గుడ్డట్టు

 Make egg experiments

అదే గుడ్డు.. అదే ఆమ్లేట్‌!
రొటీన్‌గా గుడ్డుని పెనం మీద పగలగొట్టేస్తుంటే..
ఒంటికి పదమూడు గ్రాముల ప్రోటీన్‌లు తప్ప..
నోటికేం మిగులుతుంది.. టేస్టూ!!
తిన్నామంటే తిన్నాం అనుకోకండి.
తినడానికే ఉన్నాం అనుకుని.. ప్రయోగాలు చెయ్యండి.
ప్లేటు నిండా గుడ్డట్టు వేసుకోండి.

చైనీస్‌ ఆమ్లెట్‌
కావలసినవి: క్యారట్‌ – ఒకటి (చిన్నది), బీన్స్‌– రెండు(చిన్నవి), కోడిగుడ్లు – రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక టీ స్పూన్, ఉల్లిపాయ – ఒకటి ( చిన్నది), పచ్చిమిర్చి – ఒకటి, ఉప్పు – తగినంత,
పెప్పర్‌ – ఒక టీ స్పూన్,  నూనె లేదా నెయ్యి– రెండు టేబుల్‌ స్పూన్లు.
తయారి : క్యారట్‌ సగం దుంపను పొడవుగా తురిమి గార్నిషింగ్‌ కోసం పక్కన ఉంచాలి. మిగిలిన సగాన్ని చిన్నగా (ఆమ్లెట్‌లో కలిసేటట్లు) తురమాలి. బీన్స్, ఉల్లిపాయలను సన్నగ తరగాలి. ఒక కప్పులో ఉల్లిపాయ, బీన్స్‌ ముక్కలు, తురిమిన క్యారట్, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరప్పొడి, ఉప్పు, పెప్పర్‌ వేసి కలపాలి. ఇందులో కోడిగుడ్డు సొన వేసి నురగ వచ్చే వరకు బీట్‌చేయాలి. ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె వేసి కాగిన తర్వాత కోడిగుడ్డు మిశ్రమాన్ని పెద్ద గరిటెతో కొంత భాగాన్ని మాత్రమే వేయాలి. దీనిని పలుచగా చేయకుండా మందంగానే ఉంచి సన్న మం మీద కాలనివ్వాలి. అప్పుడే లోపల ఉన్న క్యారట్, బీన్స్‌ మెత్తబడతాయి. మీడియం లేదా హై ఫ్లేమ్‌ మీద కాలిస్తే ఇవి ఉడికేలోపుగా ఆమ్లెట్‌ మాడిపోతుంది. రెండువైపులా కాల్చి తీసేయాలి. ఇలా మరికొంత నూనెను వేసి మిగిలిన మిశ్రమాన్ని కూడా కాల్చాలి. ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత పొడవుగా తురిమిన క్యారట్‌తో గార్నిష్‌ చేయాలి.

టొమాటో  ఆమ్లెట్‌
కావలసినవి:  టొమాటోలు – రెండు (మీడియం సైజువి), కోడిగుడ్లు – రెండు, పచ్చిమిర్చి – రెండు, ఉప్పు – రుచికి తగినంత,  పసుపు – చిటికెడు, నూనె లేదా నెయ్యి – ఒక టేబుల్‌ స్పూన్‌.
తయారి: ఒక టొమాటోను చిన్న ముక్కలుగా తరగాలి. ఒక టొమాటోను చక్రాలుగా తరగాలి. పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. టొమాటో, మిర్చి ముక్కలను ఒక కప్పులో వేసి అందులో ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఇవి సమంగా కలిసిన తర్వాత కోడిగుడ్లను కొట్టి సొన వేయాలి. కోడిగుడ్డు సొనతో టొమాటో, మిర్చి ముక్కలు సమంగా కలిసి, నురగ వచ్చే వరకు ఎగ్‌బీటర్‌తో కలపాలి. బీటర్‌కు బదులుగా ఫోర్క్‌తో కాని స్పూన్‌ తో కాని ఎక్కువ సేపు చిలకాలి. బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగిన తర్వాత ముందుగా కలిపి ఉంచిన మిశ్రమాన్ని అందులో వేసి మీడియం ఫ్లేమ్‌లో కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి రెండవ వైపు కాల్చాలి. దీనిని ప్లేట్‌లోకి తీసుకుని చక్రాలుగా తరిగిన టొమాటో ముక్కలతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేయాలి.

