
కోలీవుడ్ నటుడు విజయ్, జ్యోతిక జంటగా నటించిన చిత్రం ఖుషి. నటి శిల్పాశెట్టి, ముంతాజ్ వేరువేరుగా 2 ప్రత్యేక పాటల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీ సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించారు. ఎస్‌జే. సూర్య కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఖుషీ చిత్రానికి దేవా సంగీతాన్ని, జీవా చాయాగ్రహణం అందించారు. చిన్న ఈగో ప్రధాన అంశంగా రూపొందిన ఈ యూత్‌ఫుల్ లవ్ కథా చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది.
25 ఏళ్ల తర్వాత ఖుషి చిత్రం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, డిజిటల్ ఫార్మెట్లో రూపొంది ఈనెల 25న రీ రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని శక్తి ఫిలిమ్స్ అధినేత శక్తివేల్ తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శనివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాదరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ విజయ్ మాస్ హీరోగా ఎదుగుతున్న సమయంలో రూపొందించిన క్లాసికల్ ప్రేమకథా చిత్రం ఖుషి అని చెప్పారు. తాను ఇంతకు ముందు విజయ్ హీరోగా నిర్మించిన గిల్లి చిత్రం రీ రిలీజ్ అయి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిందన్నారు.

అదేవిధంగా ఖుషీ చిత్రం కూడా రికార్డ్ కలెక్షన్లను సాధిస్తుందనే నమ్మకం ఉందని ఏఎం రత్నం అన్నారు. అదేవిధంగా ఖుషీకి సీక్వెల్ చేయాలన్న ఆలోచన కూడా కలుగుతోందని ఆయన చెప్పారు. అయితే ఎస్‌జే. సూర్య మాట్లాడుతూ ఖుషీకి సీక్వెల్ అనేది కాలమే నిర్ణయిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తెలుగులో పవన్ రీమేక్
ఖుషి సినిమా 2000 సంవత్సరంలో మొదట తమిళ్‌లో విడుదలైంది. అక్కడ భారీ విజయం అందుకున్న తర్వాత తెలుగులో పవన్ కల్యాణ్ రీమేక్ చేశారు. అయితే, కథ బాగుండటంతో దర్శకుడు ఎస్. జె. సూర్య హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్ వర్షన్‌లను ఒకేసారి ప్లాన్ చేశారని సమాచారం. అయితే, మొదట తమిళ్ వర్షన్ విడుదల అయింది. 2001లో తెలుగులో ఖుషి విడుదలైన విషయం తెలిసిందే.