మూడో సోమవారం

Martin Luther King Jr. Day in the United States - Sakshi

మాధవ్‌ శింగరాజు
జనవరి నెలలోని మూడో సోమవారం అంటే అమెరికన్‌లలో చాలామందికి ఇష్టం ఉండదు! ‘ద మోస్ట్‌ డిప్రెసింగ్‌ డే ఆఫ్‌ ద ఇయర్‌’గా వాళ్లు ఫీలౌతారు. అప్పటికి క్రిస్మస్, న్యూ ఇయర్‌ అయిపోయి ఉంటాయి. ఆ రెండు రోజుల కోసం చేసిన అప్పులేవైనా ఉంటే అవి మిగిలి ఉంటాయి. కొత్త సంవత్సరపు తీర్మానాలు ఈ రెండు వారాల్లో బ్రేక్‌ అయి ఉంటాయి.

 అవన్నీ అలా ఉంచండి.. క్రిస్మస్‌లా, న్యూ ఇయర్‌లా.. ఎదురుచూడ్డానికి దగ్గర్లో ఇంకే పండుగలూ ఉండవు. అందుకని జనవరి మూడో సోమవారాన్ని ‘బ్లూ మండే’ అంటాడు క్లిఫ్‌ ఆర్నల్‌ అనే సైకాలజిస్టు. అంటే దిగుళ్ల సోమవారం అని. మనుషుల్లో స్ట్రెస్‌ లెవల్స్‌ పెరగడం మొదలయ్యే రోజట అది. ‘ఇ ఈక్వల్స్‌ టు ఎంసీ స్క్వేర్‌’ లాంటి లెక్కలేవో ఆయనకు ఉన్నాయి. 

ఆ లెక్కల్ని పక్కన పెడితే, అమెరికాలో ఇవాళ నేషనల్‌ హాలిడే! నేషనల్‌ హాలిడే ఎందుకంటే ఇవాళ అక్కడ ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ డే’. అమెరికాలో నల్లజాతి హక్కుల కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ని గుర్తు చేయడం కోసం (గుర్తు చేయడానికి, గుర్తు చేసుకోడానికి తేడా ఉంది) యేటా ప్రతి మూడో సోమవారం ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ డే’ని జరుపుతోంది అమెరికా. 

(జరపడానికి, జరుపుకోడానికి తేడా ఉంది).
ఈ ఏడాది మార్టిన్‌ డే, మార్టిన్‌ బర్త్‌డే రెండూ ఒకేరోజు వచ్చాయి. జనవరి 15 మార్టిన్‌ బర్త్‌డే. మరి మార్టిన్‌ బర్త్‌డే నే, మార్టిన్‌ డే గా ప్రకటించవచ్చు కదా! ప్రకటించవచ్చు కానీ, ఎందుకనో అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ జనవరిలో వచ్చే మూడో సోమవారాన్ని ‘మార్టిన్‌ లూథర్‌ డే’ పేరిట జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. 1983లో ఆయన ఆ హాలిడే బిల్లు మీద సంతకం చేస్తే, 1986 జనవరి మూడో సోమవారం తొలిసారిగా అమెరికాలో హాలిడే అమల్లోకి వచ్చింది. అయితే అమెరికాలోని మెజారిటీ రాష్ట్రాలు ‘మార్టిన్‌ లూథర్‌ డే’ ని గుర్తించలేదు! కొన్ని రాష్ట్రాలైతే, లూథర్‌ డే అని కాకుండా, ఇంకేదైనా పేరు పెడితేనే గుర్తిస్తాం అని పట్టుపట్టి కూర్చున్నాయి! 2000 నాటికి గానీ అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ కలసి ‘మార్టిన్‌ లూథర్‌ డే’ని నేషనల్‌ హాలిడేగా అంగీకరించలేకపోయాయి.

 బిల్లు మీద సంతకం పెట్టడానికి ముందు రొనాల్డ్‌ రీగన్‌ మనసు కూడా అందుకు అంగీకరించలేదు! మనసొప్పక, నల్లవాళ్లను నొప్పించలేక సంతకం పెట్టేశారు. 
‘ది మోస్ట్‌ డిప్రెసింగ్‌ డే ఆఫ్‌ ది ఇయర్‌గా’ జనవరిలో వచ్చే మూడో సోమవారాన్ని బలపరచడానికి ‘మార్టిన్‌ డే’ని కూడా ఒక కారణంగా చూపే తెల్ల అమెరికన్‌లు కూడా అక్కడ లేకపోలేదు. కనీస హక్కుల్ని సైతం పొందలేక.. డేస్, ఇయర్స్‌ మాత్రమే కాదు.. పుట్టినప్పట్నుంచీ డిప్రెసింగ్‌ లైఫ్‌నే గడుపుతున్న నల్లజాతి అమెరికన్‌ పౌరుల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారుడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ని అమెరికన్‌ జాతీయులు ఈ మాత్రంగానైనా అంగీకరించడానికి చాలా సమయమే పట్టింది. 

 ‘‘ఓ రోజు వస్తుంది. ఆ రోజు అమెరికాలో నల్లవారందరికీ స్వేచ్ఛ, తెల్లవారందరితో సమానత్వం అనే నా కల నిజమౌతుంది’’ అన్నారు మార్టిన్‌.. ‘ఐ హ్యావ్‌ ఎ డ్రీమ్‌’ అనే ప్రసంగంలో. మొన్న శుక్రవారం నాడు వైట్‌హౌస్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌.. ‘మార్టిన్‌ డే’ ఉద్ఘోషణ (ప్రొక్లమేషన్‌) మీద లాంఛనంగా సంతకం పెట్టిన రెండు రోజులకే, ఆఫ్రికా దేశాల పౌరులను ఉద్దేశించి ‘షిట్‌హోల్స్‌’ అనడం చూస్తుంటే, మార్టిన్‌ కల పూర్తిగా నిజం ఫలించిందా అన్న సందేహం కలుగుతుంది.

 మనసులో చీకటిని పెట్టుకుని ఎన్ని దీపాలను వెలిగిస్తే మాత్రం ఏమిటి? మనిషి మీద గౌరవం లేకుండా ఎన్ని ‘డే’లు జరిపితే మాత్రం ఏముంది?

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top