క్యాప్సికమ్‌ ఆమ్లెట్‌
కావలసినవి: క్యాప్సికమ్‌ – ఒకటి, ఉల్లిపాయ – ఒకటి కోడిగుడ్లు – రెండు,  ధనియాల పొడి – ఒక టీ స్పూన్, వైట్‌ పెప్పర్‌ – అర టీ స్పూన్, మిరప్పొడి – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు, ఉప్పు– రుచికి తగినంత, నూనె – ఒక టేబుల్‌ స్పూన్‌.
తయారి:  క్యాప్సికమ్‌లో సగభాగాన్ని చిన్న ముక్కలుగానూ, మిగిలిన సగాన్ని పొడవుగానూ తరగాలి. ఉల్లిపాయలను సన్నటి ముక్కలుగా తరగాలి. ఒక కప్పులో ఉల్లిపాయ ముక్కలు,చిన్నగా తరిగిన క్యాప్సికమ్‌ ముక్కలను వేసి అందులో వైట్‌పెప్పర్, ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు వేసి కలపాలి. పొడులన్నీ ముక్కలకు సమంగా పట్టిన తర్వాత కోడిగుడ్డు సొన వేసి నురగ వచ్చే వరకు బీట్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని కాగిన నూనెలో పోసి మీడియం ఫ్లేమ్‌లో కాలనివ్వాలి. రెండు వైపులా కాలిన తర్వాత సర్వింగ్‌ ప్లేట్‌లోకి తీసుకుని పొడవుగా తరిగి ఉంచిన క్యాప్సికమ్‌తో గార్నిష్‌ చేయాలి.

చీజ్‌ ఆమ్లెట్‌
కావలసినవి: చీజ్‌ – రెండు స్లైస్‌లు, ఉల్లిపాయ – ఒకటి, వైట్‌ పెప్పర్‌ – ఒక టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, కొత్తిమీర – చిన్న కట్ట, కోడిగుడ్లు – రెండు.
తయారి: ఉల్లిపాయను సన్నగా తరగాలి. కొత్తిమీరను కాడలు లేకుండా ఆకులను మాత్రమే తీసుకోవాలి. వీటిని సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కలతో కలపాలి. అందులో వైట్‌ పెప్పర్, ఉప్పు వేసి కలిపిన తర్వాత కోడిగుడ్డు సొన వేసి కలపాలి. చివరగా ఒక చీజ్‌ స్లైస్‌ను తురిమి కాని సన్నగా తరిగి కాని అందులో వేసి బీట్‌ చేయాలి. మరొక చీజ్‌ స్లైస్‌ను నాలుగు ముక్కలు చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగిన తర్వాత కలిపిన మిశ్రమాన్ని పోసి కాలనివ్వాలి. ఒక వైపు కాలిన తర్వాత తిరగేసి కాల్చాలి. దీనిని ప్లేట్‌లోకి తీసుకుని పక్కన ఉంచిన చీజ్‌ ముక్కలతో అలంకరించాలి.

పనీర్‌ ఆమ్లెట్‌
కావలసినవి: పనీర్‌ – 25 గ్రా, కోడిగుడ్లు – రెండు, ఉప్పు – రుచికి తగినంత, వైట్‌పెప్పర్‌ – ఒక టీ స్పూన్, ఏలకుల పొడి – అర టీ స్పూన్, కొత్తిమీర – చిన్న కట్ట, నెయ్యి – ఒక టేబుల్‌ స్పూన్‌.
తయారి: పనీర్‌ క్యూబ్‌లో సగాన్ని గార్నిషింగ్‌ కోసం ఉంచి మిగిలిన సగాన్ని ఆమ్లెట్‌లో వేయాలి. గార్నిషింగ్‌ కోసం కొంత డైమండ్‌ ఆకారంలో కట్‌ చేసి, కొంత తురిమి పక్కన ఉంచాలి. ఆమ్లెట్‌లో వేయాల్సిన దానిని సన్నగా (ఆమ్లెట్‌ కోసం ఉల్లిపాయ ముక్కలు తరిగినంత సన్నగా) తరగాలి. కొత్తిమీరను కాడలు లేకుండా ఆకులు మాత్రమే తీసుకుని సన్నగా తరిగి పనీర్‌ ముక్కలతో కలపాలి. అందులో ఉప్పు, వైట్‌పెప్పర్, ఏలకుల పొడి వేసి కలిపిన తర్వాత కోడిగుడ్డు సొన వేయాలి. దీనికి మిరప్పొడి కాని పచ్చిమిర్చి కాని వేయకూడదు. కోడిగుడ్డు సొన నురగ వచ్చే వరకు బీట్‌ చేయాలి. బాణలిలో నెయ్యి వేసి కాగిన తర్వాత కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసి రెండు వైపులా కాలనివ్వాలి. ప్లేట్‌లో వేసి తురిమిన పనీర్‌ను సమంగా పరిచి, పనీర్‌ ముక్కలతో గార్నిష్‌ చేయాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top