ప్లాస్టిక్‌ బాటిళ్లలో పచ్చటి మొక్కలు

Green plants in plastic bottles - Sakshi

గ్రీన్‌ గోళం

ఇది హరిత మాసం. అవును! మీరు పొరపాటుగా ఏమీ చదవలేదు. ఆషాడాన్ని హరితంగా మార్చడం కాదిది. బీడును పచ్చగా పండించాలని తెలంగాణ ప్రభుత్వం హరితహారాన్ని అల్లుతోంది. అందుకోసం గ్రీన్‌ చాలెంజ్‌ విసిరింది. నాలుగేళ్ల నుంచీ ఈ ప్రయత్నం సాగుతోంది. బాగానే ఉంది కానీ.. హైదరాబాద్‌ లాంటి చోట అంగుళం కూడా చోటు వదలకుండా కాంక్రీట్‌ను పేరుస్తున్నారు. మొక్కలు నాటడానికి మట్టి ఎక్కడుంది? ఇందుకు పరిష్కారంగా చాలామంది మిద్దె తోటలతో (టెర్రస్‌ గార్డెన్స్‌తో) నేల విడిచి సాగు చేయమని సలహా ఇస్తున్నారు. చేసి చూపిస్తున్నారు కూడా. ఇక్కడ మనం ఇలా ఉంటే.. మిద్దెలే కాదు గోడల్నీ వదిలిపెట్టకండి అని పంజాబ్‌లోని లుధియానా రైల్వేస్టేషన్‌ కూడా ఓ ప్రయోగాన్ని అమల్లోకి తెచ్చింది. తాముంటున్న ప్రదేశాన్ని ప్లాస్టిక్‌ ఫ్రీగా కూల్‌గా చేసేసింది. 

దేశంలోనే ఫస్ట్‌
నిజానికి ఈ వర్టికల్‌ గార్డెన్‌ (నిలువు తోట) పంజాబ్‌లోని లుధియానాలో మొదలుపెట్టింది ప్లాస్టిక్‌ని నిషేధించడానికి, ప్లాస్టిక్‌ వేస్ట్‌ను నియంత్రించడానికి. ఓ సంవత్సరం కిందట లుధియానాలోని రెవెన్యూ అధికారి రోహిత్‌ మెహ్రాకు ఈ ఆలోచన వచ్చింది. లుధియానా రైల్వేస్టేషన్‌ చుట్టుపక్కలంతా ప్లాస్టిక్‌ బాటిల్సే. వాటిల్తో రైల్వేస్టేషన్‌ గోడల మీద మొక్కలు పెంచాలనుకున్నాడు. అధికారుల అనుమతితో యేడాది కిందట దాదాపు 37వేల మొక్కలతో ఈ కార్యక్రమానికి నీరు పోశాడు. ఇప్పుడు ఇదిగో... ఈ ఫొటోలో కనిపిస్తున్నట్టు గోడలన్నీ పచ్చగా.. లోపలి వాతావరణమంతా కనీసం అయిదు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గి చల్లగా.. రైల్వేస్టేషన్‌ చుట్టుపక్కలంతా శుభ్రంగా తయారయింది. 

హైదరాబాద్‌లో...
మన దగ్గర హరితహారం పుణ్యమాని ఇప్పటికే చాలా అవగాహన వచ్చేసింది. పర్యావరణవేత్తల కృషితో చాలామంది మిద్దె తోటలూ పెంచేస్తున్నారు. గవర్నమెంట్‌ ఆఫీస్‌ల కాంపౌండ్స్‌ అన్నీ మొక్కలతో కళకళలాడుతున్నాయి. అక్కడితో ఆగకుండా రోహిత్‌ మెహ్రా స్ఫూర్తితో మనం కూడా గ్రీన్‌ చాలెంజ్‌ను ప్రభుత్వ కార్యాలయ గోడలు, ఫ్లై ఓవర్స్, మెట్రో పిల్లర్స్‌కూ పాకించేద్దాం! ఈ సవాల్‌నూ రెండు రాష్ట్రాలకూ విసిరి.. ఒకర్నొకరం ప్లాస్టిక్‌ రహిత హరిత ప్రాంతాలుగా చేసుకుందాం!   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top