామ్రాజ్యం, ఇండోనేషియాలో ఇప్పటికీ కనిపించే మన ఆవకాయ జాడీలు, 110 ఏళ్ళు దాటినా ఇంకా జవాబు దొరకని గురజాడ ‘దేవుళ్ళారా మీ పేరేమిటి’, ఆంధ్రతీరపు నౌకానిర్మాణ పరిశ్రమ, జైనుల దేవతలు గ్రామదేవతలవడం, వజ్రాలకోసం మట్టిలో వెతుకులాటలు, సిరిమాను ఆచారం, బుద్ధుడు ముందా రాముడు ముందా, భువనవిజయం అసాధ్యమా, నానక్‌ కబీర్లు కలుసుకుంటే, అశోకుడి ఎర్రగుడి శాసనాలు, మామిడిచెట్ల కింద నాణేల ప్రదర్శన – ఇలాంటి మిక్కిలి ఆసక్తికరమైన చర్చలు, విశ్లేషణలు, గమ్మత్తులు, నమ్మలేని నిజాలు, పురాస్పర్శలు – తెలుగువాడి చరిత్రను అందరికీ తెలియచెప్పాలనే సమష్టి బాధ్యతను గుర్తెరిగేలా చేశాయి.

కార్యశాలలో భాగంగా రెండో రోజు కొండవీడు పర్యటన ఏర్పాటైంది. రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనశాలలో కర్పూర వసంతరాయల కుడ్యచిత్రాలు, కొండవీడు కోట నమూనా వగైరాలున్నాయి. ఈనాడు శిథిలాలుగా కనిపిస్తున్న కొండవీడు 14వ శతాబ్దిలో ప్రోలయ వేమారెడ్డిచే నిర్మితమై పదివేలమంది నివసించిన ఒక పూర్తి నగరం. దీని పునరుద్ధరణలో భాగంగా మెలికలు తిరిగే కొండదారి తాజాగా ఏర్పడింది. కొండలపై దారంతా రాసి ఉన్న వేమన పద్యాలు ఆ కాలానికి తీసుకువెళతాయి. తెలుగువారి వారసత్వ సంపదలో భాగమైన అనేక చారిత్రక అంశాలతో కూడుకున్న ‘కాలయంత్రం’ చరిత్ర పట్ల చైతన్యం రగిలించింది.  

- మోహిత 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top