పరి పరిశోధన

Humans 'evolving gene' that may stop us drinking alcohol - Sakshi

తాగుడును దూరం చేసే జన్యుమార్పులు!
తాగుడు అలవాటును అధిగమించేలా మనిషి పరిణమిస్తున్నాడా? అవునంటున్నారు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. నేచర్‌ ఎకాలజీ అండ్‌ ఎవల్యూషన్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. మానవుల్లో ఏ రకమైన మార్పులు జరుగుతున్నాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం జరిపారు. ఇప్పటికే పూర్తయిన దాదాపు వెయ్యి జన్యుక్రమ ప్రాజెక్టుల సమాచారాన్ని ఇందుకోసం విశ్లేషించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన 2500 మంది డీఎన్‌ఏ వివరాలను పరిశీలించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి.

ఆఫ్రికా సంతతి వ్యక్తుల్లో మలేరియా వ్యాధికి నిరోధకత పెరుగుతూండగా, యూరోపియన్లలో ఒక అమినో యాసిడ్‌లో మార్పులు నమోదయ్యాయి. అలాగే నియాండెర్తల్‌ జాతికి సంబంధించిన మానవులతో కలవడం వల్ల వచ్చిన రెండు డీఎన్‌ఏ ముక్కలు అలాగే ఉన్నట్లు తెలిసింది. చివరగా ఏడీహెచ్‌ అనే జన్యువులో వచ్చిన మార్పు. ఈ జన్యువు శరీరంలో ఆల్కహాల్‌ డీహైడ్రోజనేస్‌ అనే ఎంజైమ్‌ తయారీకి ఉపయోగపడుతుంది. ఇది మద్యాన్ని విడగొట్టి అసిటాల్డీహైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ జన్యువులో వచ్చిన మార్పులు భవిష్యత్తులో శరీరాన్ని మద్యం ప్రభావం నుంచి రక్షించేదిగా ఉందని శాస్త్రవేత్తల అంచనా. మద్యాన్ని వేగంగా విడగొట్టడం ద్వారా తాగుబోతులకు జబ్బు పడిన అనుభూతిని ఇవ్వడం ద్వారా ఈ జన్యువు పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

యాంటీబయాటిక్‌ల ప్రభావాన్ని పెంచే కార్బన్‌ మోనాక్సైడ్‌!
కార్బన్‌ మోనాక్సైడ్‌ అనే వాయువు కారణంగా యాంటీబయాటిక్‌ మందుల ప్రభావం గణనీయంగా వృద్ధి చెందుతుందని జార్జియా  స్టేట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా చెబుతున్నారు. మెట్రోనైడజాల్‌ అనే యాంటీబయాటిక్‌కు కార్బన్‌ మోనాక్సైడ్‌ను జోడించి ప్రయోగించినప్పుడు హెచ్‌.పైలోరీ రకం బ్యాక్టీరియా వేగంగా నాశనమైందని వీరు జరిపిన ప్రయోగాల ద్వారా స్పష్టమైంది. కడుపులో పుండ్లు అయ్యేందుకు ఈ హెచ్‌.పైలోరీ కారణమవుతుందన్నది తెలిసిన విషయమే. కార్బన్‌ మోనాక్సైడ్‌తో కలిపి ఇచ్చినప్పుడు యాంటీబయాటిక్‌ ప్రభావం 25 రెట్ల వరకూ ఎక్కువగా ఉందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్‌ బింగే వాంగ్‌ తెలిపారు.

బ్యాక్టీరియా యాంటీబయాటిక్‌కు స్పందించకపోవడం నిరోధకత కాదని, చాలా సందర్భాల్లో అవి మందులకు అలవాటుపడిపోవడం వల్ల యాంటీబయాటిక్స్‌ పనిచేయకుండా పోతాయని ఆయన వివరించారు. బ్యాక్టీరియాను మళ్లీ మందులకు సున్నితంగా మారిస్తే అవి వాటి ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు. గాఢత ఎక్కువగా ఉండే విషంలా పనిచేసే కార్బన్‌ మోనాక్సైడ్‌ను అతి తక్కువ సాంద్రతల్లో వాడినప్పుడు మాత్రం చికిత్సకు ఉపయోగపడుతుందని తాము గుర్తించినట్లు చెప్పారు. శరీరంలో సహజసిద్ధంగా ఉత్పత్తి అయ్యే ఈ వాయువు వాపును తగ్గించడమే కాకుండా.. బ్యాక్టీరియా, వైరస్‌లకు కణాలు ప్రతిస్పందించే గుణాన్ని కూడా పెంచుతాయని చెప్పారు.

కూల్‌డ్రింక్స్‌తో కేన్సర్‌ ముప్పు...
చక్కెరలు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్‌ తాగే అలవాటు ఉన్న వారికి ఊబకాయ సంబంధిత కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువని మెల్‌బోర్న్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ఒకటి తెలిపింది. దాదాపు 35 వేల మంది అలవాట్లను పరిశీలించి జరిపిన విశ్లేషణ ద్వారా కూల్‌డ్రింక్స్‌ 11 రకాల కేన్సర్లపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. ఇవన్నీ ఊబకాయానికి సంబంధించినవే అయినప్పటికీ అధ్యయనంలో పాల్గొన్న వారు మాత్రం ఊబకాయులు కాకపోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిత్యం కూల్‌డ్రింక్స్‌ తాగేవారితో పోలిస్తే కృత్రిమ చక్కెరలతో కూడిన డైట్‌ కూల్‌డ్రింక్స్‌ తాగే వారికి వ్యాధి ముప్పు తక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనం ద్వారా తెలిసిందని అలిసన్‌ హాడ్జ్‌ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు.

అధిక చక్కెర... ఊబకాయానికి, మధుమేహానికి దారితీయవచ్చునని ఇప్పటికే అనేక  పరిశోధనలు స్పష్టం చేస్తూండగా.. కేన్సర్‌ కారకమన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గత ఏడాది జరిగిన ఒక పరిశోధనలో చక్కెరలు కేన్సర్‌ కణాలను ఎలా ప్రేరేపితం చేస్తాయో స్పష్టం అవడమే కాకుండా.. చక్కెరలు కణతి ఎదుగుదలకు తోడ్పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్‌ యూనివర్శిటీ జరిపిన అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది. కేన్సర్ల నివారణకు చక్కెరలను పూర్తిస్థాయిలో త్యజించడమూ అంత మంచిదేమీ కాదని, కణాలకు అవసరమైన శక్తి గ్లూకోజ్‌ ద్వారానే లభిస్తుందన్న విషయం మరువరాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top