కందకాలే కరువుకు విరుగుడు!

Mango production and drip irrigation - Sakshi

కరువు కోరల నుంచి రైతులను రక్షించడానికి వ్యవసాయ భూముల్లో కందకాలు తీసుకోవడమే ఉత్తమ మార్గమనడానికి ప్రబల నిదర్శనం తన మామిడి తోటేనని నీటిపారుదల శాఖ విశ్రాంత చీఫ్‌ ఇంజినీర్‌ సంగెం చంద్రమౌళి స్వానుభవంతో తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామపరిధిలో 3.5 ఎకరాల భూమిని గత ఏడాది వేసవిలో కొనుగోలు చేశారు. 500–650 అడుగుల లోతున రెండు బోర్లు వేసినా.. డస్ట్‌ తప్ప నీటి చుక్క కానరాలేదు. వాన నీటిని సంరక్షించుకుంటే తప్ప నీటి భద్రత సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చారు. పొలంలో ప్రతి 50 మీటర్లకు ఒక చోట వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పున 2017 మేలో కందకాలు తవ్వించారు. ఎకరానికి రూ. 5 వేల వరకు ఖర్చయింది. వర్షాలు కురవడంతో కందకాల ద్వారా వర్షపు నీరు పుష్కలంగా భూమిలోకి ఇంకింది.

భూగర్భ జలమట్టం పెరిగింది. నీటి కొరత తీరడంతో గత జూలైలో మామిడి మొక్కలు నాటారు. డ్రిప్‌ ద్వారా పొదుపుగా నీటిని అందిస్తున్నారు. గెస్ట్‌ హౌస్‌ కూడా నిర్మించారు. అయినా, ఇంత వేసవిలోనూ నీటి కొరత లేదని చంద్రమౌళి సంతోషంగా చెప్పారు.  పొలాల్లో కురిసి వృథాగా పోతున్న వర్షపు నీటిని ఎక్కడికక్కడ భూమి లోపలికి ఇంకించుకుంటే ప్రతి రైతూ కరువును విజయవంతంగా అధిగమించవచ్చని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అయిన సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్‌ రెడ్డి (రిటైర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌) గత కొన్నేళ్లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘సాక్షి’తో కలసి గతంలో వరుసగా రెండేళ్లు తెలుగు రాష్ట్రాల్లో ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమాన్ని నిర్వహించి వేలాది మంది రైతుల్లో చైతన్యం నింపిన సంగతి తెలిసిందే. వేలాది ఎకరాల్లో పొలాలను స్వయంగా పరిశీలించి కందకాలు తవ్వించిన చంద్రమౌళి తన పొలంలోనూ కందకాలు తవ్వించి రైతులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారు.

ఎకరానికి రూ. 5 వేలు చాలు..
సాగు యోగ్యమైన భూముల్లో తెలంగాణ రాష్ట్రమంతటా ఎకరానికి రూ. 5వేల ఖర్చుతో కందకాలు తవ్వడానికి రూ. 8 వేల కోట్లు ఖర్చవుతుందని, వృథాగా పోతున్న 850 టీఎంసీల నీటిని భూమిలోకి ఇంకింపజేయవచ్చని ఆయన అంటున్నారు. భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కలిపి అందించే నీరు 600 టీఎంసీలేనన్నారు. ఎకరానికి పంటకు రూ. 4 వేల చొప్పున రైతుకు పెట్టుబడిగా ఇస్తున్న ప్రభుత్వం.. ప్రతి రైతూ కందకాలు తవ్వుకోవడం తప్పని సరి చేస్తే ఒక్క ఏడాదిలోనే సాగునీటి భద్రత చేకూరుతుందని ఆయన సూచిస్తున్నారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌లోని సాగు యోగ్యమైన భూములన్నిటిలో కందకాలు తవ్విస్తే రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని, 950 టీఎంసీల నీటిని భూమిలోకి ఎక్కడికక్కడ ఇంకింపజేయవచ్చని చంద్రమౌళి (98495 66009) సూచిస్తున్నారు.


        చంద్రమౌళి మామిడి తోటలో కందకం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top