శాంతిమయ జీవితం ఎక్కడ?
పంట చేతికి రాకపోతే పస్తులుండే వ్యవసాయ సమాజంలో పుట్టి పెరిగాడాయన.
	పంట చేతికి రాకపోతే పస్తులుండే వ్యవసాయ సమాజంలో పుట్టి పెరిగాడాయన. కరువులోనూ ముక్కుపిండి పన్నులు వసూలు చేసే రోమా నియంతృత్వ పాలనకు, యూదు మత పెద్దల దౌర్జన్యం, వేషధారణకు ఆయన ప్రత్యక్షసాక్షి, బాధితుడు కూడా. రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేప కూడా దొరక్క పస్తులుండే జాలరులు ఆయన అంటే యేసుప్రభువు ప్రియ శిష్యులు. యేసు బోధలు అయనెదుర్కొన్న కష్టాలు, సవాళ్లు ఒత్తిళ్ల నుండి వచ్చాయి కాబట్టే అవి ఆచరణాత్మకమైనవిగా ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. అందుకే అంత సాధికారికంగా, పరలోకపు తండ్రిగా దేవుడుండగా విశ్వాసులు అసలు చింతించవలసిన పని లేదన్న ఆయన బోధ విప్లవాత్మకమైనది.
	
	నిన్నటి తప్పిదాల అపరాధభావన, రేపటి సవాళ్ల తాలూకు అందోళన అనే ఇద్దరు దొంగల మధ్య, దేవుడిచ్చిన అత్యంత ఆశీర్వాదకరమైన ‘నేటిని’ సిలువ వేసుకొంటున్న అభాగ్యులం మనం. అలా మానవాళికి శాపంగా మారిన చింతను యేసు తూర్పారబట్టాడు. పరలోకపుతండ్రిగా దేవుని మానవాళికి పరిచయమవడం ద్వారా యేసుక్రీస్తు ‘చింతించడం’ వెనుక ఉన్నమహా రహస్యాన్ని ఛేదించాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను విశ్వసించినంత తేలికగా, సంపూర్ణంగా మానవాళి దేవుని పరలోకపు తండ్రిగా విశ్వసించకపోవడమే వారి చింతలన్నింటికీ మూలమని యేసు రోగనిర్ధారణ చేశాడు. ఇహలోకపు తండ్రిగా మనకు చాలా పరిమితులున్నాయి. కాబట్టి పిల్లల కోసం ఎన్నో చేయాలనుకున్నా అన్నీ చేయలేని అశక్తులం మనం. అయినా ‘తండ్రీ’ అన్న సంబోధనలోనే పిల్లలు ఎంతో స్వాంతన, ఆదరణ పొందుతారు. అలాంటప్పుడు సర్వశక్తిమంతుడైన దేవవుడే పరలోకపు తండ్రిగా ఉంటే అదెంత భాగ్యం? ‘దైవర్శనం’ కోసం పుణ్యస్థలాలకు, మహా దేవాలయాలకు వెళ్లే సంస్కృతి కొందరికి లాభకరంగా మారింది కాని సగటు విశ్వాసికి చాలా నష్టం చేసింది.
	
	దేవుడంటే అక్కడెక్కడో ఉండే అందుబాటులో లేని ‘దూరపుశక్తి’ అన్న భావనే విశ్వాసుల్లో అశాంతికి కారణమైంది. కాని దేవుడు నిరంతరం మనల్ని వెన్నంటి ఉండే పరలోకపు తండ్రి ‘అన్న భావనతో, నా జీవనపథంలో ఎంతటి ప్రతికూలతనైనా ఆయనే ఎదుర్కొంటాడన్న నిర్భయత్వం ఏర్పడుతుంది. సర్వశక్తిమంతుడైన దేవునికి పరిమితులే లేవు గనుక మన సమస్య ఎంత గడ్డుదైనా దానికి ఆయన వద్ద అద్భుతమైన పరిష్కారముంటుందననది ఆయన పిల్లలముగా మనకు కలిగే భరోసా! అదే మన జీవితాన్ని ‘నిశ్చింతల ద్వీపం’గా మార్చుతుంది. ఆలస్యమెందుకు? ఈ రోజే మీ చేయి పరలోకపు తండ్రి చేతిలో వేయండి. మీ చింతలన్నీ ఆయనకే ‘అప్‌లోడ్’ చేయండి!
	– రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
