ద్వీపంలో ఒంటరి పసిపాప

Lonely baby on the island - Sakshi

బ్రెజిల్‌ 

ఫెర్నాండో డి నొరోన్హా! ప్రకృతి అందాలన్నీ ఒకేచోట కలబోసుకున్న ద్వీపం. బీచ్‌ అందాలు, పక్షుల కువకువలు, నీటిని వెదజల్లే జలచరాలు.. జలప్రకృతికి నెలవు ఈ ప్రాంతం. ఇక్కడి ఈ ప్రాణులను కాపాడుకుంటారు స్థానికులు. అందుకే ఇక్కడ సంతానాన్ని కనకూడదు. కంటే అది నేరం కూడా! సుమారుగా పన్నెండేళ్లుగా ఫెర్నాండో డి నొరోన్హా ద్వీపంలో ఒక్క నవజాత శిశువు కూడా లేదు. బ్రెజిల్‌ పరిధిలోని ఈ ద్వీపంలో ఉన్న నిషేధాజ్ఞల కారణంగా ఇక్కడ ఎవ్వరూ పిల్లల్ని కనడం లేదు. నాటల్‌ నగరానికి 370 కి.మీ. దూరంలో ఉంటుంది ఫెర్నాండో డి నొరోన్హా.  సుమారు మూడువేల మంది జనాభా ఉన్నారు. కాని ఒక్క ప్రసూతి కేంద్రం కూడా లేదు. అనుకోకుండా మొన్న శనివారంనాడు ఆ ద్వీపంలో ఒక ఆడశిశువు జన్మించింది. ‘నేను గర్భవతిని అని కూడా నాకు తెలీదు. బిడ్డ పుట్టేసరికి అవాక్కయ్యాను’ అంటోంది ఆ తల్లి! కొన్ని కారణాల దృష్ట్యా ఆమె పేరును బయటికి వెల్లడించలేదు. ఆ తల్లి వయసు 22 సంవత్సరాలు.  ‘‘శుక్రవారం రాత్రి నాకు నొప్పులు వచ్చాయి. నేను బాత్‌రూమ్‌కి వెళ్లాను. నా శరీర భాగాలకు ఏదో అంటుకుని ఉందన్న భావన కలిగింది. ఇంతలో నా భర్త అక్కడకు వచ్చాడు. అలా అంటుకుని ఉన్నది పసిపాప అని అర్థం చేసుకున్నాం. ఒక్కసారిగా అచేతనురాలినయ్యాను. సృష్టిలో ఏ స్త్రీ అయినా తాను తల్లి కావాలని కలలు కంటుంది. కానీ నేను తల్లిని కాకూడదు అని మా ప్రాంతం చెబుతోంది’ అంటోంది తల్లి.

బిడ్డను వెంటనే ఆ ద్వీపానికి బయట ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బయటకు కనపడటానికి ఇష్టం లేని ఆ తల్లి, ఇంట్లోనే ఉండిపోయి తలుపులు వేసుకుంది. ‘‘మాకు తను గర్భవతి అనే విషయమే తెలీదు’ అంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. ఈ అరుదైన పుట్టుకను ఆ కుటుంబ సభ్యులే కాదు, ఆ ద్వీపవాసులంతా పండుగ చేసుకుంటున్నారు. ఇరుగుపొరుగు వారంతా చంటిపాపకు బట్టలు తీసుకువస్తున్నారు. ఫెర్నాండో డి నొరోన్హా వన్యప్రాణి జీవనానికి ప్రసిద్ధి. ఇక్కడ అభయారణ్యాలు ఉన్నాయి. సముద్రపు తిమింగలాలు, డాల్ఫిన్లు, అరుదైన పక్షులు ఉన్నాయి ఈ కారణంగానే.. వాటికి హాని కలగకూడదనీ, అవి స్వేచ్ఛగా ఎదగాలనీ మానవ జనాభా నియంత్రణను నిరంకుశంగా పాటిస్తున్నారు. చివరిగా.. ఒక సందేహం ఏంటంటే.. స్త్రీకి తను గర్భిణి అని తెలీకుండా ఉంటుందా? లేక ఆ అజ్ఞాత గర్భిణి తను ఉంటున్న ద్వీపంలోనే బిడ్డకు జన్మనివ్వాలని బలంగా కోరుకుని అలా అబద్ధం చెప్పిందా? దీనిపై దర్యాప్తు కూడా మొదలైంది. 
– రోహిణి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top