
మహిళలల్లో గర్భ సంచి తొలగింపు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం మరోసారి స్పష్టం చేసింది. మెనోపాజ్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన వివరాల ప్రకారం... రెండు అండాశయాలను అలాగే ఉంచి... గర్భాశయాన్ని మాత్రమే తొలగించిన సందర్భాల్లోనూ మహిళలకు గుండె జబ్బులు మొదలుకొని జీవక్రియ సంబంధిత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తప్పడం లేదు. ఇప్పటివరకూ అండాశయాల తొలగింపుతోనే సమస్యలన్న అంచనా ఉండేదని, తాజా అధ్యయనం అది తప్పని చెబుతోందని షానన్ లాగ్లిన్ టొమ్మాసో అనే శాస్త్రవేత్త తెలిపారు. మహిళల వయసు 35 ఏళ్ల కంటే తక్కువ ఉంటే వారికి ఈ సమస్యలు మరింత ఎక్కువ ఇబ్బందిపెట్టే అవకాశముందని తెలిపారు.
1980 –2002 మధ్యకాలంలో అండాశయాలను ఉంచి, గర్భాశయం మాత్రమే తొలగించిన రెండు వేల మంది మహిళల వివరాలను... రెండింటినీ తొలగించిన వారితో పోల్చి చూడటం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని వివరించారు. గర్భాశయం మాత్రమే తొలగించిన వారిలో 14 శాతం మందికి కొలెస్ట్రాల్ సమస్యలు ఎదురుకాగా, 13 శాతం మంది అధిక రక్తపోటు, 18 శాతం మంది ఊబకాయం, 33 శాతం మంది గుండెజబ్బులకు గురయ్యారని 35 ఏళ్ల లోపు వారిలో ఈ సమస్యలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని విరించారు. గర్భాశయ తొలగింపు విషయంలో మహిళలు మరింత జాగరూకతతో వ్యవహరించేందుకు ఈ అధ్యయనం ఉపకరిస్తుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు.