అష్ట ఇష్ట  నైవేద్యాలు

kanaka durgamma Offerings special - Sakshi

ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు వారికి ఏమేమి పదార్థాలు ఇష్టమో అడిగి తెలుసుకుని వండి ప్రేమగా వడ్డిస్తాం. ఇవి దసరా నవరాత్రులు. అమ్మవారు మన ఇంటికి అతిథిగా అడుగుపెట్టారు. మరి ఆమెకు ఏమేమి ఇష్టమో తెలుసుకుని రుచిగా శుచిగా వండి, భక్తి శ్రద్ధలతో ఆమెకు నివేదిస్తే ఎంత బాగుంటుంది? ఆమెకు ఇష్టమైనవాటిని లలితా సహస్రంలో వర్ణించారు. వాటినే మేము ఇక్కడ మీకోసం వండాం... 
ఇంకెందుకాలస్యం? మీరూ ప్రయత్నం చేయండి... అమ్మవారికి ఆరగింపు చేయండి.

1 గుడాన్నం (బెల్లం అన్నం) (గుడాన్న ప్రీత మానసా)
కావలసినవి: బాస్మతి బియ్యం – 400 గ్రా.; బెల్లం పొడి – 250 గ్రా; లవంగాలు – 4; నీళ్లు – 4 కప్పులు; నెయ్యి – 100 గ్రా; ఏలకుల పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు; బాదం పప్పుల తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ: ∙ఈ రుచికరమైన వంటకాన్ని తయారు చేయడానికి ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు అరగంటసేపు నానబెట్టాలి ∙ఒక పెద్ద గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసి, స్టౌ మీద సన్నటి మంట మీద నీళ్లు మరిగించాలి ∙నీళ్లు బాగా మరిగిన తరవాత బియ్యం వేసి కలియబెట్టాలి 
∙బియ్యంతో పాటు లవంగాలు కూడా వేయాలి ∙అన్నం మెత్తగా ఉడికిన తరవాత గంజి ఉంటే వార్చేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙బాదం పప్పుల తరుగు వేసి దోరగా వేయించాక, బెల్లం పొడి జత చేసి బాగా కలపాలి ∙బెల్లం బాగా కరిగిన తరవాత ఏలకుల పొడి వేసి కలిపి, ఉడికించిన అన్నం కూడా వేసి కలియబెట్టాలి ∙అన్నం గోధుమరంగులోకి వచ్చేవరకు కలిపి, మూత పెట్టి ఏడెనిమిది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙అమ్మవారికి తియ్యని కమ్మని నైవేద్యం సమర్పించి ఆ తల్లి కృపకు పాత్రులవుదాం. 

కొబ్బరి అన్నం(స్నిగ్ధౌదన ప్రియా)

కావలసినవి:  బియ్యం – అరకిలో; నెయ్యి – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు ; ఆవాలు – ఒక టీ స్పూను ; జీలకర్ర – ఒక టీ స్పూను ; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను ; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5 ; ఇంగువ – చిటికెడు ; కరివేపాకు – రెండు రెమ్మలు ; పచ్చిమిర్చి – 5; కొత్తిమీర – తగినంత; ఉప్పు – తగినంత ; జీడి పప్పులు – 10

తయారీ: ∙బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి అన్నం వండి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙పచ్చి కొబ్బరి తురుము వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో జీడి పప్పులు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ∙మరి కాస్త నెయ్యి వేసి కరిగాక, ఆవాలు వేసి చిటపటలాడాక జీలకర్ర, పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ  వేసి వేయించాలి ∙పోపు బాగా వేగిన తరవాత తరిగిన పచ్చిమిర్చి వేసి మరోమారు వేయించి తీసేయాలి ∙ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి, వేయించిన పచ్చి కొబ్బరి మిశ్రమం, తాలింపు, వేయించిన జీడి పప్పులు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙చివరగా కొత్తిమీరతో అలంకరించి, అమ్మవారికి నివేదన చేసి, మనస్ఫూర్తిగా ప్రార్థించి అమ్మ ప్రసాదంగా స్వీకరించాలి.

