వరుస మంటపాలు మంటప సముదాయం

An important part of the temple Mantapa - Sakshi

ఆలయం ఆగమం

ఆలయంలో ముఖ్యమైన భాగం ఈ మంటప సముదాయం.  ఒకే వరుసలో ఉండే మూడు మంటపాలనే  మంటప సముదాయం అంటారు. ఆ మంటపాల వరుస ఇలా ఉంటుంది. గర్భగుడి ముందు ఉండేది అర్ధమంటపం. దాని తర్వాత ముఖమంటపం, దాని తర్వాతది మహామంటపం. అర్ధమంటపానికీ గర్భగుడికీ మధ్యలో నిర్మించే పొడవైన ప్రవేశమార్గాన్ని అంతరాళం అంటారు. వాహనమంటపం దాటగానే అనేక స్తంభాలతో, పైకప్పుతో నిర్మించబడి ఉండే మంటపాన్ని మహామంటపం అంటారు. దానికి ముందుండేది ముఖమంటపం. గర్భగుడిపై నిర్మించబడినట్లుగానే ఈ మండపంపై కూడా కొన్నిచోట్ల విమాన శిఖరం ఉంటుంది. ఈ పద్ధతి ఉత్తరాది ఆలయాలలో ఉంది. మరికొన్ని చోట్ల మండపం పైన ఎటువంటి నిర్మాణమూ లేకుండా మూలల్లో మూలమూర్తి వాహనాలైన నంది, గరుడుడు, సింహం వంటివి కనిపిస్తాయి.

ఉదాహరణకు తిరుమలలో సింహాలను, శ్రీశైలంలో నందులను, శ్రీరంగంలో గరుడుని విగ్రహాలను చూడవచ్చు.శివాలయాల్లో ఈ ముఖమండపంలో నటరాజసన్నిధి ఉంటుంది. వైష్ణవాలయాల్లో (తిరుమలలో) ముఖమండపంలో స్నపన తిరుమంజనం (ఉత్సవమూర్తికి అభిషేకం) జరుపుతారు. ముఖమంటపం దాటాక అర్ధమంటపం ఉంటుంది. వైష్ణవసంప్రదాయంలో పన్నిద్దరు ఆళ్వారులు ఇక్కడే స్వామికి ఎడమవైపు కొలువుదీరి ఉంటారు. పూజాసామాగ్రి, నైవేద్యపదార్థాలు మొదలైనవి ఇక్కడ ఉంటాయి. కొన్ని ఆలయాలలో ఉత్సవ విగ్రహాలు కూడా అర్ధమంటపంలోనే ఉంటాయి.

భక్తులు మహామంటపంలోకి ప్రవేశించగానే భగవంతునికి చేరువవుతారు. ఈ మండపం స్తంభాలపై రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాలు, పురాణాలు, స్థలమహత్యం వంటివి శిల్పరూపంలో కనిపిస్తే, మహామంటపంలో అనేకమంది భక్తులు కూర్చుని భగవంతుని ధ్యానం చేసుకోవడం, స్తుతించడం, సామూహికంగా భజనలు చేయడం వంటి ధార్మిక ప్రవచనాలు జరుగుతాయి. మండపం ఆలయ పురుషుడి హృదయభాగం. మండపంలో కూర్చుని ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి.
కందుకూరి వేంకటసత్యబ్రహ్మాచార్య
ఆగమ, శిల్పశాస్త్ర పండితులు

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top