డ్రైవర్‌ రుసరుస... జ్యోతిక విలవిల! | jyothika new movie nachhiyar | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌ రుసరుస... జ్యోతిక విలవిల!

Nov 26 2017 12:04 AM | Updated on Nov 26 2017 12:04 AM

jyothika new movie nachhiyar - Sakshi

‘చంద్రముఖి’ సినిమాలో నటి జ్యోతికకు పట్టిన దయ్యాన్ని వదిలించడానికి ముగ్గులో కూర్చోబెడతాడు మాంత్రికుడు. ఆమె ఏవో పిచ్చిపనులు చేస్తూ, పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ‘‘పూర్తిగా చంద్రముఖిలా మారిన నీ భార్య గంగను చూడు’’... అంటూ డైలాగ్‌ కూడా చెబుతాడు ఆ సినిమాలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. చాలాకాలం తర్వాత మళ్లీ జ్యోతికకు అలాంటి సిట్యుయేషనే వచ్చింది. కాకపోతే కాస్త డిఫరెంటుగా! అప్పుడా మాంత్రికుడు ముగ్గులో కూర్చోబెడితే... ఇప్పుడో డ్రైవర్‌గారు ఆమెను కోర్టు ‘బోను’లో నిలబెట్టబోతున్నాడు.

ఆ డ్రైవర్‌ గారి పేరు రాజన్‌. ‘‘పూర్తిగా పోలీస్‌లా మారినట్టుగా మాట్లాడుతున్న జ్యోతికను చూడు’’ అంటూ డైలాగ్‌ చెప్పడం ఒక్కటే రాజన్‌ చేయడం లేదంతే. మిగతాదంతా ‘సేమ్‌ టు సేమ్‌’! అప్పుడా మంత్రగాడు బెత్తంతో వడ్డిస్తే ఇప్పుడీ డ్రైవర్‌సాబ్‌ చట్టం చేత చీవాట్లు పెట్టించే పనిలో ఉన్నాడు. మరి జ్యోతిక ఏం చేసిందనీ? ఏమీ లేదు... ‘నాచ్చియార్‌’  అనే సినిమాలో నటిస్తోంది జ్యోతిక. గతంలో ‘సేతు’, ‘శివపుత్రుడు’ సినిమాలకు దర్శకత్వం వహించిన బాలా డైరెక్షన్‌లో ప్రస్తుతం ఈ సినిమా తయారౌతోంది. మరి పోలీస్‌ అన్నాక పవర్‌ఫుల్‌ పంచ్‌ డైలాగులు ఉండనే ఉంటాయి కదా. ఆ డైలాగుల్లో కొన్ని మహిళలను కించపరిచేలా ఉన్నాయట.

ఇటీవలే బయటకు వచ్చిన ఆ సినిమా తాలూకు టీజర్‌ చూశాక ఒళ్లు మండిపోయిందా డ్రైవర్‌కి. ‘ఠాట్‌... పవిత్రమైన పోలీస్‌ యూనిఫారంలో ఉండి, ఓ మహిళే అలా మహిళలను కించపరిచే మాటలు అనొచ్చా’... అంటూ కోప్పడి చిందులు తొక్కుతూ చిర్రుబుర్రులాడుతున్నాడు రాజన్‌. నిజం పోలీసులు వల్లించాల్సిన సెక్షన్‌లను తానే వల్లిస్తూ ‘ఐపీసీ సెక్షన్‌ 249బి తో పాటు ఐటీ చట్టం సెక్షన్‌ 67’ ప్రకారం ఇదొక నేరం యువరానర్‌’ అంటూ జ్యోతిక మీద పిటిషన్‌తో విరుచుకుపడ్డాడు. అంతే.. కేసులోని పూర్వాపరాలు విచారించి నివేదిక సమర్పించమంటూ కోర్టువారు మేట్టుపాళయం పోలీసులకు ఆదేశించినట్టు సమాచారం. దాంతో ప్రస్తుతం... ‘‘పోలీసులా నటిస్తున్న సాక్షాత్తూ నేనే ఎవరి మీదైనా సినిమా కేసు పెట్టాలిగానీ... నా పైనే నిజమైన కేసా? అతగాడెవరు నా మీద విసవిసలాడటానికి’’ అంటూ రుసరుసలాడుతోంది జ్యోతిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement