టమాటా నిల్వ సామర్థ్యం రెట్టింపు!

herbal Solution for tomatoes - Sakshi

హెర్బల్‌ ద్రావణంతో విశాఖ గృహిణి

బీసీటీ కేవీకే అధ్యయనంలో సత్ఫలితాలు

పండు టమాటాలు ఫ్రిజ్‌లో పెట్టకుండా (గది ఉష్ణోగ్రతలో) ఉంచితే సాధారణంగా వారం గడిచేటప్పటికి ముడతలు వచ్చి కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది. అయితే, విశాఖపట్నానికి చెందిన శ్రీమతి దూబ రాజు అనే గృహిణి తయారు చేసిన హెర్బల్‌ ద్రావణంలో ముంచి తీసి నిల్వ చేసిన టమాటోలు మాత్రం రెండు వారాలకు పైగానే తాజాగా ఉంటున్నాయి. టమాటోల సీజన్‌లో మార్కెట్‌లో ధర తక్కువగా ఉన్నప్పుడు 10–15 రోజులు రైతులు నిల్వ చేసుకోగలిగితే వారి నికరాదాయం బాగా పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ఆకుకూరల రసాలను ఉపయోగించి  శ్రీమతి రాజు తన సొంత ఆలోచనతో ఒక హెర్బల్‌ ద్రావణాన్ని రెండేళ్ల క్రితం తయారు చేశారు.

లీటరు నీటికి 10 ఎం.ఎల్‌. ద్రావణం
ఈ ద్రావణం 10 ఎం.ఎల్‌.ను లీటరు నీటిలో కలిపి.. ఆ నీటిలో టమాటోలను 10 నిమిషాలు నానబెట్టి.. బయటకు తీసి ట్రేలలో నిల్వ చేసుకుంటే సాధారణం కన్నా రెట్టింపు రోజులు నిల్వ ఉంటున్నాయని ఆమె తెలిపారు. రాగి, వెండి, ఇత్తడి తదితర పాత్రలు, వస్తువులను సమర్థవంతంగా శుభ్రం చేయగల హెర్బల్‌ ద్రావణాన్ని శ్రీమతి రాజు గతంలో తయారు చేశారు. అనేక దేవాలయాల్లో వెండి, బంగారం, రాగి, ఇత్తడి పాత్రలను సురక్షితంగా శుభ్రం చేయడానికి వినియోగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టమాటో రైతులకు ఉపయోగపడేలా ఈ ద్రావణాన్ని తయారు చేశానని ఆమె తెలిపారు. రైతు బజారులో కొనుగోలు చేసి తెచ్చిన టమాటోలను.. ఈ ద్రావణంలో ముంచి తీసి.. వాటిని ప్లాస్టిక్‌ ట్రేలలో నింపి, వాటిపైన గోనె సంచి లేదా పాత నూలు చీరను పైన కప్పానని ఆమె తెలిపారు. నెల రోజుల వరకు కుళ్లిపోకుండా ఉన్నాయన్నారు. నూటికి నూరు శాతం ఆకుకూరల రసాలతోనే దీన్ని తయారు చేశానని అంటూ.. ఈ ద్రావణంలో ముంచిన టమాటోల నిల్వ సామర్థ్యం రెట్టింపవుతుందే తప్ప వాటిని తిన్న వారి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదని ఆమె అంటున్నారు.

కృషి విజ్ఞాన కేంద్రంలో అధ్యయనం
విశాఖపట్నం జిల్లాలోని భాగవతుల చారిటబుల్‌ ట్రస్టు కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ ద్రావణాన్ని ఉపయోగించి టమాటోల నిల్వ సామర్థ్యంపై 2017 ఎండాకాలంలో అధ్యయనం జరిగింది. సెంచూరియన్‌ యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఈ ద్రావణాన్ని పరీక్షించి చూడగా.. పండు టమాటోల నిల్వ సామర్థ్యం రెట్టింపైందని కేవీకే అధిపతి డాక్టర్‌ కుర్రా శైలజ తెలిపారు. పండిన, కరపచ్చిగా ఉన్న, పచ్చిగా ఉన్న టమాటాలను మూడేసి చొప్పున తీసుకొని నెల రోజులపాటు పరిశీలించారు. ద్రావణంలో ముంచి తీసిన టమాటోలతోపాటు సాధారణ టమాటోలను గది ఉష్ణోగ్రతలోను, వరండాలోను ట్రేలలో నిల్వ చేశారు.

గదిలో ఉంచిన పండిన టమాటాలు మామూలువి 8–10 రోజులు మార్కెట్‌లో అమ్మదగినంత తాజాగా ఉండగా, ద్రావణంలో ముంచినవి 16–20 రోజులు తాజాదనాన్ని కోల్పోకుండా ఉన్నాయని డాక్టర్‌ శైలజ తెలిపారు. దోరగా ఉన్న టమాటోలు మామూలువి 12–14 రోజులు అమ్మదగినంత బాగుంటే.. ద్రావణంలో ముంచినవి 22–24 రోజుల పాటు నిల్వ ఉన్నాయి. గది వెలువల వరండాలో నిల్వ చేసిన టమాటోలు 4 రోజుల ముందే వడలిపోయాయని ఆమె తెలిపారు.

కొద్ది పరిమాణంలో టమాటోలనే నిల్వ చేసి చూశామని, భారీ పరిమాణంలో నిల్వ చేసినప్పుడు ఫలితం ఎలా ఉండేదీ పరీక్షించాల్సి ఉందని డా. శైలజ  వివరించారు. శ్రీమతి రాజు భర్త కనకారావు తోడ్పాటుతో ఈ ద్రావణాన్ని తయారు చేసి అర లీటరు రూ. వందకు విక్రయిస్తున్నారు. ఈ ద్రావణం టమాటో రైతులతోపాటు వినియోగదారులు కూడా ఉపయోగించుకోవచ్చని శ్రీమతి రాజు(96421 13002, 95738 19031) అంటున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్, పల్లెసృజన సంస్థల ద్వారా శాస్త్రీయ పరీక్షలు జరిపించి, పేటెంట్‌కు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె వివరించారు.

   శ్రీమతి దూబ రాజు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top