క్షీరాన్నం (పాయసాన్న ప్రియా)
కావలసినవి: కొత్త బియ్యం – అర కప్పు; పాలు – 3 కప్పులు; నెయ్యి – పావు కప్పు; బెల్లం పొడి – అరకప్పుకి కొద్దిగా తక్కువ; నీళ్లు – ముప్పావు కప్పు; జీడిపప్పులు – 10; బాదం పప్పులు – 5; కిస్‌మిస్‌ – 10; ఏలకుల పొడి – పావు టీ స్పూను

తయారీ: ∙ఒక పాత్రలో బెల్లం పొడి, పాలు పోసి స్టౌ మీద ఉంచి బెల్లం కరిగించి, వడబోసి పక్కన ఉంచాలి ∙మందపాటి బాణలిని స్టౌ మీద ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి ∙జీడి పప్పులు, బాదం పప్పులు, కిస్‌మిస్‌ జత చేసి వేయించి తీసిపక్కన ఉంచాలి ∙అదే నేతికి బియ్యం జత చేసి దోరగా వచ్చేవరకు వేయించి తీసేయాలి ∙ బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ∙ అన్నం బాగా ఉడికిన తరవాత బెల్లం పాకం జత చేస్తూ ఆపకుండా కలుపుతుండాలి ∙మిశ్రమం బాగా దగ్గరపడేవరకు కలపాలి ∙మిగిలిన నేతిని జత చేయాలి ∙ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్‌ జత చేసి బాగా కలిపి దింపేయాలి ∙అమ్మవారికి నివేదించి ప్రసాదంగా సేవించాలి. 

తేనె గారెలు(మధు ప్రీతా)
కావలసినవి: మినప్పప్పు – రెండు కప్పులుఉప్పు – చిటికెడుతేనె – తగినంతనూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా
తయారీ: ∙మినప్పప్పును బాగా కడిగి, తగినన్ని నీళ్లు జతచేసి సుమారు నాలుగు గంటలపాటు నానబెట్టాలి ∙నీళ్లు ఒంపేసి, గ్రైండర్‌లో వేసి నీళ్లు ఎక్కువ పోయకుండా గట్టిగా రుబ్బుకోవాలి ∙బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి కాచాలి ∙పిండికి ఉప్పు జతచేసి కలపాలి ∙చేతికి తడి చేసుకుని కొద్దిగా పిండిని అరటి ఆకు మీద గారె మాదిరిగా ఒత్తి, కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి ∙తయారుచేసుకున్న గారెల మీద తేనె వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీర్వాదం పొందాలి.

దద్ధ్యోదనం(దధ్ద్యన్నాసక్త హృదయా)
కావలసినవి: బియ్యం – పావు కిలో; పాలు – అర లీటరు; చిక్కటి పెరుగు – అర లీటరు; ఉప్పు – తగినంత ; నూనె – అర కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీస్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను ; ఎండు మిర్చి – 4 ; ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – రెండు రెమ్మలు ; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను; జీడి పప్పులు – 10 ; కొత్తిమీర – కొద్దిగా; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు

తయారీ: ∙బియ్యం శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి అన్నం వండి పక్కన ఉంచాలి ∙ ఒక పాత్రలో పాలు పోసి కాచి చల్లార్చాలి ∙ అన్నం బాగా చల్లారాక ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి ∙అందులో కాచి చల్లార్చిన పాలు, చిక్కటి పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాచాలి ∙ అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙పెరుగు కలిపిన అన్నంలో పోపు, వేయించిన జీడిపప్పులు వేసి కలియబెట్టాలి ∙చివరగా అల్లం తురుము, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర వేసి బాగా కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ∙ ఆ తల్లి దీవెనలు అందుకుని ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని ప్రార్థించాలి.

