బ్యూటిఫుల్‌ ఇండియా

Miss India Suman Rao Is The Second Runner Up In Miss World 2019 - Sakshi

‘మిస్‌ వరల్డ్‌’గా భారతీయ మూలాలున్న యువతి

సెకండ్‌ రన్నరప్‌గా మిస్‌ ఇండియా

లండన్‌లో జరిగిన ‘మిస్‌ వరల్డ్‌ 2019’ పోటీలో మెరిసిన భారతీయ సౌందర్యం

నల్ల సౌందర్యానికి మళ్లీ కితాబు దక్కింది. శ్వేతవర్ణం వెనక్కు తగ్గింది. ‘మిస్‌ యూనివర్స్‌ 2019’ కిరీటం నల్లజాతి వనితకు దక్కిన కొద్ది రోజుల్లోనే ‘మిస్‌ వరల్డ్‌ 2019’ కిరీటం కూడా మరో నల్లవజ్రానికే దక్కింది. జమైకాకు చెందిన టోని ఆన్‌సింగ్‌ శనివారం లండన్‌లోని ఎక్సెల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన భారీ వేడుకలో  మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని శిరస్సుపై ధరించి ఈ ఘనతను సాధించింది. 23 ఏళ్ల టోని ఆన్‌సింగ్‌ తండ్రి ఇండియన్‌ కరేబియన్‌. తల్లి ఆఫ్రికన్‌ కరేబియన్‌. కనుక ఆమె సౌందర్యంలో భారతీయ మూలాలు ఉన్నందుకు భారతీయ సౌందర్యప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో టాప్‌ 3లో నిలిచి సెకండ్‌ రన్నరప్‌గా  మిస్‌ ఇండియా సుమన్‌ రావు స్థానం పొందడం కూడా భారతీయులకు సంతోషం కలిగిస్తోంది. 111 దేశాలు ఈ కిరీటం కోసం పోటీ పడగా టోని ఆన్‌సింగ్‌ మొదటి స్థానంలో, సుమన్‌ రావు మూడో స్థానంలో నిలిచి భారతీయ సౌందర్య కేతనాన్ని రెపరెపలాడించారు. నవంబర్‌ 20 నుంచి మొదలైన ఈ పోటీలు దాదాపు నాలుగు వారాలపాటు కొనసాగాయి. 70 దేశాల పార్టిసిపెంట్స్‌ రకరకాల దశల్లో వెనుకకు మరలగా టాప్‌ 40లో నిలిచిన అందగత్తెలు కిరీటం కోసం హోరాహోరి తలపడ్డారు.

జమైకా బాలిక
‘ఈ విజయం ఆ జమైకా బాలికకు అంకితం’ అని కిరీటం దక్కించుకున్నాక టోని ఆన్‌సింగ్‌ వ్యాఖ్యానించింది. ఆ బాలిక ఎవరో కాదు తనే. ఈ విజయం తనూ తనలాంటి నల్లజాతి బాలికలకు సొంతమని టోని పేర్కొంది. ‘స్త్రీల సమానత్వం కోసం నేను చేయదగ్గ పనంతా చేస్తాను’ అని కూడా ఆమె అంది. టోని కుటుంబం ఆమెకు తొమ్మిదేళ్ల వయసు ఉండగా అమెరికాకు వలస వచ్చింది. ఫ్లోరిడా యూనివర్సిటీలోనే టోని విమెన్స్‌ స్టడీలో గ్రాడ్యుయేషన్‌ చేసింది.

సెకండ్‌ రన్నరప్‌ సుమన్‌రావు

రాజస్థాన్‌ అమ్మాయి
రాజస్థాన్‌కు చెందిన సుమన్‌ రావు ‘మిస్‌ వరల్డ్‌ 2019’కు హాజరయ్యే ముందు ‘మిస్‌ రాజస్థాన్‌’, ‘మిస్‌ ఇండియా ఫెమినా’ టైటిల్స్‌ గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె కుటుంబం నవీ ముంబైలో ఉంటోంది. చార్టర్డ్‌ అకౌంటెన్సీ పూర్తి చేసే పనిలో ఉన్న సుమన్‌ రావు ఇప్పటికే మోడలింగ్‌లో బిజీగా ఉంది. సినిమాలలో అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటోంది. కథక్‌ నృత్యకారిణి కావడం వల్ల మిస్‌ వరల్డ్‌ పోటీలలో ఆనవాయితీగా జరిగే డాన్స్‌ కాంపిటీషన్‌లో ‘పద్మావత్‌’ సినిమాలోని ‘ఝమర్‌’ పాటకు నృత్యం చేసి ఆహూతులను ఉర్రూతలూగించింది.

‘భారతదేశంలో స్త్రీలకు కట్టుబాట్లు ఎక్కువ. నా తల్లి అటువంటి కట్టుబాట్లు చాలా ఎదుర్కొంది. అయినప్పటికీ నన్ను నా కలల వెంట వెళ్లేలా చేసింది’ అని సుమన్‌ రావు చెప్పింది. మిస్‌ వరల్డ్‌ పోటీలో సుమన్‌ రావు మూడో స్థానంలో నిలిచిందని తెలియగానే ఆమె స్వగృహంలో వేడుకలు మొదలయిపోయాయి. ‘నా కూతురు అనుకున్నది సాధించింది’ అని తండ్రి రతన్‌ సింగ్‌ రావు పొంగిపోతూ చెప్పాడు. మొత్తం మీద ఈ శీతాకాలం భారతీయ సౌందర్యానికి మంచి సంతోషాన్ని తెచ్చిందని చెప్పుకోవాలి.

‘పద్మావత్‌’ సినిమాలోని పాటకు నృత్యం చేస్తున్న సుమన్‌ రావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top