పొంగల్‌ (ముద్గౌదనాసక్త హృదయా)
కావలసినవి: పెసరపప్పు – 150 గ్రా.; కొత్త బియ్యం – 100 గ్రా.; మిరియాలు – 15 (పొడి చేయాలి); పచ్చి మిర్చి – 6; పచ్చి కొబ్బరి – ఒక కప్పు; నెయ్యి – పావు కప్పు; జీడిపప్పులు – 15; జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – పావు టీ స్పూను; ఎండుమిర్చి – 3; మినప్పప్పు + సెనగ పప్పు – 2 టేబల్‌ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు తగినంత ; ఇంగువ – కొద్దిగా

తయారీ: ∙దళసరి పాత్రలో కొద్దిగా నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి ∙పెసర పప్పు వేసి దోరగా వేయించాలి ∙బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన తరువాత బియ్యం కూడా వేసి సుమారు ఐదు నిమిషాల పాటు బాగా వేయించి (తెలుపు రంగు పోకూడదు) తీసి పక్కన ఉంచుకోవాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కరిగాక, మిరియాల పొడి వేసి వేయించాక, జీడిపప్పులు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు, సన్నగా తరిగిన పచ్చి మిర్చి, పచ్చి కొబ్బరి, వేయించిన బియ్యం, పెసరపప్పు ఇవన్నీ వేసి కుకర్‌లో వుంచి మూడు విజిల్స్‌ వచ్చేవరకు ఉంచి దింపేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి ∙అందులో ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాక, తయారుచేసి ఉంచుకున్న పొంగలిలో వేయాలి ∙ఉప్పు వేసి బాగా కలియబెట్టి, కొత్తిమీరతో అలంకరించి, వేడి వేడి ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ∙‘మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ’ అని ప్రార్ధించాలి  

పులిహోర(హరిద్రాన్నైక  రసికా)
కావలసినవి: బియ్యం – అర కేజీ; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్‌ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; పచ్చి మిర్చి – 4; నూనె – 100 గ్రా.; పల్లీలు – 100 గ్రా.; ఇంగువ – మూడు రెమ్మలు; పసుపు – తగినంత; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – ఒక టేబుల్‌ స్పూను (పులుపు చాలకపోతే మరి కాస్త రసం జత చేయాలి)

తయారీ: ∙బియ్యం శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి, వెడల్పాటి పాత్రలో పోసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, పల్లీలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించి, అన్నంలో వేసి కలపాలి ∙పసుపు, ఉప్పు, నిమ్మరసం జతచేసి మరోమారు బాగా కలిపి అమ్మవారిని నివేదన చేసి, ప్రసాదంగా సేవించాలి.

కదంబం (సర్వౌదన ప్రీత చిత్తా)
కావలసినవి: కంది పప్పు – అర కప్పు; కొత్త బియ్యం – అర కప్పు; వంకాయ ముక్కలు, సొర కాయ ముక్కలు, దోస కాయ ముక్కలు, బీన్స్‌ తరుగు, బంగాళ దుంప ముక్కలు, క్యారెట్‌ తరుగు, టొమాటో తరుగు –  అన్నీ కలిపి రెండు కప్పుల ముక్కలు; పల్లీలు – పావు కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర – తగినంత ; కరివేపాకు – రెండు రెమ్మలు; పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు ; పచ్చి మిర్చి – 4 (సన్నగా పొడవుగా తరగాలి); నెయ్యి – పావు కప్పు; చింతపండు గుజ్జు – పావు కప్పు (చిక్కగా ఉండాలి); బెల్లం పొడి – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – చిటికెడు; సాంబారు పొడి – 3 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; ఇంగువ – చిటికెడు

తయారీ ∙కాయగూరలను శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగాలి ∙బియ్యం, కందిపప్పులను శుభ్రంగా కడగాలి ∙కుకర్‌లో బియ్యం, కందిపప్పు, తరిగిన కూరగాయ ముక్కలు (టొమాటో వేయకూడదు), తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి స్టౌ మీద ఉంచి కాగాక, ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, ఇంగువ వేసి బాగా వేయించాలి ∙పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, టొమాటో తరుగు వేసి దోరగా వేయించాలి ∙ చింతపండు గుజ్జు, బెల్లం పొడి జత చేసి బాగా ఉడికించాలి ∙సాంబారు పొడి వేసి మరిగించాలి ∙బాగా ఉడికిన తరవాత ఆ గ్రేవీని ఉడికించిన బియ్యం, కందిపప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి మరోమారు కొద్దిసేపు ఉడికించాలి ∙ చివరగా కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఒకసారి ఉడికించి దింపేయాలి ∙వేడి నెయ్యి జత చేసి, అమ్మవారికి నివేదన చేసి ఆ తల్లి దీవెనలు పొందుదాం. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top